గంట అయితే ఇంటికి చేరేటోళ్లు..

ABN , First Publish Date - 2023-06-26T00:42:43+05:30 IST

అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి అనుకోని ప్రమాదం ఎదురైంది. వనదేవతలను దర్శించుకొని ఆ అమ్మల సన్నిధిలో గడిపిన క్షణాలు అంతలోనే ఆవిరైపోయా యి.

గంట అయితే ఇంటికి చేరేటోళ్లు..

వనదేవతల వద్దకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

కారును వేగంగా ఢీకొన్న టిప్పర్‌

నలుగురు అక్కడికక్కడే దుర్మరణం

ఇద్దరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్పంగా..

ఆత్మకూరు మండలం పత్తిపాక క్రాస్‌ వద్ద ఘటన

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

కాశీబుగ్గ వీకర్స్‌ సెక్షన్‌ కాలనీలో విషాదం

ఆత్మకూరు/వరంగల్‌ టౌన్‌, జూన్‌ 25: అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి అనుకోని ప్రమాదం ఎదురైంది. వనదేవతలను దర్శించుకొని ఆ అమ్మల సన్నిధిలో గడిపిన క్షణాలు అంతలోనే ఆవిరైపోయా యి. అడవిలో ఆటపాటలు, విందు వినోదా లతో సంతోషంగా గడిపిన కుటుంబం.. అంతలోనే అంతులేని పెను విషాదానికి లోనైంది. ఇంకో గంట సమయంలో ఇంటికి చేరుకోనుండగా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుం బానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హైదరా బాద్‌–భూపాలపట్నం జాతీయ రహదారిపై హనుమకొండ జిల్లా ఆత్మకూరు వద్ద ఆదివారం సాయంత్రం మారుతీ వ్యాగనార్‌ కారును టిప్పర్‌ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆత్మకూరు సీఐ బండారి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ నగరంలోని 19వ డివిజన్‌ కాశీబుగ్గ సొసైటీకాలనీ వీకర్స్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన అనుముల నర్సింహస్వామి(52)– రాజశ్రీ(50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఆకాంక్ష (26), అక్షిత(20), ఒక కుమారుడు ఆకాష్‌ ఉన్నారు. పెద్దకుమార్తె ఆకాంక్షకు లేబర్‌కాలనీకి చెందిన అనుముల సాంబరాజు(42)తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమార్తె లక్ష్మీప్రసన్న (6), కుమారుడు అక్షయ్‌రాజ్‌ (4) ఉన్నారు. మామ నర్సింహస్వామి, అల్లుడు సాంబరాజు వరంగల్‌ బట్టల బజార్‌లోని ఓ స్టీల్‌ షాపులో పని చేస్తున్నారు. నర్సింహస్వామి భార్య రాజశ్రీ గృహిణి, పెద్ద కూతురు ఆకాంక్ష గృహిణి, చిన్నకుమార్తె అక్షిత హనుమకొండలోని పద్మావతి కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కుమారుడు ఆకాష్‌ నగరంలోని ఓ పురుగుల మందుల షాపులో పని చేస్తున్నాడు.

వనదేవతల సన్నిధికి..

అనుముల నర్సింహస్వామి – రాజశ్రీ దంపతులు తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, అల్లుడు, మనవడు, మనవ రాలితో కలిసి మొత్తం 8మంది ఆదివారం ఉదయం సుమారు 4గంటలకు మేడారంలోని సమ్మక్క–సారలమ్మల దర్శనానికి బయలుదేరారు. వీరు వాగనార్‌ కారులో బయలు దేరగా కుమారుడు ఆకాశ్‌ కారును నడుపుతున్నాడు. మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. విందు వినోదాలు చేసుకున్నారు. సాయంత్రం వరకు అమ్మవార్ల సన్నిధిలోనే సంతోషంగా గడిపారు. అనంతరం కారులో ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పత్తిపాక క్రాస్‌ రొడ్డు వ్దకు రాగానే శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలోని స్టోన్‌ క్రషర్‌కు చెందిన టిప్పర్‌ అతివేగంగా వచ్చి రెండుసార్లు ఢీకొన్నది. దీనితో కారులో ప్రయాణిస్తున్న అనుముల నర్సింహాస్వామి (52), ఆయన అల్లుడు వెల్దండి సాంబరాజు(40), పెద్ద కూతురు వెల్దండి ఆకాంక్ష(26), మనవరాలు వెల్దండి లక్ష్మీప్రసన్న(6) అక్కడిక్కడే మృతి చెందారు. నర్సింహాస్వామి భార్య అనుముల రాజశ్రీతో పాటు చిన్న కూతురు అనుముల అక్షిత తీవ్రంగా గాయపడ్డారు. కారులోని బెలూన్‌ తెరుచుకోవడంతో కారు నడుపుతున్న కుమారుడు ఆకాష్‌, పక్కన కూర్చున్న మనవడు అక్షయరాజ్‌లు ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందగానే ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాత్రులను అతికష్టమీద కారు నుంచి బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రక్తసిక్తమైన మృతదేహాలతో సంఘటనా స్థలం భయానకంగా మారింది. గాయపడినవారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

