వేలిముద్ర వేశారా?

ABN , First Publish Date - 2023-09-23T00:08:22+05:30 IST

బోగస్‌ రేషన్‌ కార్డులను ఏరివేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆహార భద్రత కార్డులకు ఈకేవైసీ (ఎలక్ర్టానిక్‌ నౌ యువర్‌ కస్టమర్‌) అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

వేలిముద్ర వేశారా?
బచ్చన్నపేట రేషన్‌ షాపులో ఈకేవైసీని నమోదు చేయించుకుంటున్న లబ్ధిదారులు

లేదంటే రేషన్‌ కార్డులో పేరు పోతుంది

బోగస్‌ కార్డుల ఏరివేతకు సర్కారు చర్యలు

కుటుంబసభ్యులందరూ ‘ఈకేవైసీ’ చేయించుకోవాలి

రేషన్‌షాపుల్లో కొనసాగుతున్న ప్రక్రియ

జిల్లాలో 1.61 లక్షల రేషన్‌ కార్డులు.. 4.86,615 మంది లబ్ధిదారులు

బోగస్‌ రేషన్‌ కార్డులను ఏరివేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆహార భద్రత కార్డులకు ఈకేవైసీ (ఎలక్ర్టానిక్‌ నౌ యువర్‌ కస్టమర్‌) అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్‌ షాపుల్లోని ఈ పాస్‌ మిషన్‌లలో సాఫ్ట్‌వేర్‌ను సైతం ఇప్పటికే అప్‌డేట్‌ చేసింది. దీంతో కార్డులోని సభ్యులందరూ విధిగా సమీప రేషన్‌ షాపులకు వెళ్లి వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా, దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని అధికారులు తెలిపారు.

జఫర్‌గడ్‌, సెప్టెంబరు 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రేషన్‌కార్డుల్లో నమోదై ఉన్న సభ్యుల పేర్ల ప్రకారమే నేటికీ రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిలో కొందరు చనిపోయారు. కుమార్తెలు వివాహాలు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. కుమారులు పెళ్లిళ్లు చేసుకుని ఉద్యోగం, ఉపాఽధి పేరిట ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినా చాలా వరకు వారి పేర్లు రేషన్‌ కార్డుల్లో అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్‌ను అరికట్టి, అనర్హులను తొలగించేందుకు లబ్ధిదారుల వేలిముద్రలతో అనుసంధానం చేస్తూ ఈకేవైసీని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్డుల్లోని కుటుంబ సభ్యులంతా సమీప రేషన్‌ షాపులకు వెళ్లి ఈ పాస్‌ యంత్రంలో వేలి ముద్రలు వేసి రేషన్‌కార్డుకు ఈకేవైసీని అనుసంధానించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దూరప్రాంతాల్లో (రాష్ట్ర పరిధిలో) ఉన్నవారు సైతం అక్కడి రేషన్‌షాపునకు వెళ్లి వేలిముద్రలు నమోదు చేసుకోవచ్చని చెబుతున్నారు. కాగా, ఇప్పటికిపుడు ఈకేవైసీ లేదనే కారణంతో బియ్యం పంపిణీ ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు.

జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ...

జిల్లాలో రేషన్‌ దుకాణాల్లో ఈకేవైసీ నమోదు ప్రక్రి య కొనసాగుతోంది. యంత్రంలో కార్డు నంబరు నమోదు చేయగానే కుటుంబ సభ్యులందరి పేర్లు కనిపిస్తాయి. ఈకేవైసీ నమోదు చేయని వారి పేర్లు ఎరుపు రంగులో దర్శనమిస్తాయి. అలాంటి వారు ఐరిష్‌ లేదా ఫింగర్‌ ప్రింట్‌ ఆప్షన్‌ ద్వారా తమ సమా చారాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈకేవైసీ సమాచారం నమోదు చేయించుకున్న వారి పేర్లు ఆకుపచ్చ రంగు లో కనిపిస్తాయి. కుటుంబసభ్యులందరూ ఒకేసారి వెళ్లి ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. లేదంటే వారి పేర్లను తొలగిస్తారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 1.61,238 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో 4.86,615 (యూనిట్లు) మంది కుటుంబ సభ్యులు నమోదై ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1,038.05 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. 12 మండలాల పరిధిలో మొత్తం 335 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి.

డీలర్లపై అదనపు భారం..

రేషన్‌కార్డుకు ఈకేవైసీ అనుసంధానం చేయడం రేషన్‌ డీలర్లకు తలనొప్పిగా తయారైంది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరి వేలిముద్రను సేకరించాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో షాపు పరిధిలో 300 నుంచి 500 వరకు రేషన్‌కార్డులు ఉన్నాయి. ఒక్కో కార్డులో ఒకరి నుంచి ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరందరి వేలిముద్రలు సేకరించాలంటే డీలర్లపై అదనపు భారం పడుతోంది. దీంతో కార్డు దారులకు తాము బియ్యం పంపిణీ చేయాలా.. లేక ఈకేవైసీ నమోదు చేయాలా.. ఈ రెండు పనులు ఏకకాలంలో ఎలా సాధ్యమంటూ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తమపై పనిభారం మోపకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

విధిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి..

- రోజారాణి, డీఎస్‌వో, జనగామ

రేషన్‌ కార్డులో పేరు ఉన్న ప్రతీ ఒక్కరు విధిగా ఈకేవైసీ సమాచారాన్ని డీలర్ల వద్ద నమోదు చేసుకోవాలి. వివాహాలు జరిగి అత్తారింటికి వెళ్లిన వారు, మృతి చెందిన వారి పేర్లను తొలగించి, కొత్తగా జన్మించిన పిల్లల పేర్లు నమోదు చేయడం, నమోదు కాని అర్హుల పేర్లను చేర్చి సమగ్ర వివరాలతో పారదర్శకంగా ఉండేలా రేషన్‌ కార్డులను జారీ చేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. గ్రామాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సమీప రేషన్‌ దుకాణాల్లో ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దీనికి చివరి గడువంటూ ఏమీ లేదు.

Updated Date - 2023-09-23T00:08:22+05:30 IST