వైభవంగా ఐనవోలు మల్లన్న కల్యాణం

ABN , First Publish Date - 2023-03-20T00:20:40+05:30 IST

ఐనవోలు మల్లికార్జునస్వామి వారాంతపు జాతరలో చివరి ఆదివారం మల్లన్న కల్యాణం.. పెద్దపట్నంను వైభవంగా నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలు ముగిశాక ఉగాదికి ముందు వైదిక పద్ధతిలో కల్యాణం జరుపగా జానపదుల తంతులో పెద్దపట్నం వేయడం ప్రత్యేకంగా నిలిచింది.

వైభవంగా ఐనవోలు మల్లన్న కల్యాణం
పెద్దపట్నంకు ముందు కల్యాణం నిర్వహిస్తున్న యాగ్నికులు

వారాంతపు జాతరకు తరలివచ్చిన లక్షలాది భక్తులు

ఐనవోలు, మార్చి 19: ఐనవోలు మల్లికార్జునస్వామి వారాంతపు జాతరలో చివరి ఆదివారం మల్లన్న కల్యాణం.. పెద్దపట్నంను వైభవంగా నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలు ముగిశాక ఉగాదికి ముందు వైదిక పద్ధతిలో కల్యాణం జరుపగా జానపదుల తంతులో పెద్దపట్నం వేయడం ప్రత్యేకంగా నిలిచింది. అందులో భాగంగా శ్రీబలిజే మేడమ్మ, గొల్లకేతమ్మ అమ్మవార్ల సమేత మల్లికార్జునస్వామి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. ఆలయ పెద్దరథం నిర్వహకుడు డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి ప ట్టువస్త్రాలు తీసుకవచ్చారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ అ ర్చకులు సంపత్‌కుమార్‌శర్మ, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌, ఐనవోలు మధుకర్‌శర్మ, యాగ్నికులు అర్చక బృందం కల్యాణం జరిపారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జెలి శ్రీరాములు, ఆలయ మాజీ చైర్మన్‌లు మునిగాల సంపత్‌కుమార్‌, శ్రీనివాస్‌, భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

పెద్దపట్నంపై శివతాండం

పెద్దపట్నంను ఆలయ ప్రాంగణంలోని కాకతీయుల నృత్యమండపం ఉత్తరం వైపున 44 అడుగుల వెడల్పు, పొడవుతో వివిధ రకాల చూర్ణమూలు(పిండి) ముగ్గులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు అందంగా పట్నం వేశారు. కల్యాణం తదుపరి ఉత్సవవిగ్రహాలతో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు, అర్చకులు పట్నం చుట్టు ప్రదక్షణ చేశారు. పట్నంపైన శ్రీగొల్లకేతమ్మ, బలిజే మేడమ్మ అమ్మవార్ల సమేత మల్లన్నస్వామి ఉత్సవ విగ్రహాలను అవాహనం చేసి ఒగ్గు కథ ద్వారా కల్యాణం గాథను వినిపించారు. భక్తులు భక్తి పరవశ్యంతో పట్నంపై మండుటెండలో మైమరిచి నృత్యం.. శివతాండవం చేశారు. పర్వతగిరి సీఐ అనుముల శ్రీనివాస్‌, ఐనవోలు ఎస్సై జి.వెంకన్నల నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - 2023-03-20T00:20:40+05:30 IST