‘సెంట్రల్‌ జైలు’ ఉన్నట్టా? లేనట్టా?

ABN , First Publish Date - 2023-05-27T00:17:51+05:30 IST

కారాగారంగానే కాకుండా ఓ కర్మాగారంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు అడ్రస్‌ గల్లంతైంది. ఎందరో రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులకు జీవిత పాఠాలు నేర్పిన జైలు నేలమట్టమై రెండేళ్లు గడిచిపోయాయి. వరంగల్‌ నగర నడిబొడ్డున ఉన్న జైలు స్థలంలో 24 అంతస్థులతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తుండగా, జైలు కోసం కొత్తగా కేటాయించిన స్థలంలో మొండి గొడలే కనిపిస్తున్నాయి. ఒక పక్క జైలు నిర్మాణం కాక, పోలీసులు, ఖైదీలు, జైలు సిబ్బంది నానా పాట్లు పడతున్నారు.

‘సెంట్రల్‌ జైలు’ ఉన్నట్టా? లేనట్టా?

నగరం నడిబొడ్డున కూల్చివేసి శివారుకు తరలింపు

మామునూరు బెటాలియన్‌లో 100 ఎకరాలు కేటాయింపు

రూ.254 కోట్లు కేటాయించినట్టు ప్రకటించిన సర్కారు

రెండేళ్లవుతున్నా అతీగతీ లేని పనులు

40 మంది ఖైదీలతో ఓపెన్‌ ఎయిర్‌గా జైలుగా నిర్వహణ

రిమాండ్‌ ఖైదీలను పొరుగు జిల్లాలకు తరలింపు

ఎస్కార్ట్‌ సిబ్బందికి ఇబ్బందులు

ములాఖత్‌లకు తిప్పలు

వరంగల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కారాగారంగానే కాకుండా ఓ కర్మాగారంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు అడ్రస్‌ గల్లంతైంది. ఎందరో రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులకు జీవిత పాఠాలు నేర్పిన జైలు నేలమట్టమై రెండేళ్లు గడిచిపోయాయి. వరంగల్‌ నగర నడిబొడ్డున ఉన్న జైలు స్థలంలో 24 అంతస్థులతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తుండగా, జైలు కోసం కొత్తగా కేటాయించిన స్థలంలో మొండి గొడలే కనిపిస్తున్నాయి. ఒక పక్క జైలు నిర్మాణం కాక, పోలీసులు, ఖైదీలు, జైలు సిబ్బంది నానా పాట్లు పడతున్నారు. పొరుగు జిల్లాలకు ఖైదీలను తరలించడం, అక్కడి నుంచి కోర్టులకు తరలించడం పెద్ద ప్రహసనంలా మారిపోవడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. వెయ్యి మంది ఖైదీలతో దక్షిణ భాతర దేశంలోనే ఓపెన్‌ ఎయిర్‌ సెంట్రల్‌ జైలుగా వర్ధిల్లిన సెంట్రల్‌ జైలు ఇప్పుడు గూడు లేని పక్షిలా 40 మంది ఖైదీలతో అరకొర భవనాల్లోనే కొనసాగుతోంది.

ముందుకు సాగని పనులు..

2021 జూన్‌ 14న కూల్చివేతలు ప్రారంభమై సెంట్రల్‌ జైలు 20 రోజుల్లోనే నేలమట్టమైంది. 256 ఎకరాల్లో హెల్త్‌ సిటీ నిర్మాణంలో భాగంగా కూల్చివేసిన సెంట్రల్‌ జైలు స్థానంలో 24 అంతస్థుల మల్టిస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే, మామునూరు 4వ బెటాలియన్‌ ప్రాంతంలో వంద ఎకరాల్లో చేపడుతామన్న సెంట్రల జైలు నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న రిమాండ్‌ ఖైదీలను వరంగల్‌ కోర్టుకు తీసుకురావడానికి ఎస్కార్ట్‌ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ములాఖత్‌ కోసం వచ్చే ఖైదీల బంధువులకు తిప్పలు తప్పడం లేదు. వంద ఎకరాల్లో అన్ని హంగులతో నిర్మాణం చేపడుతామన్న సెంట్రల్‌ జైలు నిర్మాణం అతీగతీ లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్‌ సెంట్రల్‌ జైలును ఆగమేఘాల మీద కూల్చివేసిన ప్రభుత్వం, నిర్మాణంలో ఆ చొరవ చూడం లేదని మేధావులు మండిపడుతున్నారు. నిర్మాణం కోసం రూ.254 కోట్లకు పరిపాలన సంబంధమైన అనుమతులే తప్ప బడ్జెట్‌ కేటాయింపు ఇప్పటి వరకు జరగలేదు.

40 మంది ఖైదీలతో..

వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి ఖైదీలను ఈ జైలుకే తరలించేవారు. 32 రకాల బ్యారక్‌లలో వివిధ రకాలైన కేసుల్లో శిక్ష పడిన వెయ్యి మంది ఖైదీలు ఉండేవారు. ఇప్పుడు మామునూరు 4వ పటాలం పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ జైలులో 40 ఖైదీలు మాత్రమే ఉంటున్నారు.

