రజకులకు అండగా ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-06-26T00:55:24+05:30 IST
తెలంగాణలో రజకులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
ఉచిత విద్యుత్, ధోబీ ఘాట్‌ల నిర్మాణం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, జూన్ 25: తెలంగాణలో రజకులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం రజక కుల సంఘాల నాయకులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. పట్టణంలో రూ.2 కోట్లతో ఆధునిక ధోబీ ఘాట్‌లు ఏర్పాటు చేస్తామని, అత్యాధునిక ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రజక సామాజిక వర్గానికి ఉచిత విద్యుత్‌తో పాటు పూర్తి స్థాయిలో ధోబీ ఘాట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రజకుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రత్యేక గురుకులాలు, విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చి ప్రోత్సహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రజకులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.