కేసీఆర్ పాలనను బొందపెట్టాలి..
ABN , First Publish Date - 2023-11-20T23:39:05+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే రాష్ట్రం అన్నిరంగాల్లో రాణిస్తుంద న్నారు. సోమవారం పరకాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ పాలనపై సీఎం కేసీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఎంతో బాగుపడ్డారన్నారు. సీలింగ్ చట్టాన్ని తెచ్చి పేదలకు భూములను పంచార న్నారు. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లే ఉన్నాయన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయనను గెలిపిస్తే పరకాల నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.

అప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
మతి తప్పి, మందుకొట్టి మాట్లాడుతున్న కేసీఆర్
ఆరు గ్యారెంటీల అమలుతోనే సంక్షేమం
610 జీవో అమలుకు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కృషి
ఆయనకు ఓటేస్తే పరకాల అభివృద్ధి
‘పరకాల’ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
పరకాల రూరల్, నవంబరు 20: కేసీఆర్ పాలనను బొందపెడితేనే తెలంగాణ రాష్ట్రానికి విముక్తని, అప్పుడు రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. భారీగా జనం హాజరైన ఈ సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ కారుకూతలు కూస్తున్నాడని, ఆయన మతి తప్పి మాట్లాడుతున్నాడో, లేదా మందేసి మట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. అధికారంలోకి వస్తే రైతుబందు రద్దవుతుందంటున్న దగుల్పాజీ కేసీఆర్.. రైతులకు యేడాదికి రూ.15వేలు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విషయాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు. యువకుల ఆత్మబలిదానాలను చూడలేకనే సోనియాగాంఽధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్, ఆయన కుటుంబం రాష్ట్రం సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.
దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి నాడు దొరలు, జమీందారుల వద్ద ఉన్న వేలాది ఎకరాల భూమిని లాక్కొని పేదలకు పంచిపెట్టింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం భూమి లేని నిరుపేదల దగ్గర 25లక్షల ఎకరాల భూములు, దళితుల దగ్గర మరో 12 లక్షల ఎకరాల భూములు దగ్గర ఉండడానికి ఇందిరమ్మ రాజ్యమే కారణమన్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చింది కూడా ఇందిరమ్మ రాజ్యంలోనేనని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది ఇందిరాగాంధీ పాలనలోనే అన్నారు. 25మంది ఎస్సీలు ఎంపీలు అయి దేశ పరిపాలనలో భాగస్వాములైంది. ఇందిరమ్మ పాలనవల్లనేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకుటుండం చూడలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధేనని అన్నారు. పేదవారు ఈ రోజు కడుపు నిండా తింటున్నది, ఆత్మగౌరవంతో బతుకుతున్నది నాడు ఇందిరా గాంధీ అనుసరించిన సుపరిపాలనా విధానాలవల్లనేని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇప్పుడు కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగానూ గొంతెత్తున్నవారిని కేసీఆర్ నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించడం అంటే సువర్ణాక్షరాలతో లిఖించిన శాసనం లాంటిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రె్‌సకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆరుగ్యారెంటీలు అమలులోకి వస్తే రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, దళితులందరికీ లబ్ధి సమకూరుతుందని చెప్పారు. కేసీఆర్ ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పింఛన్ మొత్తాన్ని రూ.4వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి వీలుగా పరకాల నియోజకవర్గం ప్రజలు కాంగ్రె్‌సకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు. రేవూ రి ప్రకాశ్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారన్నారు. తెలంగాణలోని నిరుద్యోగుల కోసం ఆనాడే ఎంతో వేదన చెం దారన్నారు. ఉద్యోగాల నియామానికి సంబంధించిన 610 జీవో అమలుకు ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. తన అభ్యర్థన మేరకు ఆయన పరకాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడని, ఓటర్లు అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని కోరారు. ఆయనను గెలిపిస్తే పరకాల నియోజకవర్గం సర్వతో ముఖంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
పరకాల కాంగ్రెస్ అభ్యర్ధి రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు సొంత ఆస్తిగా వాడుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు కాళ్లకు చెప్పులు కూడా లేని కేసీఆర్.. ఇప్పుడు పొరుగురాష్ట్రాల్లో సైతం పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చాడని, ఆయనకు ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో లక్ష ఉద్యోగాల ఇస్తానన్న కేసీఆర్.. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకపోగా ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల పత్రాల లీకేజీకి పాల్పడ్డాడని విమర్శించారు. తనకు ఓటేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని ఆయన వివరించారు.