కేటీఆర్‌ వరాల జల్లు

ABN , First Publish Date - 2023-02-28T01:13:17+05:30 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి రాష్ట్ర ఐటీ, మునినిసల్‌ పరిపాలన శాఖ మంత్రి కె.తారకరామారావు వరా ల జల్లు కురిపించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని షోడషపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగిన పనులకు వెంటనే మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

కేటీఆర్‌ వరాల జల్లు

స్టేషన్‌ఘన్‌పూర్‌ను మునిసిపాలిటీ చేస్తాం..

డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం..

ధర్మసాగర్‌ బండ్‌ పర్యాటక అభివృద్ధి కోసం రూ.4కోట్లు

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి కేటీఆర్‌ హామీలు

సోడషపల్లిలో రూ.124.93కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజం

భారీ జనసమీకరణతో బహిరంగ సభ సక్సెస్‌

ఓరుగల్లు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి రాష్ట్ర ఐటీ, మునినిసల్‌ పరిపాలన శాఖ మంత్రి కె.తారకరామారావు వరా ల జల్లు కురిపించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని షోడషపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగిన పనులకు వెంటనే మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ పట్టణాన్ని రెండు గ్రామాలను కలుపుకుని మునిసిపాలిటీగా ఉన్నతీకరించాలని కోరారు. మహిళల కోసం మాత్రమే ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ఉందని, అదనంగా కోఎడ్యుకేషన్‌తో కూడిన డిగ్రీ కళాశాల కావాలని కోరారు. దీంతో కేటీఆర్‌ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరు చేయిస్తానన్నారు. నియోజకవర్గంలోని 30గ్రామాల్లోని 6,790ఎకరాల భూమికి రెండు పంటలకు సాగు నీరు అందించేందుకు రూ.104కోట్ల 92లక్షలతో మూడు మినీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశామని కేటీఆర్‌ చెప్పారు. అదే విధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకర్గంలో ఒకే ఒక్కరోజు రూ.124.93 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. వరంగల్‌ నగరానికి తాగునీరు అందించే ధర్మసాగర్‌ సుందరీకరణకోసం రూ.4కోట్లను కేటాయిస్తున్నామని కేటీఆర్‌ ప్రకటించారు. పంచాయితీ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులు కూడా త్వరలోనే చేపడతామన్నారు.

ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటాం..

ఆత్మహత్య చేసుకున్న ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ సంఘటనను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని, ప్రీతి కుటుంబాన్ని అన్ని రకాల ఆండగా ఉంటామన్నారు. ప్రీతికి అన్యాయం చేసినవాడిని విడిచిపెట్టేది లేదని, చట్టపరమైన శిక్షపడేట్టు చూస్తామన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ నైతలపై ఫైర్‌

బహిరంగసభలో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌, ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి తీరును ఓపిట్టకథ రూపంలో ఎత్తిచూపారు. తప్పుదారి పట్టి తల్లిదండ్రులను చంపిన ఓ కొడుకు.. జడ్జి ముందు ‘నేను అనాథను.. నాకు ఏ శిక్షవేయకండి..’ అన్నాడట. హంతకుడే సంతాపం చెప్పినట్టు.. నిన్న, మొన్నటి దాక తెలంగాణను చావకొట్టినోళ్లే ఇవ్వాళ వచ్చి అది లేదు.. ఇదీ లేదు.. అంటూ ఎకసెక్కపు మాటలు మాడ్లాడుతున్నారని విమర్శించారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి పాదయాత్రలు చేస్తున్నారని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని విమర్శించారు. మీ జిల్లాలో తిరుగుతున్న ఒకాయన. కాంగ్రెస్‌ అధ్యక్షుడట. ఇది కాలేదు.. అది కాలేదు.. అంటూ చందమామలో చిన్నచిన్న మచ్చలు చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. సిగ్గులేక మళ్లీ ఒక్క చాన్సివ్వండి... అని అడుక్కుంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యవసాయంలో పంజాబ్‌తో పోటీపడుతోందన్నారు. ఇదంతా సాగునీరు ప్రాజెక్టులను బాగుచేసి, ఉచిత కరెంట్‌ ఇచ్చి, రైతు బంధు అమలు చేయడం వల్లనే సాధ్యమైందన్నారు.

