జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు

ABN , First Publish Date - 2023-10-12T00:36:58+05:30 IST

డోర్నకల్‌ మండలం మీదుగా నూతనంగా నిర్మించనున్న జాతీయ రహదారి 365/ఎ (మహబూబాబాద్‌- కోదాడ) విస్తరణ పనులకు ప్రస్తుతం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా మండలంలోని ముల్కలపల్లి, రావిగూడెం, రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రహదారి విస్తరణ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం చెల్లించే పరిహారం తమకు ఆమోదయోగం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు

భూసేకరణ అధికారులకు కత్తిమీద సామే

ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం పరిహారానికి రైతుల డిమాండ్‌

డోర్నకల్‌, అక్టోబరు 11 : డోర్నకల్‌ మండలం మీదుగా నూతనంగా నిర్మించనున్న జాతీయ రహదారి 365/ఎ (మహబూబాబాద్‌- కోదాడ) విస్తరణ పనులకు ప్రస్తుతం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా మండలంలోని ముల్కలపల్లి, రావిగూడెం, రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రహదారి విస్తరణ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం చెల్లించే పరిహారం తమకు ఆమోదయోగం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముల్కలపల్లిలో భూములు మహా ప్రియం..

డోర్నకల్‌ మండలంలోని ముల్కలపల్లిలో రోడ్డుకు ఇరు వైపుల ఉన్న భూముల రేట్లు మండిపోతున్నాయి. ఇక్కడ గుంట భూమి ధర ప్రస్తుతం రూ.15 లక్షలు పలుకుతోంది. అంటే ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6 కోట్లకు పైమాటే. ఈ ధర చెల్లించి కొనడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నా అమ్మేవారు మాత్రం లేరు. అయితే జాతీయ రహదారి విస్తీర్ణం కొరకు ముల్కలపల్లిలో రెవెన్యూ అధికారులు కొద్దిరోజుల క్రితం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో హైవే విస్తరణకు 8 ఎకరాలకు పైగా భూమి అవసరం పడుతుందని అధికారులు తేల్చారు. అలాగే రావిగూడెం రెవెన్యూ పరిధిలో భూముల రేట్లు ఇంచుమించు అలాగే ఉన్నాయి. రావిగూడెం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి విస్తర్ణకు 6.30 ఎకరాలు అవసరమవుతుందని అధికారుల సర్వేలో తేలింది.

భూసేకరణ అధికారులకు కత్తిమీద సామే...

ముల్కలపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆది నుంచి వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందారు. రాజకీయంగా, విద్యాపరంగా బాగా చైతన్యం కలిగివారు. మహబూబాబాద్‌ - ఖమ్మం రహదారి ముల్కలపల్లి గ్రామం మీదుగా వెళ్తుంది. డోర్నకల్‌ మండల కేంద్రం కన్నా ఖమ్మం పట్టణం ముల్కలపల్లికి దగ్గరగా ఉండడంతో గ్రామస్థులు ఎక్కువగా ఖమ్మంకు వెళ్తుంటారు. అలాగే ఖమ్మంలో వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదిగారు. చాలా మంది రైతుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఆకేరు సమీపంలో ఉండడంతో వ్యవసాయం కూడ బాగానే అభివృద్ధి చెందింది. దీంతో గ్రామంలో చాలా మంది రైతులు ఆర్ధికంగా ఉన్న వారే కావడంతో అక్కడ భూములకు ధరలు విపరీతంగా పెరిగాయి.

రైతులను వెన్నాడుతున్న పరిహారం భయం...

ఇప్పటికే ముల్కలపల్లి, రావిగూడెంకు చెందిన రైతుల భూముల గుండా సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ వెళ్తుంది. కాలువ నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సేకరించిన భూమికి ఎకరాకు రూ.12.5 లక్షలు మాత్రమే చెల్లించారు. అయితే ప్రభుత్వ పరిహారం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రైతులు మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు గత రెండేళ్ల క్రితం పెద్ద ఆందోళన చేపట్టారు. ముల్కలపల్లి, రావిగూడెం గ్రామాలను ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి చెందిన రైతులకు సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కొరకు పరిహారంగా ప్రభుత్వం అప్పుడు ఎకరాకు రూ.18 లక్షలకు చెల్లించారు. తమకు మాత్రం రూ.12.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, సుమారు ఎకరాకు రూ.5.5 లక్షలు తాము నష్టపోయామని రైతులు నిరసన తెలిపారు. అయినప్పటికీ వారి నిరసను ఎవరు పట్టించుకోలేదు. దీంతో అయిష్టంగానే రైతులు పరిహారాన్ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు జాతీయ రహదారి విస్తరణలో కూడ అదేవిధంగా పరిహారం చెల్లిస్తారేమోనన్న భయం రెండు గ్రామాల రైతులను వెన్నాడుతోంది. దీంతో తమకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర చెల్లించిన తర్వాతే భూములు సేకరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్‌ ప్రకారం భూములకు ధర చెల్లించాలి : జవ్వాజీ రాంప్రసాద్‌, సర్పంచ్‌, ముల్కలపల్లి, డోర్నకల్‌

మా ఊరు మీదుగా వెళ్లే మహబూబాబాద్‌- కోదాడ జాతీయ రహదారి 365/ఎ వల్ల రోడ్డుపక్కన ఉన్న మా భూమి కోల్పోతున్నాం. బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి విలువ రూ.60 లక్షలకు పైమాటే ఉంటుంది. అధికారులు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం తమ భూములకు పరిహారం చెల్లించాలి.

Updated Date - 2023-10-12T00:36:58+05:30 IST