‘హాత్‌’ కా ‘సాథ్‌’

ABN , First Publish Date - 2023-02-21T23:44:57+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సహం నింపుతోంది.

‘హాత్‌’ కా ‘సాథ్‌’

‘హాత్‌సే హాత్‌ జోడో’తో ప్రజాక్షేత్రంలోకి..

నేడు భూపాలపల్లి జిల్లాలో రేవంత్‌రెడ్డి యాత్ర

చిట్యాల నుంచి మొగుళ్లపల్లి వరకు..

పార్టీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌

కేడర్‌లో నూతనోత్సాహం

గండ్ర సత్యనారాయణరావుకు ఊరట!

భూపాలపల్లి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సహం నింపుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా భూపాలపల్లి జిల్లాకు బుధవారం చేపట్టనున్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు అలుపెరుగక శ్రమించారు.

దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు అనుబంధంగా రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 6న ములుగు జిల్లా మేడారం వనదేవతల సన్నిధి నుంచి ఆయన యాత్రను ప్రారంభించారు. మహబూబా బాద్‌, వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో రెండు వారాలుగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభు త్వంపై ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఈ కామెంట్లు కాంగ్రెస్‌ శ్రేణులను ఆకట్టుకుంటున్నాయి. జోడో యాత్రలో భాగంగా నక్సల్స్‌ ప్రాబల్య ప్రాంతాల్లో పట్టుకు నజర్‌ వేసిన రేవంత్‌రెడ్డి భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో అడుగుపెడుతున్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు అలుపెరుగక శ్రమించారు. విస్తృత ఏర్పాట్లు చేశారు.

వరంగల్‌ జిల్లాలో మంగళవారం జోడో యాత్ర నిర్వహించిన రేవంత్‌రెడ్డి చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి(సీ)కి రాత్రి చేరుకున్నారు. అక్కడే బస చేసిన ఆయన బుధవారం ఉదయమే రేగొండ మండలం కొటవటంచ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి చల్లగరిగే, జూకల్లు గ్రామాల్లో ప్రజలతో మాటాముచ్చటలో పాల్గొంటారు. ఆ తర్వాత చిట్యాలకు చేరుకొని మధ్యాహ్న భోజనం చేస్తారు. చిట్యాల నుంచి ఏలేటిరామయ్యపల్లి, నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి వరకు 8కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. రాత్రి 7 గంటలకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కార్నర్‌ మీటింగును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్న రేవంత్‌రెడ్డి మొగుళ్లపల్లి సభలో ఏం మాట్లాడుతారో..? అనే ఉత్కంఠ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు హాత్‌ సే హాత్‌ జోడో యాత్రతో రేవంత్‌రెడ్డి కేడర్‌లో కొత్త ఉత్సహాన్ని నింపుతున్నారు.

28న మళ్లీ యాత్ర

భూపాలపల్లి నియోజకవర్గంలో 28వ తేదీన రేవంత్‌రెడ్డి మరోసారి పర్యటించనున్నారు. 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయారాయపూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ ఉండటంతో జోడో యాత్రను వాయిదా వేశారు. 27న పరకాల నియోజకవర్గంలో పాల్గొనున్న రేవంత్‌రెడ్డి, 28న భూపాలపల్లి నియోజకవర్గంలో యాత్ర చేయనున్నారు. భూపాపలపల్లి పట్టణ పరిధి కాశీంపల్లి నుంచి అంబేద్కర్‌సెంటర్‌ వరకు పాదయాత్ర చేయనున్నారు. సింగరేణి భూనిర్వాసితులతో పాటు సింగరేణి కార్మికులతో మాటా ముచ్చటలో పాల్గొనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో జరిగే కార్నర్‌ మీటింగు నిర్వహిస్తారు.

గండ్ర సత్యనారాయణ అనుచరుల్లో జోష్‌

భూపాలపల్లి నియోజకవర్గంలో తన ప్రాధాన్యాన్ని మరింత పెంచుకునేందుకు టీపీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావుకు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ఉపకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 ఫిబ్రవరిలో గులాబీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు 80శాతం ముఖ్య నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ క్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖతోపాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు భూపాలపల్లి నియోజకవర్గంపై దృష్టిసారించి కేడర్‌తో టచ్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావటంతో గతంలో టీడీపీలో తనతో కలిసి పనిచేసిన గండ్ర సత్యనారాయణరావును ఆయన కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో 2021 డిసెంబ రులో కాంగ్రెస్‌లో చేరిన సత్యనారాయణ రావుకు పాత కాంగ్రెస్‌ నేతలను ఆశించిన స్థాయిలో సహ కారం లభించలేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో తన వర్గం నేతలతో పాటు మండలాల్లోని పాత కాం గ్రెస్‌ శ్రేణులను అక్కడక్కడ కలుపుకుని వెళ్తున్నారు.

భూపాలపల్లి టౌన్‌లో కాంగ్రెస్‌ గ్రూపులుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో గత నెల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా గండ్ర సత్యనారాయణ పేరును రేవంత్‌రెడ్డి ఖరారు చేసినప్పటికీ ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తన నియోజకవర్గానికి చెందిన ప్రకాశ్‌రెడ్డినే కొనసాగించాలని పట్టుపట్టారని ప్రచారం జరిగింది. రేవంత్‌రెడ్డి మాత్రం గండ్ర వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరికీ ఇవ్వకుండా అధిష్ఠానం పెండింగులోనే పెట్టింది. దీంతో కొంత నిరాశకు గురైన సత్యనారా యణ వర్గానికి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర జోష్‌ నింపింది. రేవంత్‌కు ముందే సత్యనారాయణ జనవరి 27 నుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో బీజేపీ, ఏఐబీఎఫ్‌ల నుంచి పోటీ చేసిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగాలనే ఉద్దేశంతో ప్రజా క్షేత్రంలో బిజీ అయ్యారు. రేవంత్‌రెడ్డి భూపాలపల్లి నియోజక వర్గంలో చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రతో పర్యటిస్తుండటంతో సత్యనారాయణ వర్గీయుల్లో ఉత్సహం ఉరకలేస్తోంది.

శ్రీధర్‌బాబు వచ్చేనా..?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టినహాత్‌సే హాత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల నుంచి సహకారం లభించటం లేదనే టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి, మంథఽని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు సొంత జిల్లా భూపాలపల్లిలో బుధవారం జరిగే రేవంత్‌రెడ్డి యాత్రపై ఉత్కంఠ నెలకొంది. తన నియోజకవర్గ పరిధి కానప్పటికీ సొంత జిల్లా కావటంతో శ్రీధర్‌బాబు పాల్గొంటారా.. లేదా? అనే అంశం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలో కూడా హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను శ్రీధర్‌బాబు నిర్వహించటం లేదు. ఒకట్రెండు రోజులు కాటారం మండలంలోని కొన్ని గ్రామాల్లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఐతే ప్రకాశ్‌రెడ్డి జోడో యాత్రను నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు కూడా మంథని పరిధిలోని మండలాల్లో జోడో యాత్ర జోలికి వెళ్లలేదు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలో తన సొంత జిల్లాలో రేవంత్‌రెడ్డి జోక్యంపై శ్రీధర్‌బాబు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో జరిగే జోడో యాత్రలో శ్రీధర్‌బాబు పాల్గొంటారా.. లేదా..? అనేది కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది.

Updated Date - 2023-02-21T23:45:06+05:30 IST