నాలుగు కోట్ల సభ్యుల వసుధైక కుటుంబం

విమర్శించడానికి ప్రతిపక్షాలకు తెలంగాణలో ఏసమస్య లేకపోవడంతో కుటుంబపాలన అంటూ ఒకటి పట్టుకున్నారన్నారు. అవును మాది బరాబర్‌ కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది కుటుంబసభ్యులకు కుటుంబ పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్‌. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బందు డబ్బులువేసి వారి కుటుంబంలో భాగమయ్యాడు. 45లక్షల మంది పెద్దవాళ్ళకు రూ.2వేల పింఛన్‌ ఇచ్చి ఆసరా కర్రయ్యాడు. షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష డబ్బులు ఇచ్చి మేనమామ కాలేదా? సర్కార్‌ దవాఖానాలను అభివృద్ధి చేసి అక్కడ పుట్టిన ఆ పసిపిల్లలకు తాత కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది కుటుంబ పాలనే అన్నారు. నాలుగుకోట్ల సభ్యుల వసుదైక కుటుంబమేనన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో రెండు పంటలకు నీళ్లించేందుకు దేవాదుల పూర్తికి రూ. 8వేల కోట్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దుర్భిక్షంగా ఉన్న జనగామ జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత కేసీర్‌కే దక్కుతుందన్నారు.

బీజేపీ కోతల ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో మాటలు చెప్పుడు తప్పా బుడ్డపైస పని కూడా చేయలేదన్నారు. నాడు నరేంద్రమోదీ జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే ధన్‌ దన్‌ అంటూ డబ్బులు వేస్తానన్నాడు. వచ్చాయా.. అని సభికులను ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని డబుల్‌ అన్నారు. ఎవరి ఆదాయం డబుల్‌ అయింది అని అడిగారు. నల్లధనం వెలికితీస్తానన్నారు. తీశాడా.. అని ప్రశ్నించారు.

ఢిల్లీలో పేకుడు.. ఇక్కడ జోకుడు..

ఢిల్లీలో ఉన్నోళ్లు పేకుడు. ఇక్కడ ఉన్నోళ్లేమో జోకుడు అని కేటీఆర్‌ విమర్శించారు. వ్యాక్సిన్‌ కనుగొన్నది మోదీ అంటున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉన్నదన్నారు. మసీదు కూలగొడదామని బండి సంజయ్‌ అంటున్నాడని, శివం వెళితే తమదని, శవం వెళితే మీదని అంటున్నాడని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యే అయ్యేది మసీదులు తవ్వడానికా అన్ని ఎద్దేవా చేశారు. మోదీ నా దేవుడు అని సంజయ్‌ అనడాన్ని కేటీఆర్‌ ఎగతాళి చేశారు. ఎవరికి దేవుడు. ఎందుకు దేవుడు అని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సొంత గ్రామమైన షోడషపల్లిలో జరిగిన ఈ సభకు ఎంఎల్‌ఏ డాక్టర్‌ రాజయ్య సభకు అధ్యక్షత వహించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, సతీష్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌, జనగామ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, వరంగల్‌ జడ్పీ చైర్మెన్‌ గండ్రజ్యోతి, హనుమకొండ జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, ములుగు జడ్పీ చైర్మన్‌ జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

సాయిచంద్‌ మాట-పాట

కేటీఆర్‌ బహిరంగసభకు భారీగా జనం హాజరయ్యారు. వేలేరు, ధర్మసాగర్‌తో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల నుంచి ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు, నృత్యాలతో అలరించారు. గాయకుడు సాయిచంద్‌ తన గానంతో జనాన్ని ఉర్రూతలూగించాడు.

Updated Date - 2023-02-28T01:13:48+05:30 IST