Share News

చదువుకునేది ఎట్లా..!?

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:29 PM

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లల్లో సమస్యలు తిష్టవేశాయి. అరకొర వసతుల నడుమ విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. పెరిగిన చలితో వణుకుతూ.. ఇబ్బందులపడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. మానుకోట జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో గదులు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఇరుకు రూముల్లో స్టూడెంట్స్‌ అవస్థలు పడుతున్నారు.

చదువుకునేది ఎట్లా..!?
మరిపెడలోని ఓబీసీ హాస్టల్‌లో నేలమీద నిద్రిస్తున్న విద్యార్థులు

సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు

విద్యార్థుల సంఖ్య ఎక్కువ, గదులు తక్కువ

మంచాలు ఫుల్‌, అరకొరగా పరుపులు

పలుచోట్ల రూముల కిటికీలకు తలుపులు లేక చలికి వణుకుతున్న స్టూడెంట్స్‌

అద్దెభవనాల్లోనే మైనార్టీ, జ్యోతిరావు ఫూలే గురుకులాలు

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 24 : జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లల్లో సమస్యలు తిష్టవేశాయి. అరకొర వసతుల నడుమ విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. పెరిగిన చలితో వణుకుతూ.. ఇబ్బందులపడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. మానుకోట జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో గదులు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఇరుకు రూముల్లో స్టూడెంట్స్‌ అవస్థలు పడుతున్నారు. వారు నిద్రిం చేందుకు ఇనుప మంచాలు, పరుపులను ప్రభుత్వం అందజేసింది. దుప్పట్లు, బెడ్‌షీట్లు అందజేశారు. అయినప్పటికీ కొన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా మంచాలు అందచేయగా, కొన్నిచోట్ల మంచాలు వచ్చినప్పటికీ సరిపడ పరుపులు రాని పరిస్థితి నెలకొంది.

జిల్లా వ్యాప్తంగా 23 ఎస్సీ వసతి గృహాలు ఉండగా వాటిల్లో 19 ఫ్రి మెట్రిక్‌ వసతి గృహాలుండగా వాటిల్లో 1,679,4 పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో 267 మంది వెరసీ 2046 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో 14 బీసీ గురుకులాలు ఉండగా 8 ఫ్రి మెట్రిక్‌, 6 పోస్టుమెట్రిక్‌ ఉండగా వాటిల్లో 1190 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే బీసీ గురుకులాల్లో విద్యార్థులకు బెడ్‌లు, పరుపులు అందించకపోవడంతో నేలపైనే పడుకుని చలికి వణుకుతున్నారు. 28 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు ఉండగా.. 7,570 మందికిపైగా విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తొర్రూరు, డోర్నకల్‌ బాలికలు, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకులం బాలురు ఉన్నాయి. మూడు గురుకుల పాఠశాలల్లో 1,920 మంది విద్యార్థినీ, విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు.

జిల్లాలో మహాత్మాజ్యోతి రావు ఫూలే గురుకులాలుండగా గూడూరు, మరిపెడ బాలికలు, మహబూబాబాద్‌, తొర్రూరు, దంతాలపల్లి గురుకులాలు బాలుర నిర్వహించబడుతున్నాయి. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు 15 ఉండగా, వాటిల్లో 3,316 మంది విద్యార్థినీనులు విద్యనభ్యసిస్తుండగా, అందరు నేలపైనే పడుకుంటున్నారు. 6 గురుకుల పాఠశాలల్లో 2,720 మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలోని అన్ని కేటగిరి హస్టళ్లలో చలికాలంలో స్నానాలు చేసేందుకు వేడినీరు లేకపోవడంతో చల్లటి నీటితోనే స్నానాలు చేస్తూ జలుబు, జ్వరాల భారిన పడుతూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇరుకు గదులతో ఇబ్బందులు..

జిల్లాలోని అన్ని గిరిజన, బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల సామార్థ్యానికి సరిపడ గదులు లేకపోవడంతో ఒకే గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు. చలికాలం కావడం వల్ల విద్యార్థులు పడుకునేందుకు స్థలం లేక ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికి ఆ దిశగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా అధికారులు విఫలమవుతున్నారని విమర్శలోస్తున్నాయి. వీరికి ప్రభు త్వం కేటాయించిన బడ్జెట్‌ ప్రకారం ఆయా వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సరిపడ బెడ్‌లు లేక ఇక్కట్లు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 7,570 మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బాలికల వసతిగృహాలు, హాస్టల్లలో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండి, రూములు తక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు విద్యాసంవత్సరం ఆరంభంలోనే దుప్పట్లు పంపిణీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులు పడుకునేందుకు బెడ్‌లు లేకపోవడంతో విద్యార్థులు బండలపై కిందనే పడుకుంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ బండలు మరింత చల్లబడి విద్యార్థులు చలికి వణుకుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి గదుల సంఖ్య తక్కువగా ఉన్న హస్టల్లలో బెడ్‌లు లేకపోవటంతో కటిక నేల మీదనే దుప్పట్లు వేసుకుని పడుకుని చలికి విలవిలలాడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రూంలను కేటాయించి ఇబ్బందులను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హస్టల్లలోని కిటికీలకు డోర్లు ఉన్నప్పటికీ వాటికి దోమల జాలీలు ఏర్పాటు చేయలేదు.

అద్దె భవనాల్లోనే గురుకులాలు..

మహబూబాబాద్‌ జిల్లాలో మూడు ముస్లిం మైనా ర్టీ, 5 మహాత్మాజ్యోతిరావు పూలే గురుకులాలు వెరసి 8 గురుకుల పాఠశాలలు కూడా అద్దెభవనాల్లోనే ని ర్వహిస్త్తున్నారు. డోర్నకల్‌ బాలికలు, తొర్రూరు బాలికలు, మహబూబాబాద్‌ బాలుర ముస్లిం మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. జిల్లాలో 5మహాత్మాజ్యోతి రావు ఫూలే గురుకులాలు ఉండగా గూడూరు, మరిపెడ బాలికలు, తొర్రూరు, మహబూబాబాద్‌, దంతాలపల్లి బాలురు గురుకుల పాఠశాలల ఉన్నాయి. జిల్లాలో ఉన్న ముస్లిం మైనార్టీ, జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు కూడా అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. చిన్నగూడూరు మండలకేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు రెండు కూడ ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి, సమస్య లను పరిష్కరించాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:29 PM