రహదారిని దాటేదెలా..?
ABN , First Publish Date - 2023-02-21T23:48:58+05:30 IST
జాతీయ రహదారి ఏర్పాటు మంచిదే అయినా.. దాని వల్ల జిల్లాలో పలు గ్రామాలు రెండుగా చీలిపోయాయి. దీంతో అటువైపు వారు ఇటు రావడానికి, ఇటు వైపు వారు అటు వెళ్లడానికి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు. రహదారి మీదుగా అనునిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి.
అవతలి వైపు వెళ్లేందుకు ప్రజల ఇబ్బందులు
వాహనాలు ఢీకొని గాల్లో కలుస్తున్న ప్రాణాలు
రఘునాథపల్లి నుంచి కరుణాపురం వరకు స్థానికులకు తప్పని తిప్పలు
పుట్‌ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాలని వేడుకోలు
జాతీయ రహదారి ఏర్పాటు మంచిదే అయినా.. దాని వల్ల జిల్లాలో పలు గ్రామాలు రెండుగా చీలిపోయాయి. దీంతో అటువైపు వారు ఇటు రావడానికి, ఇటు వైపు వారు అటు వెళ్లడానికి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు. రహదారి మీదుగా అనునిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి. కంటికి కనిపించనంత వేగంతో దూసుకెళ్తుంటాయి. ఆదమరిచి రోడ్డు క్రాస్‌చేస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. ఇలా ఇప్పటివరకు సుమారు 30 మంది మృత్యువాత పడగా దాదాపు 90 మంది గాయాలపాలయ్యారు. నేషనల్ హైవే అయినందున వాహనాల వేగాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. అందువల్ల రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ లాంటి గ్రామాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించడంతో పాటు ఇతర గ్రామాల్లో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి 21: యాదాద్రి జిల్లాలోని వంగపల్లి నుంచి వరంగల్ జిల్లాలోని అరెపల్లి వరకు 2016లో 99.10 కిలోమీటర్ల దూరంతో జాతీయ రహదారి (163) నాలుగు లైన్ల విస్తరణ పనులు ప్రారంభించారు. ఎట్టకేలకు 2020 వరకు 90శాతం పనులు పూర్తి అయ్యాయి. ఇందులో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలో 32 కిలోమీటర్ల పరిధిలో 7 గ్రామాలు ఉన్నాయి. నిడిగొండ, రఘునాథపల్లి, రాఘవాపూర్, ఛాగల్, ఘన్‌పూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాలను రెండు భాగాలుగా విడగొట్టి పనులు పూర్తి చేశారు. అయితే వారు రోడ్డు దాటేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయాగ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో అవసరాన్ని బట్టి పుట్‌ఓవర్ బ్రిడ్జీలను కాని, చిన్న అండర్‌పాస్‌లను గాని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని రఘు నాథపల్లి మండల కేంద్రంలో రహదారికి రెండు వైపు లా సుమారు రెండు కిలోమీటర్ల దూరం మేర నివాస గృహాలతో పాటు వ్యాపార సముదాయాలు ఉన్నాయి. మండల కేంద్రం నుంచి కంచనపల్లి, ఖిలాషాపుర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు ఉన్నాయి. ఆయా గ్రామాలకు వెళ్లేవారు రహదారి ఏర్పాటుతో పడరాని పాట్లు పడుతున్నారు. నిడిగొండ గ్రామంలో రహదారికి రెండు వైపులా బానాజీపేట, ఇబ్రహీంపురం గ్రామాలకు వెళ్లే రోడ్లు ఉండడంతో పాటు ఇరువైపులా గృహాలు ఉన్నా యి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పరిధిలో రాఘవపూ ర్, ఛాగల్ గ్రామాల్లో రహదారికి ఇరువైపులా గ్రామా లు విస్తరించి ఉన్నాయి. డివిజన్ కేంద్రం సుమారు 2కిలోమీటర్ల మేర రెండు వైపులా విస్తరించింది. రెండు వైపులా వందర సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. చిలుపూరు మండలంలోని చిన్నపెండ్యాల గ్రామం రహదారి ఏర్పాటుతో ఈస్ట్, వెస్ట్‌గా మారి పోయింది. స్థానిక అవసరాల కోసం ప్రజలలు నిత్యం రహదారి దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచే తరిగొప్పుల, హుస్నాబాద్, ధర్మసాగర్ ప్రాం తాలకు నిత్యం వెళ్లేవారు వందల సంఖ్యలో ఉంటారు. అదేవిధంగా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడి నుంచి రెండు వైపులా ఐనవోలు, ధర్మసాగర్ మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లు ఉన్నాయి. ఇక్కడ రహదారి దాటే క్రమంలో ఇప్పటికే అనేక మంది ఆమాయకులు మృత్యువాత పడ్డారు.
ఇప్పటివరకు 28 మంది మృత్యువాత
మూడేళ్ల కాలంలో రహదారి దాటే క్రమంలో జిల్లా లో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందగా 87 మం ది గాయపడినట్లు అధికారికంగా చెబుతున్నారు. అయి తే లెక్కకు రాని సంఘటనలు మరెన్నో ఉన్నాయని జిల్లా ప్రజలు చెబుతున్నారు. నిడిగొండ గ్రామం వద్ద ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. రఘునాథపల్లి వద్ద 10మంది గాయపడ్డారు. రాఘవ పూర్ గ్రామం వద్ద 9 మంది మృతి చెందగా 18మంది గాయాల పాలయ్యారు. ఛాగల్‌లో ఆరుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఛాగల్ గ్రామంలో 11 ఏళ్ల బాలుడు రోడ్డు దాటుతూ మృతి చెందాడు. ఘన్‌పూర్‌లో 8మంది గాయపడగా, ఇద్దరు మతిస్థి మితం కోల్పోయారు. చిన్నపెండ్యాల గ్రామం వద్ద 8 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. కరుణాపురం గ్రామం వద్ద ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు.
ఘన్‌పూర్ బస్టాండ్ వద్ద సర్కిల్ ఏర్పాటు చేయాలి..
- కుంభం కుమార్, పండ్ల వ్యాపారి
నిత్యం వందలాది మంది ప్రజలు రహదారి క్రాస్ చేస్తుంటారు. ఈ క్రమం లో ప్రమాదాల బారిన పడకుండా బస్టాండ్ వద్ద రహదారి పై సిగ్నల్ సర్కిల్ ఏర్పాటు చేయాలి. దానివల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడంతో ప్ర జలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. రెండు వై పులా వ్యాపారాలు సైతం సజావుగా సాగుతాయి.
పాలకులు స్పందించడంలేదు..
- సురేష్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, చిన్నపెండ్యాల
చిన్నపెండ్యాల గ్రామం వద్ద రహదారి దాటే క్రమంలో అ మాయక ప్రజలు మృతి చెందు తున్నారు. పుట్‌ఓవర్ బ్రిడ్జి కాని అండర్‌పాస్ కాని ఏర్పాటు చేసేలా చూడాలని ఎమ్మెల్యే రాజయ్యకు, జడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డికి పలుమార్లు విన్నవించాం. అయినా వారినుంచి స్పందన లేదు. ప్రజల ప్రా ణాల పట్ల వారికి ఆలోచన లేదు. నాయకుల నిర్లక్ష్యం మూలంగా అమాయక ప్రజలు చనిపోతు న్నారు. ఇప్పటికైనా పరిష్కారం చూపాలి.