కడగండ్ల వాన

ABN , First Publish Date - 2023-03-20T00:13:16+05:30 IST

హనుమకొండ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వాన, అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వరుణ దేవుడు సృష్టించిన బీభ త్సానికి వందలాది రైతులు నష్ట పోయారు. వేలాది ఎకరా ల పంట నేలపాలైంది.

కడగండ్ల వాన
ఆత్మకూరు మండలంలో తడిసిన మిర్చి

జిల్లావ్యాప్తంగా వర్ష బీభత్సం

అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగం

దెబ్బతిన్న పంటలు, పండ్లతోటలు

మొక్కజొన్నకు అపార నష్టం.. నేలరాలిన మామిడి

90 శాతం పంటలకు నష్టం

గాలికి ఎగిరిపోయిన ఇళ్ల కప్పులు

నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

పంట నష్టాన్ని అంచనా వేస్తున్న వ్యవసాయాధికారులు

హనుమకొండ(ఆంధ్రజ్యోతి)/హనుమకొండ అగ్రికల్చర్‌, మార్చి 19 : హనుమకొండ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వాన, అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వరుణ దేవుడు సృష్టించిన బీభ త్సానికి వందలాది రైతులు నష్ట పోయారు. వేలాది ఎకరా ల పంట నేలపాలైంది. అరుగాలం కష్టించిన అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి. పీచుతొడుగుతున్న మొక్కజొన్న, ఈత కొచ్చిన వరిపైరు, ఇరుగకాసిన మామిడి పుచ్చ, బొబ్బాయి తోటలు 90 శాతం ధ్వంసం అయ్యాయి. కూరగాయ తోటలు అక్కరకు రాకుండా పోయాయి. ప్రధానంగా మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వర్ష బీభత్సం

శనివారం అర్ధరాత్రి మొదలైన వడగళ్ల్లు, ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసింది. వడగళ్ల దెబ్బకు మొక్కజొన్న వెన్నులు విరిగి నేలకు ఒరిగాయి. జోరుగా కురిసిన వర్షం వల్ల వరి నేలవాలింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు వంగిపోయాయి. సుమారు అయిదుగంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. గాలితీవ్రతకు పలు చోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. గుడిసెలు కుప్పకూలాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో పిడుగుపడి ఆవు చనిపోయింది. దామెర మండలకేంద్రం లో గాలివానకు రెండు ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. ల్యాదెల్ల, పులుకుర్తి రహదారిపై చెట్లు విరిగిపడి రాకపోక లకు అంతరాయం కలిగింది. కమలాపూర్‌ మంలంలో శంభుని పల్లిలో గాలిదుమారానికి చెట్లు విరిగిపడడంతో కరెంట్‌ స్తంభం విరిగిపోయింది. హసన్‌పర్తి మండలంలో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఐన వోలు మండలంలో వెంకటాపూర్‌, కక్కిరాలపల్లి, నందనం తదితర గ్రామాల్లో విద్యుత్‌ తీగెలు తెగి కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. హనుమకొండ పట్టణం సుబేదారిలో చెట్లు విరిగి పడ్డాయి. వడగళ్లు పడడంతో కొన్ని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. భీమదేవరపల్లిలో వడగళ్ల వాన జోరుగా కురిసింది. మిగతా మండలాల్లో ఈదురుగాలులు, జోరువాన విధ్వంసం సృష్టించింది.

అధికారికంగా...

వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమి కంగా వేసిన అంచనా ప్రకారం జిల్లాలో వడగళ్లవాన, అకాల వర్షం వల్ల 3,617 మంది రైతులకు చెందిన 6594 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు మామిడి, కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. 602 మంది రైతులకు చెందిన 946 ఎకరాల వరి పంట, 3,015 మంది రైతులకు సంబంధించిన 4,626 ఎకరాల మొక్కజొన్న అక్కరకు రాకుండాపోయింది. 900 ఎకరాల్లో మామిడి, 112 ఎకరాల్లో కూరగాయలు, 10 ఎకరాల్లో పుచ్చ నేలపాలైంది. అయినవోలు మండలంలో అత్యధికంగా 1760 మంది రైతులకు చెందిన 2250 ఎకరాల మొక్కజొన్న ధ్వంసం అయింది.

15వేల ఎకరాల్లో..

అనధికారిక లెక్కల ప్రకారం ఈ నష్టం ఇంకా ఎక్కువగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. సుమారు 2500 ఎకరాల్లో వరి, 7500 ఎకరాల్లో మొక్కజొన్న, 5వేల ఎకరాల్లో మామిడి, వెయ్యి ఎకరాల్లో కూరగాయాలు, పండ్ల తోటలు చెబ్బతిన్నట్టు సమాచారం. వ్యవసాయ, ఉద్యానవన అధికారులు ఆదివారం వడగళ్లవాన వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పంటలు, పండ్ల తోటలు, కూరగాయ తోటల పరిస్థితిని పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మొక్కజొన్న, మామిడి తోటలకు అపారమైన నష్టం జరిగినట్టు పలు రైతులు వాపోయారు. వివిధ పార్టీల నాయకులు గ్రామాల్లో పర్యటించి పంటల పరిస్థితిని అంచనా వేశారు.

మండలాల్లో...

వడగళ్లు, వర్షంవల్ల ఎల్కతుర్తి, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, ధర్మసాగర్‌ మండలాలల్లో పంట నష్టం ఎక్కువగా జరిగింది. ఎల్కతుర్తి మండలంలో 288 ఎకరా ల్లో వరి 599 ఎకరాల మొక్క జొన్నతోపాటు పుచ్చతోటలు, కూరగా యల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. హసనపర్తి మండలంలో 360 ఎకరాల్లో వరి, 55 ఎకరాల్లో కూరగాయాలు, 100 ఎకరాల్లో మామిడి, 975 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. కమలాపూర్‌ మండలంలో 345 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో మిర్చి అక్కరకు రాకుండా పోయింది. ధర్మసాగర్‌ మండలంలో 90 ఎకరాల్లో వరి, 245 ఎకరాల్లో మొక్కజొన్న, వేలేరు మండలంలో 250 ఎకరాల్లో వరి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నది. భీమదేవరపల్లి మండలంలో భీభత్సంగా కురిసిన వడగళ్ల వల్ల 100 ఎకరాల్లో మామిడి నేలరాలింది. దామెర మండలంలో 50 ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో అరటి, 10 ఎకరాల్లో కీరదోస ధ్వంసం అయింది. ఆత్మకూరు మండలంలో 100 ఎకరాల్లో మొక్కజొన్న, 25 ఎకరాల్లో కీరదోస, 20 ఎకరాల్లో బొప్పాయి, 10 ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నది. నడికూడ మండలంలో 500 ఎకరాల్లో మొక్కజొన్న, 150 ఎకరాల్లో మిరప పంట చేతికి రాకుండా పోయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది.

వర్షపాతం

జిల్లాలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 43.0 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 36.9మి.మీ, వేలేరు 65.5మి.మీ, ఎల్కతుర్తి 41.9మి.మీ, కమలాపూర్‌ 7.6 మి.మీ, హసన్‌పర్తి 54.5మి.మీ, ధర్మసాగర్‌ 37.4మి.మీ, కాజిపేట్‌ 52.0మి.మీ, హన్మకొండ 44.1మి.మీ, ఐనవోలు 58.3మి.మీ, పరకాల 28.8 మి.మీ, దామెర 39.8మి.మీ, ఆత్మకూర్‌ 67.8మి.మీ, శాయంపేట 42.2మి.మీ, నడికుడలో 25.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-03-20T00:13:16+05:30 IST