Share News

గిట్లేట్ల అయ్యిందబ్బా..!

ABN , First Publish Date - 2023-12-04T23:38:22+05:30 IST

అసెం బ్లీ ఎన్నికల ఫలితాలు భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ నాయ కులకు షాకిచ్చాయి. ఊహించని రీతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడాన్ని ‘గులాబీ’ నేతలు జీర్ణియించుకోలేకపోతున్నారు. పోల్‌ మేనే జ్‌మెంట్‌లో సక్సెస్‌ అయినప్పటికీ ఓట్లు రాబట్టలేకపో యామనే మనోవేదన వారిని వెంటాడుతోంది.

గిట్లేట్ల అయ్యిందబ్బా..!

‘గులాబీ’ పార్టీకి ఊహించని పరాజయం

పోల్‌ మేనెజ్‌మెంట్‌లో సక్సెస్‌.. ఓట్లు పొందటంలో ఫెయిల్‌

ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్న నేతలు

ఓటర్లను ఆకర్షించటంతో వైఫల్యం ఎక్కడా..? అని ఆరా

కాంగ్రెస్‌ అభ్యర్థికి సానుభూతికి తోడు కలిసి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత

మరోసారి డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి

భూపాలపల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ ఎన్నికల ఫలితాలు భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ నాయ కులకు షాకిచ్చాయి. ఊహించని రీతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడాన్ని ‘గులాబీ’ నేతలు జీర్ణియించుకోలేకపోతున్నారు. పోల్‌ మేనే జ్‌మెంట్‌లో సక్సెస్‌ అయినప్పటికీ ఓట్లు రాబట్టలేకపో యామనే మనోవేదన వారిని వెంటాడుతోంది. కాం గ్రెస్‌ అభ్యర్థికి సానుభూతితోపాటు ప్రభుత్వ వ్యతి రేకత ఓట్ల రూపంలో కలిసి వచ్చిందనే అభిప్రాయా లు బీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈసారి కూడా డిపాజిట్‌ను కోల్పోవ టం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి జోష్‌ కనబర్చారు. మూడు నెలలుగా ఊరూరా ప్రచారం నిర్వహించి ప్రతి ఓటరనూ కలిసేందుకు ప్రయత్నించారు. కొన్ని గ్రామాల్లో రెండు పర్యాయాలు ప్రచారం నిర్వహించారు. రెండోసారి గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారానికి వెళ్లని చోట ఆయన సతీమణి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వెళ్లి ఓటర్లను కలిశారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు ఊహించిన దానికంటే అధికంగా జనం తరలి వచ్చారు. కుండపోత వర్షం పడుతున్నా జనం భారీగా రావటంతో గులాబీ నేతల్లో గెలుపుపై ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇలా ఎన్నికల ప్రచారంతో పాటు పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యర్థుల కంటే ముందే ఉంది. తాయిలాల పంపిణీలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఎక్కడో వెనక్కి నెట్టేశారు. మూడు నెలలుగా చీరలు, దుస్తులు, మద్యం.. ఇలా ఏదో ఒక రూపంలో ఓటర్లకు తాయిలాలు అందించారు. అంతేకాకుండా జీఎంఆర్‌ ట్రస్ట్‌ ద్వారా వేలాది మందికి స్వయం ఉపాధి కల్పించటంతోపాటు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఇలా పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకు సక్సెస్‌ అయ్యారనే టాక్‌ వచ్చింది. కానీ, పోలింగ్‌ వరకు అంతా బాగానే అనిపించినప్పటికీ పోలింగ్‌ జరిగే రోజే ఓటర్లు కాంగ్రెస్‌కు జై కొడుతున్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచి అందిన సమాచారం గులాబీ నేతలకు షాక్‌కు గురి చేసింది. ఒక దశలో గణపురం మినహా మిగతా అన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం వస్తుందని, ప్రధానంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారీగా ఓట్లు వస్తాయని బీఆర్‌ఎస్‌ నేతలు ఆశించారు. ఫలితాలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ఏ ఒక్క మండలంలో కూడా బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లో 2 వేల నుంచి 3 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎంతో ఆశలు పెట్టుకున్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఏకపక్షంగా ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్థి వైపు మొగ్గు చూపారు. సింగరేణి కార్మికులు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికే జై కొట్టారు. దీంతో ఊహించని రీతిలో సుమారు 52 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు విజయం సాధించారు.

