గాలిలో దీపాలు!
ABN , First Publish Date - 2023-10-03T00:33:56+05:30 IST
జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. యాజమాన్యాలు లాభాపేక్షతో ఖర్చు తగ్గించుకొని ఎక్కువ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో క్వారీల్లో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవలె కేసముద్రం, గూడూరు మండలాల సరిహద్దులోని అర్పనపల్లి, తీగలవేణి గ్రామాల మధ్యనున్న ఒక క్వారీలో అర్పనపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు బండరాళ్లు పడి మృతి చెందిన విషయం విధితమే.
అరచేతిలో క్వారీ కార్మికుల ప్రాణాలు
భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యాలు
మైనింగ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా బాంబు పేలుళ్లు
లాభాపేక్షతో ‘జాకీ’ల పేరిట శ్రమదోపిడీ
జిల్లాలో 1,759 ఎకరాల్లో క్వారీలు
కేసముద్రం, అక్టోబరు 2 : జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. యాజమాన్యాలు లాభాపేక్షతో ఖర్చు తగ్గించుకొని ఎక్కువ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో క్వారీల్లో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవలె కేసముద్రం, గూడూరు మండలాల సరిహద్దులోని అర్పనపల్లి, తీగలవేణి గ్రామాల మధ్యనున్న ఒక క్వారీలో అర్పనపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు బండరాళ్లు పడి మృతి చెందిన విషయం విధితమే. గతంలో అర్పనపల్లిలో క్వారీ గుంతలో జారిపడి ఒక కార్మికుడు మృతి చెందగా, రాజీవ్‌నగర్ తండాలో బండరాయిపైన పడి శేఖర్ అనే మృతి చెందాడు. ఇంటికన్నె క్వారీలో రాళ్లు, మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికులు, మరో క్వారీలో టిప్పర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. కార్మికులు పనిచేస్తున్న సమయంలో వారి ప్రాణాలకు యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శలొస్తున్నాయి. చాలా క్వారీల్లో కార్మికులు హెల్మెట్లు, బూట్లు, డస్ట్ మాస్క్‌లు, యూనిఫాంలు లేకుండానే పనులు నిర్వహిస్తున్నారు. జియాలజిస్ట్, నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సిన పనులు వారు లేకుండానే కొనసాగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. క్వారీలో ఎక్కడైనా బండరాయి, మట్టిపెళ్లలు కూలుతుందనే విషయాన్ని క్వారీలోని ఫోర్‌మెన్, మేట్‌లు ముందే గుర్తించి ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా చూపుతూ రిబ్బన్లు కట్టి కార్మికులను ఆ ప్రాంతంలోకి వెళ్లనీయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పలు క్వారీల్లో ఇలాంటివేమీ లేకుండా పనులు నిర్వహిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు.
జిల్లాలో 1,759 ఎకరాల్లో క్వారీలు
మహబూబాబాద్ జిల్లాలో వివిధ రకాల ఖనిజాలు ఉత్పత్తి అయ్యే క్వారీలు 1,759 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో చిన్నతరహా ఖనిజ పరిశ్రమైన 2 డోలమైట్ అండ్ బైరెటీస్, 1 డోలమైన్, 4 బైరెటీస్, 1 కార్డ్ ్జ, 168 బ్లాక్ గ్రానైట్, 2 కలర్ గ్రానైట్, 19 స్టోన్, మెటల్ క్వారీలు వెరసి 197 ఉన్నాయి. ఈ క్వారీ పరిశ్రమలన్నీ కేసముద్రం, డోర్నకల్, నెల్లికుదురు, కురవి, గూడూరు, మరిపెడ, తొర్రూరు, గార్ల, బయ్యారం మండలాల్లో ఏర్పాటై ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా బ్లాక్ గ్రానైట్ 27లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వలు, 600 లక్షల టన్నుల ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ అంచనా వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే నాణ్యమైన బ్లాక్ గ్రానైట్ లభించే క్వారీలు జిల్లాలో ఉండడం విశేషం.
పేలుడులో జాగ్రత్తలు..
