Share News

ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌

ABN , Publish Date - Dec 16 , 2023 | 12:47 AM

కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభకు ప్రభుత్వ విప్‌గా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ నియామకయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి తొలి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ మేరకు ప్రకటన వెలువడింది.

ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌

సీనియర్‌ రాజకీయవేత్త రెడ్యానాయక్‌పై డోర్నకల్‌ ఎమ్మెల్యేగా గెలుపుతో గుర్తింపు

కేబినెట్‌ హోదాలో పదవి..

మానుకోట జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం

మహబూబాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభకు ప్రభుత్వ విప్‌గా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ నియామకయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి తొలి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ మేరకు ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌గా ప్రకటించారు. అందులో మహబూబాబాద్‌ జిల్లాకు ఈ అరుదైన అవకాశం లభించడం విశేషం.

జిల్లాలోని డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి అప్రహిత విజయాలు సాధిస్తూ సీనియర్‌ రాజకీయవేత్తగా ఎదగడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన డీఎ్‌స.రెడ్యానాయక్‌ మీద అతి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కోణంలో ఆయనకు విప్‌ పదవిని కట్టబెట్టారు.

సర్పంచ్‌ తండా నుంచి..

మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు సర్పంచ్‌ తండాకు చెందిన జాటోతు రాంచంద్రునాయక్‌ కూడా ఆది నుంచి విద్యకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఉస్మానియా నుంచి ఎంబీబీఎ్‌సతో పాటు ఎంఎస్‌ సర్జన్‌ పట్టాలు పొంది, ప్రస్తుత సూర్యాపేట జిల్లా కేంద్రంలో శివసాయి ఆస్పత్రిని స్థాపించి నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన సతీమణి ప్రమీల కూడా గైనకాలజి్‌స్టగా వైద్య వృత్తినే నిర్వహిస్తూ వస్తున్నారు. రాంచంద్రునాయక్‌ అన్న జాటోతు నెహ్రూనాయక్‌ మొదట్నుంచి తొర్రూరు ప్రాంత రాజకీయాల్లో చురుకైన నేతగా ఎదుగుతూ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లిన సందర్భంలో డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ను చూసి మంచి రాజకీయ భవిష్యత్‌ ఉందని చెప్పడంతో పాటు అన్న రాజకీయ వారసుడిగా టీడీపీలో చేరిపోయారు. అక్కడ్నుంచే డోర్నకల్‌ నియోజకవర్గ రాజకీయాల్లో కాలు మోపారు. 2006లో టీడీపీ అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి చేపట్టారు.

2014లో టీడీపీ నుంచి డోర్నకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల్లో కాంగ్రె్‌సలో చేరారు. 2018లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున డోర్నకల్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాల య్యారు. తాజాగా 2023లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి అసాధారణ మెజార్టీతో విజయం సాధించారు. సీనియర్‌ రాజకీయవేత్త రెడ్యానాయక్‌పై పోటీచేసి విజయం సాధించిన జాటోతు రాంచంద్రునాయక్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపునిచ్చి ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించారు.

ఉమ్మడి ఏంపీలో రాంచంద్రారెడ్డి, రెడ్యా..

మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి తొలుత దివంగత నూకల రాంచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ప్రాతినిథ్యం వహించారు. డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని జమాండ్లపల్లికి చెందిన నూకల రాంచంద్రారెడ్డి 1954లో రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రాంచంద్రారెడ్డి తొలి గెలుపులోనే రాష్ట్ర ఆహార, వ్యవసాయశాఖ మంత్రిగా పదవిని అలంకరించారు. 1962-63లో జరిగిన ఎన్నికల్లో సైతం విజయదుందుభి మోగించి రెండోసారి రెవెన్యూశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలిచిన డీఎ్‌స.రెడ్యానాయక్‌ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో 2004 నుంచి 2009 వరకు గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా పని చేశారు.

స్వరాష్ట్రంలో సత్యవతి, రాంచంద్రు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక రెండో శాసనసభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహించిన సత్యవతిరాథోడ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యాబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలిచిన జాటోతు రాంచంద్రునాయక్‌కు క్యాబినెట్‌ హోదాలో ప్రభుత్వ విప్‌గా అవకాశం లభించింది.

రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్యేలకు విప్‌గా నియమించగా అందులో డోర్నకల్‌ ప్రాతినిథ్య ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌కు అవకాశం దక్కింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు ముగ్గురు మంత్రులుగా పని చేయగా తాజాగా రాంచంద్రునాయక్‌కు ప్రభుత్వ విప్‌గా అవకాశం రావడంతో డోర్నకల్‌ నుంచి క్యాబినెట్‌ హోదాలో పదవి లభించిన వారిలో నాలుగో వ్యక్తిగా పేరుగడించారు.

Updated Date - Dec 16 , 2023 | 12:47 AM