వైఫల్యం ఎక్కడ..?

ఎన్నికల ఫలితాలపై గులాబీ నేతలు ముల్లాగుల్లాలు పడుతున్నారు. ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏమిటనే అంశంపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో బలంగా వీచిన ప్రభుత్వ వ్యతిరే కతకు తోడు గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సాను భూతి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి కలిసి వచ్చిందనే టాక్‌ బీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ రెండు అంశాలు కూడా 52వేల మెజారి టీని ఇచ్చేంత బలంగా లేవని భావిస్తున్నారు. ఇవేకా కుండా బలమైన కారణాలు మరికొన్ని ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి స్వయంగా వెంకటరమణారెడ్డికి మద్దతు ప్రకటించినప్పటికీ ఆయన వర్గీయుల్లో అనేక మంది కాంగ్రెస్‌కు మద్దతు పలికారని ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థులు మాత్రం వెంకటరమణారెడ్డి ఓటమి ఆయన స్వయంకృతపరాధంగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా గండ్ర వ్యక్తిగతంగా బాగానే పని చేసినప్పటికీ ఆయన ముఖ్య అనుచరుల తీరే పార్టీకి, ఆయనకు భారీగా నష్టం చేకూర్చిందనే టాక్‌ వినిపి స్తోంది. ఐదేళ్లుగా చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, భూపాలపల్లిలోని ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల ఒంటె ద్దు పోకడలు, నియంతృత్వంగా వ్యవహరించటం గులాబీ పార్టీలోని కింది స్థాయి కేడర్‌లో ఆగ్రహం తెప్పించిందనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఇసుక దందాతో పాటు కాంట్రాక్టు పనులు, భూదం దాలు, బెదిరింపుల్లో కూడా ఈ నలుగురైదుగురు కీలకంగా వ్యవహరించటం, విషయం తెలిసినా వెంకటరమణారెడ్డి పట్టించుకోకపోవటం కూడా ప్రజల్లో ఆగ్రహానికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేపై ఉన్న కోపం కంటే మండలాల్లో పెత్తనం చెలాయించిన ఒకరిద్దరు మండల ప్రజాప్రతినిధులు, భూపాలపల్లి పట్టణంలోని ఇద్దరు ముగ్గురు నేతల వ్యవహారం కూడా ఓటమిలో కీలకంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్‌ నేతలు సక్సెస్‌ అయ్యారనే టాక్‌ ఉంది. కనీసం గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతల బూత్‌లల్లో, స్వగ్రామాల్లో కూడా మెజారిటీ రాకపోవడం వారిపై ఉన్న ప్రజాగ్రహానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమికి ప్రభుత్వం వ్యతిరేకత, కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఉన్న సానుభూతితో పాటు కింది స్థాయి నేతల ఒంటెద్దుపోకడలతో పాటు అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

కమలనాథుల్లో నైరాశ్యం

భూపాలపల్లి సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలకు కూడా ఓటర్లు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చందుపట్ల కీర్తిరెడ్డికి 2018లో 15,744 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉండటంతో నాలుగో స్థానంలో ఆమె నిలిచారు. కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈసారి గట్టి పోటీ ఇవ్వటంతో పాటు కనీసం 40వేల పైగా ఓట్లు సాధించాలని కీర్తిరెడ్డి టార్గెట్‌ పెట్టుకున్నారు. ఎమ్మార్పీఎస్‌, జనసేన మద్దతు లభించటంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల వ్యతిరేక ఓట్లు కూడా తమకు కలిసి వస్తాయని బీజేపీ నేతలు లెక్కలు వేసుకున్నారు. ఊహించిన దానికంటే అతి తక్కువ ఓట్లు పోల్‌ రావటం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కీర్తిరెడ్డికి కేవలం 14,610 ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి వెయ్యి ఓట్లు తగ్గటంతో పాటు డిపాజిట్‌ కూడా గల్లంతవ్వటం బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. రెండు నెలలుగా ప్రచారం నిర్వహించటంతో పాటు పోల్‌మేనేజ్‌మెంట్‌ కూడా సక్సెస్‌గా చేసినప్పటికీ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో కమలనాథులు నైరాశ్యంలో ఉన్నారు.

Updated Date - 2023-12-04T23:38:31+05:30 IST