హనుమకొండ కొత్త కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ABN , First Publish Date - 2023-01-31T23:53:34+05:30 IST

హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కలెక్టర్లు బదిలీకాగా, రాజీవ్‌గాంధీ హనుమంతుకు కూడా స్థాన చలనం జరిగింది.

హనుమకొండ కొత్త కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

పాలనలో తనదైన ముద్ర..

ఆయన హయాంలోనే కొత్త కలెక్టరేట్‌ భవనం

ఆదిలాబాద్‌లో సత్తా చాటిన సిక్తా

హనుమకొండ రూరల్‌, జనవరి 31: హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కలెక్టర్లు బదిలీకాగా, రాజీవ్‌గాంధీ హనుమంతుకు కూడా స్థాన చలనం జరిగింది.

మారిన జిల్లాలో..

రాజీవ్‌గాంధీ హనుమంతు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌గా 2020 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలోనే రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరంగల్‌, హనుమకొండ జిల్లాల పునర్విభజన జరగగా, కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. పేరుమారిన కొత్త జిల్లాకు ప్రథమ కలెక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు. అలాగే కొత్త కలెక్టరేట్‌లో మొదటి కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రికార్డు కూడా ఆయనకే సొంతం. మరో ముఖ్య ఘట్టం ఉద్యోగుల విభజన. ఈ పరిణామం సైతం ఆయన హయాంలోనే జరిగింది.

తనదైన ముద్ర

రాజీవ్‌గాంధీ హనుమంతు మూడేళ్లకాలంలో కలెక్టర్‌గా జిల్లాపై తనదైన ముద్రవేశారు. పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రగతిపథంలో జిల్లాను ముందుకు నడిపించడం ద్వారా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించారు. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం త్వరితగతిన పూర్తికావడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొత్త కలెక్టరేట్‌లోకి అన్ని శాఖలను తీసుకురావడంతో పాటు వాటి ప్రాధాన్యతను బట్టి భవన సముదాయంలో సముచిత స్థానం కల్పించారు. భారీవర్షాలు, కరోనా సమయంలో అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లారు.

సమర్థురాలు సిక్తా పట్నాయక్‌

రాజీవ్‌గాంధీ హనుమంతు స్థానంలో ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ వస్తున్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన సిక్తా.. అంతకుముందు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌గా పని చేశారు. 2020లో ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు ఒడిసా రాష్ట్రానికి చెందిన సిక్తా పట్నాయక్‌ సమర్ధురాలైన పాలనాధికారిగా ఆదిలాబాద్‌ జిల్లాపై తనదైన ముద్రవేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఒకే రోజు రెండు వందలకుపైగా ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి సంచలనం సృష్టించారు. ఒరియాతో పాటు ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు భాషలు తెలిసిన సిక్తా.. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడంపై ప్రధానంగా దృష్టిసారిస్తారనే పేరుంది.

Updated Date - 2023-01-31T23:53:36+05:30 IST