క్వారీల్లో బండరాళ్లను పగులగొట్టేందుకు పేలుడు కార్యకలాపాల్లో పాల్గొనే సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహనతో శిక్షణ పొంది ఉండాలి. పేలుడు విధానాలు, భద్రతా నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు తెలిసి ఉండాలి. పేలుడు పదార్థాల రకం, బ్లాసింగ్ నమూనా, సమయాన్ని పేర్కొనే ప్లానింగ్ ఉండాలి. ఈ ప్లానింగ్‌ను అర్హత కలిగిన బ్లాస్టింగ్ ఇంజనీర్ తయారు చేయాలి. అనధికారిక సిబ్బందిని సురక్షితమైన దూరంలో ఉంచేందుకు పేలుడు జరిగిన ప్రదేశం చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేయాలి. పేలుడు ప్రాంతంలో అధీకృత సిబ్బందిని మాత్రమే అనుమతించాలి. పేలుడుకు ముందు సమీపంలోని కార్మికులను, ఇతరులను అప్రమత్తం చేయడానికి సైరన్‌లు, తగిన హెచ్చరికలు చేయాలి. ఆ హెచ్చరికలు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. పేలుడులో పాల్గొనే అన్ని విభాగాల్లోని సిబ్బంది మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. పేలుడు షెడ్యూల్‌పై ప్రతీ ఒక్కరికి సమాచారం, అవగాహన ఉండే విధంగా కమ్యూని కేషన్ పరికరాలను ఉపయోగించాలి. పేలుడుకు ముందు క్వారీలో అన్ని పరికరాలు, యంత్రాలు, భద్రతా చర్యలు సరిగ్గా ఉన్నాయని, సరిగా పని చేస్తున్నాయని నిర్ధారించుకునేం దుకు ప్రీ-బ్లాస్ట్ తనిఖీని నిర్వహిం చాలి. ఊహించని ఘటనలు ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రుల తరలింపు చేసేందుకు సరైన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రమాదం జరిగే అవకాశాలుంటే కార్మికులు తప్పించుకునే మార్గాలను ముందే చూసు కోవాలి. పేలుడు ద్వారా ఉత్పత్తి అయిన భూకంపాలను కొలవడానికి భూకంప పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. సమీపంలోని నిర్మాణాలకు నష్టం కలగకుండా ఉండేలా సహాయ పడుతుంది. పేలుడు ప్రాంతం నుంచి రాతి శకలాలు ఎగిరి పడకుండా(ఫై రాక్) బ్లాస్ట్ మ్యాట్, అడ్డంకులను ఉపయోగించాలి. పేలు డు తర్వాత సైట్ భద్రతను అంచనా వేసేందుకు, పేలని పదార్థాలు, ప్రమాదాల తనిఖీ చేసేందుకు ‘పోస్ట్ బ్లాస్ట్’ తనిఖీని నిర్వహించాలి. బ్లాస్టింగ్ ప్రభా వం గాలి, నీటి నాణ్యత దెబ్బతినకుండా, శబ్ధ కాలు ష్యం వంటివి ఏర్పడకుండా పర్యావరణ నిబంధన లకు అనుగుణంగా ఉండే విధంగా చూడాలి. బ్లాస్ట్ ప్లాన్లు, మానిటరింగ్ డేటా, ఘటనలకు సంబంధిం చిన సమాచారంతో కూడిన రికార్డులను నిర్వహించాలి.
కార్మిక చట్టాల ఉల్లంఘన..
గ్రానైట్ క్వారీల్లో కార్మిక చట్టాల ఉల్లంఘటన యథేచ్ఛగా సాగుతోందని కార్మిక సంఘాల నాయకుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నియామక పత్రం లేకుండా అసలు ఉద్యోగిగా గుర్తింపు ఇవ్వకుండా ‘మేస్త్రీ’ కింద ‘జాకీ’ల పేరుతో దినసరి కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఈ జాకీలకు ఎలాంటి వేతనాన్ని నేరుగా క్వారీ చెల్లించదు. జాకీలకు మేస్త్రీ ఏ రోజుకారోజు దినసరి కూలీ చెల్లిస్తూ ఉంటాడు. క్వారీలో నిర్వహించిన పని ఆధారంగా మేస్త్రీకి క్వారీ యాజమాన్యం చార్జీలు చెల్లిస్తుంది. ఇలాంటి కార్మికులు ప్రమాదాలకు గురై మృతి చెందితే వారికి ఎలాంటి బీమా పరిహారం అందే అవకాశం లేదు. ఇంత ప్రమాదభరితమైన చోట నిబంధనలకు విరుద్ధంగా జాకీలతో పనులు చేయించడం శోచనీయమని పలువురు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే జాకీ కార్మికుల్లో రిటైర్మైంట్ వయస్సు ఉన్నవారు సైతం పనిచేస్తుండడం గమనార్హం. క్వారీల్లో బ్లాసింగ్‌లో నిబంధనలను పాటించకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకొని కార్మికులు మృతి చెందుతున్నారని తెలుస్తోంది. క్వారీ పనికి ఇంటి నుంచి వెళ్లిన కార్మికుడు తిరిగి వచ్చేంత వరకు ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బ్లాస్టింగ్‌ను రాత్రిపూట చేయకూడదనే నిబంధనలున్నా పాటించడం లేదు. ఈ క్రమంలోనే క్వారీల్లో అధిక ప్రమాదాలు మూడో షిఫ్ట్‌లోని తెల్లవారుజామునే జరగడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రానైట్ క్వారీల్లో నిబంధనలను పాటించే విధంగా కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు.