శివ పూజకు వేళాయే..
ABN , First Publish Date - 2023-02-18T00:01:40+05:30 IST
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని శివాలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.
నేడు మహా శివరాత్రి పర్వదినం
ముస్తాబైన శివాలయాలు
పోటెత్తనున్న వేయిస్తంభాల గుడి
హనుమకొండ కల్చరల్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని శివాలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాలగుడి, స్వయంభూ సిద్ధేశ్వరాలయం, మడికొండలోని ప్రాచీనమైన మెట్టు రామలింగేశ్వరాలయంతోపాటు పలు ఇతర శివాలయాల్లో శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శివకల్యాణంతో పాటు లింగోద్భవ కాలంలో విశేషమైన పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు. జాగరణ చేసే భక్తుల కోసం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
హనుమకొండలోని రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడిలో శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 3.30 గంటలకు సుప్రభాతం, 4గంటల నుంచి స్వామివారికి సామూహిక రుద్రాబిషేకాలు, నిత్యవిధి హవనం, సాయంత్రం 6.45 గంటలకు శ్రీరుద్రేశ్వర స్వామి, రుద్రేశ్వరీదేవి కళ్యాణోత్సవం, రాత్రి 12గంటలకులింగోద్భవకాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు పురాణ ప్రవచకులు శృంగేరి ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ శివతత్వంపై పురాణ ప్రవచనం చేస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఆనందలక్ష్మీ వీణా కచేరి, ఎం.పరమేశ్వర్ జిపద్మప్రియ, అనిత, తాడూరి రేణుక, జి.హరిత, వెంపటి శ్రావణి, అరుణ రాజ్‌కుమార్, రుద్రవేణు, సిరిమల్ల చంద్రస్మిత శిష్య బృందాల కూచిపూడి నృత్యప్రదర్శనలు, శృంగేరి ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ శివతత్వంపై ప్రవచనం, బొడిగే లక్ష్మీనారాయణ హరికథా కాలక్షేపం ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.
ఇక శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండస్ ఫౌండేషన్ శనివారం సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. హనుమకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు ఈ సమ్మేళనం జరుగుతుంది. అలాగే హనుమకొండలోని సాయిబాబా మందిరంలో శనివారం ఉదయం 5గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు 8 గంటలకు రుద్రహోమం, 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటాయని ఆలయ చైర్మెన్ ఎం.హరగోపాల్ తెలిపారు.
నేడు నగరానికి గవర్నర్ రాక
‘ఇండస్’ సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక సమ్మేళనం
సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పలు కార్యక్రమాలు
రాష్ట్రంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం: రాకేశ్ రెడ్డి
హనుమకొండ కల్చరల్, ఫిబ్రవరి 17: మహా శివరాత్రిని పురస్కరించుకొని ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్‌లో నిర్వహించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విచ్చేస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఎ. రాకేశ్‌రెడ్డి తెలిపారు. హయగ్రీవాచారి గ్రౌండ్స్‌లో సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
శివరాత్రి రోజున రాష్ట్రంలోనిర్వహిస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేశనం ఇదేనని అన్నారు. గవర్నర్‌తోపాటు సమ్మేళనానికి విశిష్ట అతిథిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ హాజరవుతున్నట్టు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు శశిధర్ శర్మ సంగీత విభావరితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సాయంత్రం 6.30 గంటలకు రుద్రాభిషేకం నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత గవర్నర్ సభా ప్రాంగణానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, విశిష్ట అతిథులను సన్మానిస్తారని తెలిపారు. ఆ తర్వాత ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనం, సిద్ధయోగ స్వామి చైతన్యానంద మహాయోగి సందేశం ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రసంగాలు ఉంటాయని వివరించారు. ప్రముఖ గాయనీ గాయకుల ఆట, పాట ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి పాస్, అనుమతి పత్రం అవరంలేదని, ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా పాల్గొనవచ్చునన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, విశ్వహిందూ మహానగర కార్యదర్శి శ్రీ రామ్ ఉదయ్, బీజేపీ సీనియర్ నాయకుడు నరహరి వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల కిషన్, బైరి శ్రావణ్, 2వ డివిజన్ కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.