మంత్రి సత్యవతి ఇల్లు ముట్టడి

ABN , First Publish Date - 2023-09-22T00:07:48+05:30 IST

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఇంటిని అంగన్‌వాడీ ఉద్యోగులు ముట్టడించారు.

మంత్రి సత్యవతి ఇల్లు ముట్టడి
మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌ ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

రెండు గంటల పాటు అంగన్‌వాడీల ఆందోళన

ప్రభుత్వం చర్చలకు పిలవాలని నేతల డిమాండ్‌

మహబూబాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 21: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఇంటిని అంగన్‌వాడీ ఉద్యోగులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రం శివారు రామచంద్రాపురం కాలనీలోని మంత్రి సత్యవతిరాథోడ్‌ ఇంటి ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేయగా అక్కడ కొద్దిసేపు పోలీసులకు అంగన్‌వాడీలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆపై బారీకేడ్లను తొలగించుకుని, ఇతర మార్గాల గుండా అంగన్‌వాడీలు పెద్దఎత్తున తరలివచ్చి మంత్రి ఇంటిని ముట్టడించారు. దాదాపు రెండు గంటల పాటు ఇంటి ఎదుట కూర్చుని ఆందోళన నిర్వహించారు. కాగా, మానుకోట జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీల ఆందోళన సమయంలో మంత్రి సత్యవతిరాథోడ్‌ ములుగు పర్యటనలో ఉండగా అంగన్‌వాడీలు ఎవరూ మంత్రి ఇంట్లోకి వెళ్లకుండా టౌన్‌ సీఐ సతీష్‌ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం చర్చలకు పిలవాలి..

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష వీడి చర్చలకు పిలవాలని ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.అజయ్‌సారథిరెడ్డి, ఆకుల రాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 సంవత్సరాలుగా ఐసీడీఎస్‌లో 70వేల మంది అంగన్‌వాడీలు పని చేస్తున్నారని, అయినా వారికి కనీస వేతనం అమలు చేయడం లేదని విమర్శించారు. 11 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నప్పటికి సమస్యలను పరిష్కరించని ప్రభుత్వం బెదిరింపు ధోరణిని అవలంభిస్తుందని ఆరోపించారు. సంబంధిత శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అంగన్‌వాడీలను మభ్యపెట్టే ప్రకటనలు మానుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీ సంఘాల నేతలను చర్చలకు పిలవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు కుంట ఉపేందర్‌, రేషపల్లి నవీన్‌, పెరుగు కుమార్‌, సమ్మెట రాజమౌళి, కుమ్మరికుంట్ల నాగన్న, నర్రా శ్రావణ్‌, నక్క నాగార్జున, కందునూరి శ్రీనివాస్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు స్నేహబిందు, ఎల్లారీశ్వరీ, తిరుపతమ్మ, వెంకటరత్నం, జ్యోతి, సంపూర్ణ, వెంకటమ్మ, సరోజ, లక్ష్మినర్సమ్మ, బానోత్‌ లలిత, మంగ, రజియా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:07:48+05:30 IST