కొత్త కొత్తగా..

ABN , First Publish Date - 2023-01-01T00:58:05+05:30 IST

కొత్త సంవత్సరం హుషారుతో యువత పరవళ్లు తొక్కింది. రెండు సంవత్సరాలుగా కరోనా ఆంక్షలతో కొంత మేరకు జోష్‌ తగ్గినా న్యూఇయర్‌ వేడుకలు ఈసారి అంతకు మించి జరిగాయి. నగరంలో ఎక్కడ చూసినా... యువత సంబరాల్లో మునిగితేలింది.

కొత్త కొత్తగా..

అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు

కేక్‌ల కటింగ్‌... స్వీట్ల పంపిణీ..

సందడిగా బార్లు, రెస్టారెంట్లు

న్యూయర్‌ సందేశాలతో హోరెత్తిన సెల్‌ఫోన్లు

వరంగల్‌ సిటీ, డిసెంబరు 31: కొత్త సంవత్సరం హుషారుతో యువత పరవళ్లు తొక్కింది. రెండు సంవత్సరాలుగా కరోనా ఆంక్షలతో కొంత మేరకు జోష్‌ తగ్గినా న్యూఇయర్‌ వేడుకలు ఈసారి అంతకు మించి జరిగాయి. నగరంలో ఎక్కడ చూసినా... యువత సంబరాల్లో మునిగితేలింది. వైన్స్‌ షాపులు ముందు బారులు తీరాయి. బార్లు కిక్కిరిసి పోయాయి. అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీ పడుతూ మగువలు రంగ వల్లులతో నూతన సంవ త్సరానికి స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ కేక్‌లు కట్‌ చేస్తూ యువత నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్థరాత్రి దాటిన తరువాత రోడ్లపై మందు బాబుల వీరంగాన్ని అరికట్టేందుకు పోలీసులు గస్తీలు ముమ్మరం చేశారు. సెల్‌ ఫోన్లలో న్యూఇయర్‌ శుభాకాంక్షల మెసెజ్‌లతో హోరెత్తాయి.

యువత హుషారు ..

డిసెంబరు 31 కావడంతో నగరంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు కేక్‌లు కట్‌ చేస్తూ వేడుకలు ఆరంభించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... కొంగొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. నగరంలోని యువత మధ్యాహ్నం నుంచే 31 రాత్రి వేడుక చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ సందడిగా గడిపారు. కాలనీల్లో డీజే సాంగులతో హుషారు నింపారు. అపార్టుమెంట్లు ఆటపాటలతో సందడిగా మారాయి. సమూహాలుగా ఏర్పడి కేక్‌లు కట్‌ చేస్తూ సందడిగా గడిపారు.

నూతన సంవత్సర వేడుకలకు మందు బాబులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం షాపుల బార్లు తీరారు. అర్ధరాత్రి వరకు నగరంలోని బార్లు కిక్కిరిసి పోయాయి. ప్రతీ యేడాది లాగే ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకల్లో మందు జోష్‌ నింపింది. కాలనీల్లో అర్ధరాత్రి 12 గంటలు తర్వాత యువత బాణాసంచా కాల్చి నయాసాల్‌కు స్వాగతం పలికారు.

పోలీసుల పహారా...

అర్ధరాత్రి యువత రోడ్లపై హల్‌ చల్‌ చేస్తూ ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. ముందస్తుగానే నగర పోలీస్‌ కమీషనర్‌ సూచనల మేరకు లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడ ఎలాంటి చేదు ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే కేసులు నమోదు చేస్తామని ముందస్తుగానే హెచ్చరిస్తూ సామాజిక మాద్యమాల్లో ప్రకటనలు జారీ చేశారు.

రెట్టించిన ఉత్సాహంతో..

రెండేళ్లు కరోనా భయం వల్ల కొత్త సంవత్సరం వేడుకలను ఎవరూ పెద్దగా జరుపుకోలేదు. ఈ ఏడు కొవిడ్‌ ప్రభావం లేనందు వల్ల ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వేడుకలు జరుపుకున్నారు. బార్లు, రెస్టారెంట్లలో రాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యానికి కొదువలేకుండా పోయింది. కొత్త సంవత్సరం పుణ్యమా అని ఏరులై పారింది. ఉదయం నుంచే మద్యం షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి. సాయంత్రం మద్యానికి గిరాకీ మరింత పెరిగింది. రాత్రి ఒంటి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి.

Updated Date - 2023-01-01T22:56:54+05:30 IST