వరంగల్‌ కాశీబుగ్గలో విషాదం

మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని వరంగల్‌కు తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, వారి స్వస్థలం కాశీబుగ్గ సొసైటీకాలనీ వీకర్స్‌ సెక్షన్‌ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం వీరంతా ఎంతో ఆనందంగా కారులో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు తీర్చుకునేందుకని మేడారం వెళ్లారు. తొలుత ములుగు వద్ద గట్టమ్మ గుడి వద్ద అందరూ దిగి మొక్కులు చెల్లించుకుని సెల్ఫీ దిగి బంధువులకు, ప్రెండ్స్‌కు షేర్‌ చేసుకున్నారు. మేడారం వెళ్లి మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరిగి వరంగల్‌కు బయలు దేరారు. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం పత్తిపాక క్రాస్‌రోడ్‌ వద్ద టిప్పర్‌ వచ్చి కారును ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు నర్సింహస్వామి, సాంబరాజు, ఆకాంక్ష, లక్ష్మీప్రసన్న మృతి చెందారు. రాజశ్రీ, అక్షిత తీవ్ర గాయాలపాలయ్యారు. ఆకాష్‌, అక్షయ్‌రాజ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వీకర్స్‌ సెక్షన్‌ కాలనీవాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు అనుముల నర్సింహస్వామి కుటుంబం పదిహేను సంవత్సరాలుగా అందరితో కలుపుగోలుగా ఉంటున్నారని వెల్లడించారు. ఒక్కసారిగా నలుగురు మృత్యువాత పడటంతో విషాదంలో మునిగిపోయారు.

ప్రమాదం జరిగిందిలా...

ఆత్మకూరు – నీరుకుళ్ల గ్రామాల మధ్య పత్తిపాక క్రాస్‌ జాతీయ రహదారి వద్ద సాయంత్రం సుమారు 5.45 గంటలకు కారు మేడారం నుంచి వరంగల్‌కు వస్తున్నది. వరంగల్‌లో కంకర లోడును దించి టిప్పర్‌ పత్తిపాకలోని క్రషర్‌కు వెళుతున్నది. కారు పత్తిపాక క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే టిప్పర్‌ అతివేగంగా వచ్చి కారును మొదట ముందు భాగాన ఢీకొట్టింది. అప్రమత్తమైన డ్రైవర్‌.. టిప్పర్‌ను పక్కకు తప్పించబోయాడు. ఇంతలో ఇసుకలారీ ఎదురురావడంతో దానిని తప్పించబోయి రెండో సారి కారును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడి పల్టీ కొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. కారులో వెనుక సీట్లో కూర్చున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారును నడుపుతున్న ఆకాశ్‌తోపాటు ముందు సీట్లో కూర్చున్న ఆయన ఆకాష్‌ మేనల్లుడు అక్షయ్‌ రాజ్‌ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం రెప్పపాటులో జరిగిపోయింది. ఆకాష్‌ షాక్‌కు గురై ఏ మాట్లాడలేని పరిస్థితికి లోనయ్యాడు. ఆయనతో పాటు ప్రమాదం నుంచి బయటపడిన బాలుడు అక్షయ్‌రాజ్‌ కూడా ఏంజరిగిందో తెలియక బిత్తరపోయాడు. ఈ ప్రమాదంలో వెల్దండి సాంబరాజు కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆయన ఆరేళ్ల కుమారుడు అక్షయ్‌రాజ్‌ అనాథగా మిగిలాడు. అకాశ్‌ తల్లి రాజశ్రీ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. టిప్పర్‌ను డ్రైవర్‌ అతివేగంతో అజాగ్రత్తగా నడపడం వల్లనే ఈ ఘోరం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.

గతంలోనూ..

హైదరాబాద్‌ – భూపాలపట్నం జాతీయ రహదారిపై ఇసుకలారీలు, క్రషర్‌ టిప్పర్లు అడ్డూ అదుపు లేకుండా అతివేగంగా వెళుతుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో 2019లో దాదాపు ఇదే ప్రాంతంలో ఆటోను ఇసుక లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు ఒదిలారు. ఇప్పుడు ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కొద్ది రోజుల కిందట రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వెళుతున్న ఇసుకలారీలు, టిప్పర్‌లకు పోలీసులు కళ్లెం వేయకపోవడంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వెళుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రాణాలు అరచేతపట్టుకొని వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఎంజీఎం

హనుమకొండ అర్బన్‌, జూన్‌ 25: హనుమకొండ జిల్లా ఆత్మకూరులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని, క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. ఆదివారం సాయంత్రం ఘటన జరిగిన వెంటనే బాధిత బంధువులు ఎంజీఎంకు చేరుకున్నారు. మృతులు నర్సింహారావు, సాంబరాజు, ఆకాంక్ష, లక్ష్మీ ప్రసన్నల మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. గాయపడిన అనుముల రాజశ్రీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె కూతురు అనుముల అక్షిత (17) గాయపడి ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. అమ్మా నాన్న ఎలా ఉన్నారంటూ రోదిస్తోంది. అనుముల ఆకాష్‌ కూడా ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. తల్లి, తండ్రీ, అక్కను కోల్పోయిన వెల్దండి అక్షయ్‌రాజ్‌ (6) ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. వీరిది కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన వారు కావడంతో బంధువులు పెద్ద సంఖ్యలో ఎంజీఎం చేరుకున్నారు.

Updated Date - 2023-06-26T00:42:43+05:30 IST