బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2023-03-02T00:48:16+05:30 IST
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రోడ్‌షో సందర్భంగా భూపాలపల్లిలో మంగళవారం లొల్లి జరగ్గా తాజాగా టేకుమట్ల మండల కేంద్రంలో ఇరు పార్టీల కార్యకర్తలు బుధవారం బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
పలువురికి స్వల్పగాయాలు
లాఠీచార్జి చేసిన పోలీసులు ఠ టేకుమట్లలో ఉద్రిక్తత
టేకుమట్ల, మార్చి 1: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రోడ్‌షో సందర్భంగా భూపాలపల్లిలో మంగళవారం లొల్లి జరగ్గా తాజాగా టేకుమట్ల మండల కేంద్రంలో ఇరు పార్టీల కార్యకర్తలు బుధవారం బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై రాళ్లదాడితో పాటు ఎమ్మెల్యే గండ్రపై రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బండపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టేకుమట్ల మీదుగా వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు తప్పించి ఎమ్మెల్యే వాహనాన్ని పంపించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మఽధ్య తోపులాట జరిగింది. కర్రలతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘర్షణలో బీఆర్‌ఎస్ నాయకుడు, ఎంపీటీసీ సంగి రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్‌తో పాటు ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిట్యాల సీఐ వెంకట్, మొగుళ్లపల్లి ఎస్సై శ్రీధర్ అక్కడికి చేరుకున్నారు. అయినా పరిస్థితి చేయిదాటుతుండటంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణ సుమారు గంటపాటు సాగింది. దీంతో టేకుమట్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గాయపడిన తమ పార్టీల కార్యకర్తలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు.