‘కొత్తకొండ’కు బ్రహ్మోత్సవ శోభ
ABN , First Publish Date - 2023-01-09T00:16:40+05:30 IST
ఉత్తర తెలంగాణ జిల్లాలో భక్తుల కొంగు బంగారం అయిన కొత్తకొండ జాతరకు శ్రీవీరభద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆలయ ఈవో కిషన్‌రావు ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు కల్పించేందుకు నెల రోజులుగా అధికారులు పనులు మొదలు పెట్టారు.
పూర్తవుతున్న ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు : ఆలయ చైర్మన్
భద్రకాళి అమ్మవారు
భీమదేవరపల్లి, జనవరి 8: ఉత్తర తెలంగాణ జిల్లాలో భక్తుల కొంగు బంగారం అయిన కొత్తకొండ జాతరకు శ్రీవీరభద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆలయ ఈవో కిషన్‌రావు ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు కల్పించేందుకు నెల రోజులుగా అధికారులు పనులు మొదలు పెట్టారు. భక్తులకు ఎక్కడా లోటుపాట్లు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యం, మంచినీటి సౌకర్యం, ఆర్టీసీ తదరత ఏర్పాట్లతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీ్‌షకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులందరినీ అప్రమత్తం చేశారు. జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ చలువ పందిళ్లు, ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.
రేపు స్వామివారి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీవీరభద్రస్వామి కల్యాణం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా గణపతిపూజ, శైవశుద్ధి, పంచగవ్యపాశన, ధ్వజారోహణం, భేరిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామి వారికి పట్టువస్త్రాలు ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్ సమర్పిస్తారు. అలాగే ముత్యాల తలంబ్రాలు అందిస్తారు. ఇప్పటికే కల్యాణం జరిగే ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు
ఈ నెల 10న శ్రీవీరభద్రస్వామి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 11న త్రిశూల పూజ, 12న వాస్తు పూజ, 13న లక్షబిల్వార్చన, 14న భోగి పండుగ, 15న బండ్లు తిరుగుట, 16న నాగవళ్లి పుష్పాయాగం, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కిషన్‌రావు తెలిపారు.
భక్తులకు సరిపడా ఏర్పాట్లు.
- మాడిశెట్టి కుమారస్వామి, ఆలయ చైర్మన్, కొత్తకొండ
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేశాం. గత సంవత్సరం 6లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచన వేస్తూ ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఆలయంలో సున్నాలు, రంగులు వేయించి ఆలయాన్ని అందంగా అలంకరించాం.