అట్లెట్లయిందబ్బా..!
ABN , First Publish Date - 2023-12-04T23:41:47+05:30 IST
ఓట్ల లెక్కింపు పూర్తయింది. అభ్యర్థుల గెలుపోటములు కూడా తేలిపోయాయి. గెలిచిన అభ్యర్థులు గెలుపు సంబరాల్లో ఉండగా ఓటమి చెందిన అభ్యర్థులు దుఃఖంలో మునిగిపోయారు. జిల్లాలో జనగామ, పాల కుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోగా పాలకుర్తి స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించు కుంది.
ఓటమిపై నేతల పోస్ట్‌మార్టం
లోపం ఎక్కడ జరిగిందంటూ ఆరా
బూత్‌ల వారీగా పడిన ఓట్లపై లెక్కలు
గత ఎన్నికల ఫలితాలతో బేరీజు
జనగామ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపు పూర్తయింది. అభ్యర్థుల గెలుపోటములు కూడా తేలిపోయాయి. గెలిచిన అభ్యర్థులు గెలుపు సంబరాల్లో ఉండగా ఓటమి చెందిన అభ్యర్థులు దుఃఖంలో మునిగిపోయారు. జిల్లాలో జనగామ, పాల కుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోగా పాలకుర్తి స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించు కుంది. కాగా.. రెండు చోట్ల కాంగ్రెస్ పరాజయం పాలవగా, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌రావు భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఓటమి చెందిన అభ్యర్థులు తమ ఓటమి గల కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ముఖ్య నేతలను పిలిపించుకొని ఓటమిపై పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. నియోజ కవర్గంలో తమ పార్టీకి ఉన్న ప్రాబల్యం ఎంత? బూత్‌ల వారీగా తాము ఆశించిన ఓట్లెన్ని, వచ్చిన ఓట్లెన్ని అన్న అంశాల మీద ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించుకుంటున్నారు.
ఎందుకు ఓడాము?
- ఎన్నికల్లో ఓడిపోవడానికి బలమైన కారణాలను అభ్యర్థులు వెతుకుతున్నారు. నిత్యం వెంటే ఉండే ముఖ్య నేతలతో పాటు మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకు లను సైతం అడిగి తెలుసుకుంటున్నారు. ఏ మండ లంలో, ఏ బూత్‌లో తమకు మైనస్ అయిందో, కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. బూత్‌ల వారీగా వివరాలను తెప్పించుకొని రివ్యూ చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉన్న మండలాలు, బూత్‌ల్లో సైతం తమకు తక్కువ ఓట్లు రావడంతో అభ్యర్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర ఓట్లు రాకపోవడంతో ఎక్కడ తప్పిదం జరిగిందనే చెక్ చేసుకుంటున్నారు. ఓటమిపై రివ్యూ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆ తప్పిదాలు మళ్లీ చేయకపోవడంతో పాటు తమకు మైనస్ ఉన్న గ్రామాల్లో మరింత పట్టు పెంచుకోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు.
గెలుపోటములపై లెక్కలు
జిల్లాలో గెలిచిన, ఓడిన అభ్యర్థులు తమ గెలుపోట ములపై లెక్కలు వేసుకుంటున్నారు. తమకు ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్ సమీక్షించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చిన ఓట్లు, ప్రస్తుతం వచ్చి న ఓట్లను బేరీజు వేసుకుంటున్నారు. జిల్లాలో ఒక్క పాలకుర్తిలో దయాకర్‌రావుకు మినహా అందరు అభ్యర్థులకు 2018 ఎన్నికల్లో కంటే ఓట్లు పెరిగాయి. 2018లో జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి 91,592 ఓట్లు రాగా ఈసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 98,975 ఓట్లు వచ్చాయి. ముత్తిరెడ్డి కంటే 7383 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్యకు 62,024 ఓట్లు రాగా ఈసారి పోటీ చేసిన ప్రతాప్‌రెడ్డికి 83,192 ఓట్లు వచ్చాయి. పొన్నాల కంటే 21,168 ఓట్లు ప్రతాప్‌రెడ్డికి వచ్చాయి. అదే విధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు 98,612 ఓట్లు రాగా ప్రస్తుతం పోటీ చేసిన కడియం శ్రీహరికి 1,01,696 ఓట్లు పడ్డాయి. రాజయ్య కంటే శ్రీహరికి 3084 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సింగపురం ఇందిరకు 62,822 ఓట్లు రాగా ఈసారి ఆమెకు 93,917 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఆమెకు 31,095 ఓట్లు పెరిగాయి. 2018లో పాలకుర్తి నుంచి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 1,17,504 ఓట్లు రాగా ఈసారి 79,214 ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో కంటే ఆయనకు 38,290 ఓట్లు తక్కువగా వచ్చాయి. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జంగా రాఘవరెడ్డికి 64,451 ఓట్లు రాగా ఈసారి పోటీ చేసిన మామిడాల యశస్వినిరెడ్డికి ఏకంగా 1,26,848 ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తిలో ఈసారి ఏకంగా 62,397 ఓట్లు పెరగడం విశేషం.
పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు
జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ఓటమి పట్ల ఆయా పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. అభ్యర్థుల అతి విశ్వాసం వల్లే ఓటమి చెందామని కొందరు చెబుతుండగా, ఓటర్లకు డబ్బు పంచే విషయంలో ప్రత్యర్థి పార్టీ కంటే వెనుకబడ్డామని, అందువల్లే ఓడిపోయామని మరికొందరు అంటున్నా రు. దీంతో పాటు సొంత పార్టీలోనే నేతలే ఓటర్లకు డబ్బు పంచకుండా చేతి వాటం ప్రదర్శించారని, ఈ కారణంతోనే ఓట్లు రాలేదని విశ్లేషించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఓటమి చెందిన అభ్యర్థుల ముందే పార్టీ శ్రేణులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఉండే సలహాదారుల తప్పుడు సల హాల వల్లే పోల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయలేకపో యామని ఈ కారణంగానే ఓడిపోయామనే అభిప్రా యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు ప్రత్యర్థి పార్టీ కంటే కొంత ఎక్కువగా డబ్బు ఇద్దామని తాను చెబితే వినలేదని, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తుల మాట లు నమ్మితే ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఓ పార్టీకి చెందిన సీనియర్ నేత పార్టీ శ్రేణుల ముం దే ఫైర్ అయినట్లు సమాచారం. రెండు చోట్ల కాంగ్రెస్ ఓడిపోవడానికి అభ్యర్థుల అతి విశ్వాసం కూడా కారణమన్న అభిప్రాయం పార్టీల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నుంచి జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి సింగపురం ఇందిర బరిలో నిలిచారు. కాగా.. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పలు సర్వేల్లోనూ అనుకూలంగానే వచ్చింది. దీంతో అటు కొమ్మూరి, ఇటు సింగపురం ఇందిర అతి విశ్వాసంతో పోల్ మేనేజ్‌మెంట్‌ను పట్టించుకోలేదని తెలుస్తోంది. తాము గెలుస్తున్నామనే ధీమాతో చివరి క్షణంలో కొంత ఏమరపాటుగా ఉండడంతోనే ఓటమిని మూటగట్టున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నారు.
ఇక పాలకుర్తిలో సొంత పార్టీ నేతలపై ఉన్న వ్యతిరేకతే కొంపముంచిందనే ప్రచారం జరుగుతోంది. కింది స్థాయి నేతలపై ప్రజల్లో సరైన అభిప్రాయం లేకపోవడం, వరుసగా మూడు పర్యాయాలుగా ఆయనే గెలవడంతో సహజంగా వచ్చిన వ్యతిరేకత ఎర్రబెల్లికి మైనస్ అయినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. ఓటమిని ఎర్రబెల్లి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆదివారం కౌంటింగ్ కేంద్రానికి కూడా రాలేదు. యాదగిరిగుట్ట నుంచే కౌంటింగ్ ఫలితాలను చూశారు. 7వ రౌండ్ తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. సొంత పార్టీ నేతలను కూడా తనను కలవడానికి రావొద్దని, తానే రెండు, మూడు రోజుల్లో పాలకుర్తి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.