Share News

ఆ ఐదింటిపైనే ఆశలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:55 PM

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. సంక్షేమ పథకాల కోసం అర్హులను గుర్తించి, అమలు చేసేందుకు గ్రామసభలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన గ్రామసభ’లను సర్కారు జరపనుంది. ఈ సభల్లో ఆరు గ్యారెంటీల్లో.. ఐదు పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఆ ఐదింటిపైనే ఆశలు

జిల్లాలో రేపటి నుంచి ప్రజాపాలన గ్రామసభలు

ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఒకే ఫారంలో అన్ని స్కీముల వివరాల నమోదు

తొమ్మిదిన్నరేళ్లుగా మోక్షం లేని రేషన్‌కార్డులు

గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత అర్జీలు

మహబూబాబాద్‌ టౌన్‌, డిసెంబరు 26 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. సంక్షేమ పథకాల కోసం అర్హులను గుర్తించి, అమలు చేసేందుకు గ్రామసభలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన గ్రామసభ’లను సర్కారు జరపనుంది. ఈ సభల్లో ఆరు గ్యారెంటీల్లో.. ఐదు పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు మహబూబాబాద్‌ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రజాపాలనపై సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్‌ శశాంక కిందిస్థాయి అధికారులకు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాపాలన నిర్వహణ, విధివిఽధానాలు, ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు చేశారు. ఈనెల 28వ తేదీ నుంచి గ్రామాలు, మునిసిపాలిటీల్లోని వార్డుల్లో గ్రామసభలు నిర్వహించేందుకు ప్రణాళికలను తయారు చేశారు. నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు ప్రతీ మండలానికి జిల్లాస్థాయి అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియామకం చేశారు. మండల స్థాయిలో అధికారులతో టీమ్‌ను ఏర్పాటు చేసి నిత్యం ప్రజా పాలనను పర్యవేక్షించే విధంగా ప్రణాళికలు రచించారు.

ప్రతీరోజు ఒక్కొ బృందం రెండు గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. మునిసిపాలిటీల స్థాయిలో కూడా అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. మండలస్థాయి బృందంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంపీవో, ఏవో, పీహెచ్‌సీ వైద్యులు, ఎంఈవో, ఏఈ (విద్యుత్‌), సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, ఇతర సంబంధిత అధికారులు ఇందులో ఉంటారు. మునిసిపాలిటీ స్థాయిలో మునిసిపల్‌, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్యం, విద్యుత్‌శాఖ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. ప్రజాపాలన ద్వారా రాష్ట్ర సర్కార్‌ ప్రవేశపెట్టనున్న పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరు జిల్లాల అధికారులతో ప్రజాపాలనపై సమీక్షించారు.

మున్సిపాలిటీల్ల్లోనూ..

జిల్లాలో తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, మానుకోట మునిసిపాలిటీల్లోని 82 వార్డులతో పాటు 18 మండలాల పరిధిలో 461 గ్రామపంచాయతీల్లో ఈనెల 28 నుంచి ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 31, జనవరి 1న సోమవారం నూతన సంవత్సరాది సెలవు దినం ఉండడంతో ఆ రెండు రోజులు మినహా మిగతా తొమ్మిది రోజుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు గ్రామసభలను నిర్వహిస్తారు. ప్రతిరోజు మండలంలో రెండు గ్రామాల్లో ప్రజాపాలన సభలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మునిసిపాలిటీ పరిధుల్లో వార్డుల్లో కూఛ్ఛి ఉదయం, సాయంత్రం వేళల్లో సభలు కొనసాగనున్నాయి. ఏఏ తేదీల్లో ఏఏ గ్రామాలు, ఏ వార్డుల్లో గ్రామసభలు ఉంటాయనే సమాచారంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కరోజు ముందుగా ఆయా గ్రామాల్లో ఠాం..ఠాం చేసి ప్రజలకు గ్రామసభల సమాచారం చేరవేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రతీ వందమంది కుటుంబసభ్యులకు ఒక కౌంటర్‌ చొప్పున ప్రతీ గ్రామంలో ఐదు నుంచి ఆరు కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. తొలుత వెయ్యి జనాభా లోపు గ్రామపంచాయతీల్లో సభలను పూర్తిచేసి, కొత్త సంవత్సరంలో పెద్ద గ్రామపంచాయతీల్లో సభలను నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణ..

జిల్లాలో ఈనెల 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో ప్రభుత్వ పథకాలకు అర్హత పొందేందుకు ప్రజలనుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి (మహిళలకు నెలకు రూ.2, 500), గృహజ్యోతి (ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌), రైతు భరోసా (ఎకరానికి ఏడాదికి రూ.15వేలు), ఇందిరమ్మ ఇళ్లు (ప్రతీ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు), చేయూత (నెలకు రూ.4 వేల పింఛన్‌) పథకాలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. సభ రోజే కాకుండా జనవరి 6వ తేదీ వరకు ప్రతిరోజు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను కూడా ప్రభుత్వమే అందించనుంది. ఒకే దరఖాస్తులో అన్ని పథకాలకు సంబంధించి వివరాలను పొందుపరచాల్సి ఉం టుంది. దీనికి తోడు రేషన్‌కార్డు దరఖాస్తు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. 2014 స్వరాష్ట్రం సిద్ధించకముందు ఉమ్మడి రాష్ట్రంలో తెల్లరేషన్‌కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడామంజూరు చేయాలేదు. దీంతో ప్రజల్లో మళ్లీ రేషన్‌కార్డుపై ఆశలు చిగురిస్తున్నాయి. అన్నింటికి తెల్లరేషన్‌కార్డే ప్రామాణికం కావడంతో ఇక తమ కష్టాలు తీరుతాయనే ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరోపక్క గ్రామస్థాయిలో సభలు నిర్వహించడం, అన్నిశాఖల మండల స్థాయి అధికారులు రావడంతో ప్రజాపాలన సభలో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్న భావన ప్రజల్లో నెలకొంది.

Updated Date - Dec 26 , 2023 | 11:55 PM