నేడే ముహూర్తం

ABN , First Publish Date - 2023-09-04T00:14:23+05:30 IST

అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. ఆలయ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఆలయం సర్వాంగసుందరంగా ముస్తామైంది. విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజులుగా పాలకుర్తి మండలం వల్మిడిలో కొనసాగుతున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం శ్రీ సీతారాంచంద్రస్వామి నూతన ఆలయాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరవుతున్నారు.

నేడే ముహూర్తం
విద్యుత్‌ వెలుగుల్లో వల్మిడి రామాలయం, (ఇస్‌సెట్‌లో)చిన్న జీయర్‌స్వామి ప్రతిష్టించే విగ్రహాలు

వల్మిడిలో రామాలయం ప్రారంభోత్సవం

సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠాపన

చిన్న జీయర్‌స్వామి ఆధ్వర్యంలో పూజలు

హాజరవుతున్న ఐదుగురు మంత్రులు

ప్రారంభానికి ముస్తాబైన ఆలయం

చివరి నిమిషంలో రద్దయిన సీఎం పర్యటన

పాలకుర్తి, సెప్టెంబరు 3: అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. ఆలయ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఆలయం సర్వాంగసుందరంగా ముస్తామైంది. విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజులుగా పాలకుర్తి మండలం వల్మిడిలో కొనసాగుతున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం శ్రీ సీతారాంచంద్రస్వామి నూతన ఆలయాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరవుతున్నారు. రూ.25 కోట్లతో బమ్మెర, పాలకుర్తి, వల్మిడి గ్రామాల్లో టూరిజం అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో దేవతా మూర్తుల విగ్రహాలను చిన్న జీయర్‌స్వామి ప్రతిష్ఠాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన వల్మిడి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటలకు రాష్ట్ర మంత్రులు వల్మిడి గ్రామానికి చేరుకొని రామాలయాన్ని ప్రారంభిస్తారు. 11 గంటల నుంచి 12:30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో కనులపండువగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు 30 వేల మందికి తగ్గకుండా భక్తులు తరలిరావడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

షెడ్యూల్‌ ఇలా..

ఉదయం 7 గంటలకు హోమం, 9:30 గంటలకు చిన్న జీయర్‌స్వామి వల్మిడికి చేరకుంటారు. 10 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం, 10:15 విగ్రహాల ప్రతిష్ఠాపన, 12:30 గంటలకు మంత్రుల రాక, రామాలయం ప్రారంభం. మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామం. 1:15 గంటలకు వల్మిడి గుట్ట మధ్యలో ఉన్న బ్రిడ్జి ప్రారంభం, 1:30 గంటలకు పాలకుర్తి శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనుల ప్రారంభం, దైవ దర్శనం, 1:45 గంటలకు పాల్కురికి సోమనాథుడి స్మృతివనం ప్రారంభం, 2 గంటలకు కల్యాణ మండపం ప్రారంభం, 2 :20లకు మిషన్‌ భగీరథ అతిథి గృహం ప్రారంభం. 2:30 గంటలకు హరిత హోటల్‌, చెక్‌డ్యామ్‌ పనులకు శంకుస్థాపన, 2:45 గిరిజన భవనం పనుల ప్రారంభం.

సీఎం పర్యటన రద్దు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రద్దయింది. సోమవారం ఆయన వల్మిడి రామాలయం ప్రారంభం, వివిధ పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా కేసీఆర్‌ సతీమణి శోభ అనారోగ్యం కారణంగా పర్యటన రద్దు అయిందని పార్టీవర్గాలు తెలిపాయి.

రాములోరికి రోజువారీగా పూజలు : చక్రవర్తుల కల్యాణ సుందరాచార్యులు, ఆలయ పూజారి

పురాతన ఆలయానికి ఎలాంటి నిధులు లేకపోవడంతో ఇప్పటివరకు రోజువారీ పూజలు సరిగా జరిగేవి కావు. యేటా ప్రజల విరాళాలతో సీతారాముల కల్యాణం జరుపుతూ వచ్చాం. ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఎక్కువగా వచ్చేవారు కాదు. ఇప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి నూతన ఆలయం నిర్మించడం, సౌకర్యాలు కల్పించడం వల్ల భక్తులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరో భద్రాద్రి తరహాలో ఆలయం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక నుంచి రోజు వారీ పూజలు చేస్తాం.

వేడుకలకు భక్తులను తరలించాలి

ప్రజాప్రతినిధులుకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు

పాలకుర్తి/కొడకండ్ల/దేవరుప్పుల సెప్టెంబరు 3: పాలకుర్తి మండలంవల్మిడి గుట్టపై నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవానికి భారీగా తరలిరావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన పాలకుర్తి, కొడకండ్లతో పాటు దేవరుప్పులలో మూడు మండలాల ప్రజాప్రతినిధులుతో వేరు వేరుగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వల్మిడి గ్రామంలోని గుట్టపై రూ.25 కోట్లతో నిర్మించిన రామాల యం ప్రారంభోత్సవానికి భక్తులను అత్యధిక సంఖ్యలో తరలించాలని పిలుపునిచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ వేడుకలకు మంత్రులు తన్నీరు హరీ్‌షరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతి రాథోడ్‌ హాజరవుతున్నారని తెలిపారు. సమావేశాల్లో మూడు మండలాల జడ్పీ టీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచు లు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వల్మిడి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర మాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జిల్లా పౌరసంబంఽధాల శాఖ ఆధ్వ ర్యంలో వరంగల్‌, జనగామ జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. జానపద నృత్యాలు, భరత నాట్యంతో కళాకారుల ప్రదర్శన అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రా వు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతిభ కలిగిన అనేకమంది కళాకారులు ఉన్నారని అన్నారు. అనంతరం కళాకారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌, ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మూడో రోజు పోటెత్తిన భక్తులు

పాలకుర్తి, సెప్టెంబరు 3 : వల్మిడి గ్రామంలో ఈ నెల 1 నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడో రోజున రామాలయానికి భక్తులు పోటెత్తారు. బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పండితుల వేదమంత్రాల మధ్య శిలా విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి ధ్వజస్తంభంపై కలశాభిషేకం చేశారు. వల్మిడి తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సైతం పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణకు కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. తొర్రూరు, జనగామ, వరంగల్‌, డిపోల నుంచి వల్మిడి గుట్ట వరకు ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. డీఆర్‌డీవో రాంరెడ్డి, పోలీస్‌ అధికారులు, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-09-04T00:14:23+05:30 IST