Share News

మహిళా సంఘాలపై నజర్‌

ABN , First Publish Date - 2023-11-19T23:12:01+05:30 IST

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా గంపగుత్తగా ఓట్లను వేయించుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు అడుగుతున్నారు. వ్యక్తిగతంగా కలవడంతోపాటు గంపగుత్తగా ఓట్లు పడేట్టు చూసుకుంటున్నారు. కుల, యువజన సంఘాలతో పాటు అత్యధికంగా సభ్యులున్న మహిళా సంఘాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

మహిళా సంఘాలపై నజర్‌

గంప గుత్తగా ఓట్ల కోసం అభ్యర్థుల ప్రయత్నం

మహిళా ఓటర్ల ప్రసన్నానికి తాయిలాలు

పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో గాలం

అడిగినవి ఇచ్చేందుకు సంసిద్ధత

ప్రచారంలోనూ మహిళా కార్యకర్తలకు పెద్ద పీట

హనుమకొండ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా గంపగుత్తగా ఓట్లను వేయించుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు అడుగుతున్నారు. వ్యక్తిగతంగా కలవడంతోపాటు గంపగుత్తగా ఓట్లు పడేట్టు చూసుకుంటున్నారు. కుల, యువజన సంఘాలతో పాటు అత్యధికంగా సభ్యులున్న మహిళా సంఘాలపై ప్రధానంగా దృష్టి సారించారు. సంఘాలను మచ్చికచేసుకొని వాటి ద్వారా ఆ సంఘాల్లోని మహిళా సభ్యుల ఓట్లన్నీ తమకే పడేట్టు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మహిళాసంఘాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వారికి ఏం కావాలో ఆరా తీస్తున్నారు. ఆయా సంఘాల్లో ఎంతమంది సభ్యులున్నది వివరాలు తీసుకుంటున్నారు. వారందరి ఓట్లు తమకే పడేట్లు వారికి తాయిలాల ఎర వేస్తున్నారు. తాము ఎన్నికైన తర్వాత అడిగింది చేసిపెడతామని హామీ ఇస్తున్నారు.

1.67లక్షల మంది సభ్యులు

హనుమకొండ జిల్లా పరిధిలోని వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గం పరిధిలో 1,114 గ్రామ సంఘాలు ఉన్నాయి. వీటిలో 12,479 స్వయం సహాయక మహిళా సంఘాలుండగా, 1,67,716 మంది సభ్యులున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల స్థానిక నాయకులు, అనుచరులను రంగంలోకి దింపుతున్నారు. వారు తమకున్న పరిచయాలతో మహిళా సంఘాల మద్దతు కోసం రాయబారాలు మొదలు పెడుతున్నారు. అభ్యర్థుల సూచనలు, సలహాల మేరకు తమకు బాగా సన్నిహిత సంబంధాలున్న గ్రూపులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతుగా నిలబడటమేకాకుండా వారి బంధు మిత్రుల ఓట్లు కూడా దక్కేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇందు కోసం మహిళా సంఘాల సభ్యులు ఏం కోరినా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బును సైతం ముట్టచెబుతున్నారు. గెలిస్తే రాయితీ రుణాలు మరింత ఎక్కువగా ఇప్పిస్తామని ఆశచూపుతున్నారు. ఇలా బేరాలు గుట్టుగా సాగిస్తున్నారు. సంఘాల బాధ్యతలు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే చందంగా తమ సంఘంలోని సభ్యులను బట్టి పెద్దమొత్తంలో డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. తమకు కావలసినవి ఇప్పుడే సమకూర్చాలని, అప్పుడే మీ వెంట ఉంటామని అభ్యర్థులకు తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని గ్రూపులు బహిరంగంగానే మద్దతు ఇస్తామని, మరికొన్ని తెరచాటున పని చేస్తామని హామీలిస్తున్నాయి. పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఈ తరహా మంతనాలు జోరుగా సాగుతున్నాయి.

మహిళా ఓటర్లే ఎక్కువ

పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సుమారు పదివేల వరకు ఉన్న ఈ ఓటర్లే అభ్యర్థుల గెలుపునకు కీలకం కాబోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేవారికే విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో వారు సభ్యులుగా ఉన్న మహిళా సంఘాలనే అభ్యర్థులు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేది కూడా మహిళలే. ఈ కారణంగా కూడా అభ్యర్థులు వారినే ఎక్కువగా నమ్ముకుంటున్నారు.

ప్రచారంలో మహిళలు

ఎన్నికల ప్రచారంలోనూ అభ్యర్థులు మహిళలనే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళా కార్యకర్తలు సులువుగా దూసుకుపోగలగుతున్నారు. అభ్యర్థులు పురుష ఓటర్లతో చొచ్చుకుపోతున్నంతగా మహిళా ఓటర్లతో మమేకం కాలేకపోతున్నారు. ఆ గ్యాప్‌ను వారి వెంట ప్రచారంలో ఉన్న మహిళా కార్యర్తలు తీరుస్తున్నారు. మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి, కరపత్రాలను ఇచ్చి ఓట్లను అడుగుతున్నారు.

Updated Date - 2023-11-19T23:12:02+05:30 IST