Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABN , First Publish Date - 2023-12-10T00:05:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా రూ.10లక్షలకు పెంపు పథకాలు హనుమకొండ జిల్లాలో ప్రారంభమయ్యాయి.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

అట్టహాసంగా మొదలైన ‘మహాలక్ష్మి’ పథకం

ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళలు

జీఎంహెచ్‌ వద్ద ప్రారంభించిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

బస్సు ఎక్కిన అధికారులు, ట్రాన్స్‌జెండర్స్‌

ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు

హనుమకొండ అర్బన్‌, డిసెంబరు 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా రూ.10లక్షలకు పెంపు పథకాలు హనుమకొండ జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాలను జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అట్టహాసంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహాలక్ష్మి జీరో టికెట్‌ను కలెక్టర్‌ చేతులమీదుగా ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, వృద్ధ మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ప్రవేశపెట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు వీరికి జీరో టికెట్‌ ఇస్తారన్నారు. మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి తెలంగాణ చిరునామా కలిగి ఉంటే సరిపోతుందని వెల్లడించారు.

బస్సులో ప్రయాణించిన కలెక్టర్‌

హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌.. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆస్పత్రి నుంచి అశోకా జంక్షన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, హయగ్రీవచారి కాంపౌండ్‌, కాళోజీ సెంటర్‌, అంబేద్కర్‌ సర్కిల్‌, పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం మీదుగా తిరిగి ప్రసూతి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు తీసుకున్న జీరో టికెట్లను కలెక్టర్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంపై పలువురు మహిళలు ఆనందం వవ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం మాధవరావు, ఇన్‌చార్జి ఆర్‌డీవో శ్రీనివాస్‌ డీఆర్‌డీవో శ్రీనివాస్‌ కుమార్‌, జీఎంహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, ఆర్‌ఎంవో డాక్టర్‌ సారంగం, ఆర్టీసీ, ఆర్‌టీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య సాయం కింద రూ.10లక్షల వైద్యం ఉచితంగా అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతోపా టు ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ ఈ పథకం ద్వారా వై ద్య సేవలు పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్‌ బి.సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఈ పథకం వరమన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు నగదు రహిత చికిత్సతోపాటు రోగికి ఉచితంగా ఆహారం, రవాణా చా ర్జీలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఐదు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు 37 ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు అవుతుందన్నారు.

Updated Date - 2023-12-10T00:05:05+05:30 IST