తొలి ఓపెన్‌ ఎయిర్‌ జైలు

దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రసిద్ధిగాంచింది. 256ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ కమతాలతో ఉండేది. 1886లో నిజాం కాలంలో బ్రిటీష్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది సరమయోధులను వరంగల్‌ సెంట్రల్‌ జైల్లోనే బంధించి ఉంచారు. అలాగే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ నారాయణరావు, హయగ్రీవాచారి లాంటి వారు కూడా ఈ జైల్లోనే గడిపినట్లు చెప్పుకుంటారు. 1955లో ఆనాడు అస్సాంలో జరిగిన అల్లర్లను అదుపు చేయడానికి మామునూరులో 435.05 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్‌ బెటాలియన్‌ ఏర్పాటు చేశారు. కాల క్రమేణ బెటాలియన్‌లోనే 59 ఎకరాల్లో పోలీసు శిక్షణ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంకా 23.20 ఎకరాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయం, 10 ఎకరాలలో మామునూరు ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. బె టాలియన్‌ నిర్వహణకు 344.05 ఎకరాల భూమి మిగిలింది. ఈ భూమిలో నుంచి 101 ఎకరాల భూమిని సెంటల్‌ జైలుకు కేటాయించారు. జైలుకు కేటాయించిన స్థలంలో ఎకరం భూమిలో రామాలయం, శివాలయం, గణపతి ఆలయం నిర్మిస్తున్నారు. ఇందుకోసం జైలు అధికారులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులతో రామాలయ డెవల్‌పమెంట్‌ సొసైటీ ఏర్పాటు చేశారు.

నిర్మాణం ఎప్పుడు..

జైలు కూల్చివేతకు ముందు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ శివారులోని మామునూరు 4వ బెటాలియన్‌ ప్రాంతంలోని వంద ఎకరాల్లో పూర్వపు సెంట్రల్‌ జైలుకు తలమానికంగా అన్ని హంగులతో నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. ఇందుకోసం 4వ బెటాలియన్‌లో వంద ఎకరాల స్థలా న్ని కేటాయించారు. నిర్మాణం కోసం రూ.254 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులను మాత్రమే ప్రభు త్వం జారీ చేసింది. ఇందులో ఒక్కపైసా కూడా ఇప్పటి వరకు విదిల్చలేదు. దీంతో జైలు నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు.

ఎస్కార్టు సిబ్బందికి ఇబ్బంది...

ఖైదీలను వివిధ కేసుల విచారణ విషయంలో ఎస్కార్టు పోలీసులు వారిని వరంగల్‌లోని కోర్టుతోపాటు ఇతర జిల్లాల్లోని కోర్టులకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇక్కడున్న ఖైదీలను చర్లపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌ తదితర జైళ్లకు తరలించారు. వారిని కేసుల విచారణలో కోర్టులో హాజరు పరచాలంటే ఎస్కార్టు పోలీసులు వరంగల్‌ నుంచి సంబంధిత జైళ్లకు వెళ్లి అక్కడ నుంచి ఖైదీలను నిర్ధేశిత కోర్టుల్లో హాజరు పరచాల్సి వస్తోంది. తిరిగి అక్కడ నుంచి వారిని తీసుకొచ్చిన జైళ్లలో భద్రంగా అప్పజెప్పాల్సి ఉంటుంది. దీంతో ఎస్కార్టు సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోరోజు సుమారు 500 కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని సంఘటనలతో ఖైదీలు పరారు అయితే ఉద్యోగాలకే ఎసరు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు.

జైలు సిబ్బందిలో నైరాశ్యం...

వరంగల్‌ సెంట్రల్‌ జైలులో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం సుమారు 230 మంది సిబ్బందివిధులు నిర్వర్తిస్తుండేవారు. జైలును కూల్చివేయడం, చిన్న భవన సముదాయంలోకి సెంట్రల్‌ జైలులోకి మార్చడంతో సిబ్బందిని అనివార్యంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పంపించారు. ప్రస్తుతం మామునూరు 4వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ జైలులో సుమారు 50 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారు ఇతర ప్రాంతాల్లోని జైళ్లలో పనిచేస్తున్నారు. స్థానికంగా కుటుంబాలతో కలిసి ఉంటూ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది, వివిధ ప్రాంతాల్లో వ్యయప్రయాసలకోర్చి విధులు నిర్వహిస్తున్నారు. అవసరానికి సెలవులు మంజూరు కాకపోవడం, కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వహించడం లాంటి అంశాలు వారిని ఆవేదనకు గురిచేస్తున్నాయి.

రెఫరల్‌ పాయే...

వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు అందుబాటులో ఎంజీఎం ఆస్పత్రి ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు జబ్బుపడ్డప్పుడు ఇక్కడ వారు రెఫరల్‌ ఖైదీలుగా ఉండేవారు. సెంట్రల్‌ జైలు కూల్చి వేసి, నూతన నిర్మాణాలు చేపట్టక పోవడంతో ప్రస్తుతం మామునూరులో నిర్వహిస్తున్న సెంట్రల్‌ జైలుకు రెఫరల్‌ జైలు హోదా లేకుండా పోయింది.

ములాఖత్‌కు కష్టమే...

వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఉన్నప్పుడు ఖైదీల బంధువులకు ములాఖత్‌కు ఇబ్బందు లు ఉండేవి కావు. ఇప్పడు వివిధ ప్రాంతాల్లోని సబ్‌ జైళ్లకు ఇక్కడున్న ఖైదీలను పం పించడంతో అక్కడకు వెళ్లి ములాఖత్‌ చేయడం కష్టమవుతోందని వారు చెబుతున్నా రు. ములాఖత్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

Updated Date - 2023-05-27T00:17:51+05:30 IST