కేసీఆర్‌ది దార్శనిక పాలన

ABN , First Publish Date - 2023-06-03T00:20:28+05:30 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దార్శనిక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌ ప్రశసించారు.

కేసీఆర్‌ది దార్శనిక పాలన

పదేళ్లలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు

దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి

ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ భాస్కర్‌

పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా దశాబ్ది వేడుకలు

అమరుల కుటుంబాలకు సత్కారం

హనుమకొండ రూరల్‌, జూన్‌ 2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దార్శనిక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌ ప్రశసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారం భం అయ్యాయి. హనుమకొండలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన దశాబ్ది ప్రారంభ వేడుకల్లో ముఖ్య అతిథిగా వినయభాస్కర్‌ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, సీపీ రంగనాథ్‌లతో కలిసి వినయ్‌భాస్కర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. నేడు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రారంభమైన ఈ పయనం.. దేశానికే కాకుండా మానవ సమాజానికి ఎన్నో పాఠాలను నేర్పిందన్నారు. నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. విద్యుత్‌, వ్యవసాయం, సాగు, తాగునీరు, సంక్షేమం, విద్య, వైద్యం.. ఇలా ప్రతీరంగంలో సాధించిన ప్రగతిని 21 రోజులపాటు పండగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్లలో హనుమకొండ జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, దళితబంధు, ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ, మహిళా సంఘాలకు స్త్రీ నిధి లాంటి అనేక పథకాలలతోపాటు వ్యవసా య విధానాలు.. ఇంతవరకు దేశ చరిత్రలో లేవన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు, రైతుబంధు, రైతుబీమా అందజేస్తూ ఆదర్శంగా నిలస్తున్నామన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రతాకార్డులు, సంక్షేమ హాస్టళ్లతోపాటు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన సన్నబియ్యం అందించి విద్యార్థుల పౌష్టికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తూ కోట్లాది రూపాయలు రైతులకు చెల్లించామన్నారు. ఎస్సీ కులాలు ఆర్థిక గౌరవంతోపాటు సామాజిక గౌరవాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. జీవో 58 ద్వారా నిరుపేదలకు అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు 125 గజాల వరకు క్రమబద్ధీకరించడం జరుగుతోందన్నారు. నిరుపేదలు కూడా సౌకర్యవంతంగా ఉండే ఇళ్లలో జీవించాలనే ఉద్దేశంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు జిల్లాలో ఇప్పటి వరకు 4వేల 480 గృహాలు మంజూరు అయ్యాయన్నారు.

అమరుల కుటుంబాలకు సత్కారం

దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ సాధనలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌ శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. అంతకుముందు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అదాలత్‌ సెంటరులో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి కాళోజీ విగ్రహం, ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నేరుగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ప్రసంగం అనంతరం స్వరసుధ తాడూరి రేణుక శిష్యబృందం ప్రదర్శించిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌, నగర మేయర్‌ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ట్రైనీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా, డీసీసీ బారి, డీఆర్‌ఓ వాసుచంద్ర, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

హనుమకొండ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడిగా జరిగాయి. ఆరు విభజిత జిల్లాల్లో అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల ప్రగతిని వివరించారు.

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్‌ శివలింగయ్య హాజరయ్యారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన తెలంగాణ అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతిరాథోడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమపథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తోందని అన్నారు.

వరంగల్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు కేటాయించిన స్థలంలో వేడుకలు జరిగాయి. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రైతు సమన్వయ సమతి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలులోకి తీసుకవచ్చారని పేర్కొన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎంఎ్‌స ప్రభాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదలు, బడుగు, బలహీన ర్గాల అభ్యున్నతికోసం ఎప్పటికప్పుడు వినూత్న పథకాలను అమలుచేయడం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శమైందన్నారు.

హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, సీపీ రంగనాథ్‌లతో కలిసి వినయ్‌ భాస్కర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిస్కరించారు.

Updated Date - 2023-06-03T00:20:28+05:30 IST