‘కలుషిత’ వసతి గృహాలు

ABN , First Publish Date - 2023-03-11T00:02:38+05:30 IST

పేద విద్యార్థుల విద్యాభ్యున్నతికి, వారి సంక్షేమ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో సంక్షేమం కొరవడుతోంది. కలుషిత ఆహారం, తాగునీరు. పారిశుధ్య లోపంతో తరచుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో ఇలాంటి సంఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి.

‘కలుషిత’ వసతి గృహాలు

జిల్లాలో అస్తవ్యస్తంగా హాస్టళ్లు

కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత

మెనూ ప్రకారం అందని భోజనం

పట్టింపులేని వెల్ఫేర్‌ అధికారులు

అప్‌ అండ్‌ డౌన్‌లతో విధులు మమ

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ప్రత్యేకాధికారులను నియమించినా ఫలితం శూన్యం

వరుస ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, మార్చి 10: పేద విద్యార్థుల విద్యాభ్యున్నతికి, వారి సంక్షేమ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో సంక్షేమం కొరవడుతోంది. కలుషిత ఆహారం, తాగునీరు. పారిశుధ్య లోపంతో తరచుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో ఇలాంటి సంఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి.

తాజాగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఏకంగా 51 మంది విద్యార్థినులు ఫుడ్‌ పాయిజన్‌తో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారికి జిల్లా ఆస్పత్రి, పాఠశాలలో వైద్యాన్ని అందించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంబంధిత అధికారులే కాకుండా అన్ని శాఖల జిల్లా అధికారులను జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు ప్రత్యేకాధికారులుగా నియమించి పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశాలు జారీ చేసినప్పటికి అది అమలుకు నోచుకోకపోవడం లేదు. దీంతో ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు ఎదురవుతున్నాయి.

జిల్లాలో 121 సంక్షేమ హాస్టళ్లు

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలకు సంబంధించిన గురుకులాలు, హాస్టళ్లు 121 ఉండగా, వాటిల్లో సుమారు 30వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రతీ రోజు అందించాల్సిన మెనూను హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు అమలుచేయకుండా తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభు త్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యనందించటంతో పాటు వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పించేందుకు యేటా ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు చెస్తున్నప్పటికీ ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్న దాఖలాలు కనిపించటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానికంగా ఉండని వార్డెన్లు

జిల్లావ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో చాలావరకు వార్డెన్లు స్థానికంగా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో వార్డెన్లు లేకపోవడంతో ఒకరికే రెండు లేదా మూడు హాస్టళ్లకు ఇన్‌చార్జులుగా నియమించడంతో వారు సమయం కేటాయించపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. ఇన్‌చార్జులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కొంతమంది వార్డెన్లు అప్‌అండ్‌డౌన్‌ చేస్తూ రాత్రి భోజనానికి, ఉదయం అల్పాహారానికి కావాల్సిన సరుకులు వంట సిబ్బందికి ఇచ్చి వెళ్లిపోవడంతో.. వారు వండిందే వంట పెట్టిందే భోజనంగా తింటూ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తూ ఎవరికి చెబితే ఏమౌతుందోననే భయాందోళనతో ఉంటున్నట్లు తెలుస్తోంది.

మెనూ భేఖాతరు

జిల్లాలోని వివిధ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాల్సిన హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు (హెచ్‌డబ్ల్యూవో)లు నిబంధనలు తుంగలో తొక్కి డోంట్‌ కేర్‌ అంటూ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన భోజ నం అందించేందుకు ప్రభుత్వం సూచించిన మెనూ బోర్డులను సైతం ప్రదర్శించకుండా వార్డెన్లు విద్యార్థులకు అందించేదే మెనూ.. అమలుచేసేవేనిబంధనలుగా కొనసాగిస్తున్నారు. కొన్ని హాస్టళ్లలోనైతే వార్డెన్లు అందుబాటు లో ఉండకపోవడంతో సిబ్బంది ఉదయం పెట్టిందే టిఫిన్‌.. మధ్యాహ్నం, రాత్రి అందించిందే భోజనం.. ప్రభుత్వం సూచించిన మెనూతో తమకు అవసరంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలుపరిచే విధంగా తనిఖీలు చేపడుతారా లేదా అని వేచిచూడాల్సిందే.

వరుస ఘటనలతో ఆందోళన

  • ఏడాది కిందట సీరోలులోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా సదరు పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పాఠశాలకు వెళ్లి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

  • గత ఏడాది జూలై 27న గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు.

  • రెండు రోజుల వ్యవధిలోనే జూలై 29న జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారంతో 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

  • ఆగస్టు 24న గూడూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌ మెనూ పాటించటంలేదని, వంట సరుకులను బయటకు తీసుకువెళ్తున్నారని, బయటి వ్యక్తులు హాస్టల్‌కు వస్తున్నారనే పలు ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.

  • ఆగస్టు 30న మహబూబాబాద్‌ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

  • తాజాగా జిల్లా కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయలో ఈనెల 9న 51 మంది విద్యార్థినులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-03-11T00:02:38+05:30 IST