నగరంలో ప్రగతి పండుగ

ABN , First Publish Date - 2023-10-06T01:06:34+05:30 IST

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం హనుమకొండ, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు హెలీకాప్టర్‌లో వస్తున్న కేటీఆర్‌.. సాయంత్రం 5.30 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హనుమకొండలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

నగరంలో ప్రగతి పండుగ

రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

బాలసముద్రం, ఖిలావరంగల్‌లో బహిరంగసభలు

లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాల పంపిణీ

చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌ నివాసంలో లంచ్‌

తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ నివాసంలో టీ బ్రేక్‌

ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనున్న టూర్‌

విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

గులాబీమయంగా మారిన నగరం

హనుమకొండ టౌన్‌/వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 5: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం హనుమకొండ, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు హెలీకాప్టర్‌లో వస్తున్న కేటీఆర్‌.. సాయంత్రం 5.30 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హనుమకొండలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ప్రధానంగా హనుమకొండలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యాలయం ఆవరణలో రూ.100 కోట్లతో నిర్మించనున్న ఐటీ టవర్‌, రూ.70 కోట్లతో హనుమకొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఆధునీకరణ, రూ.10 కోట్లతో ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్‌, రూ.7 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు కుడా గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వినయభాస్కర్‌ నివాసంలో లంచ్‌ చేస్తారు.

అనంతరం 2.15 గంటలకు పోతన సబ్‌ స్టేషన్‌ వద్ద నూతనంగా నిర్మాణమైన లాండ్రో మార్ట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు దూపకుంటలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవం చేస్తారు. 3.15 గంటలకు ఖిలావరంగల్‌లో ఇరిగేషన్‌ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3.30 గంటలకు ఖిలా వరంగల్‌ వాకింగ్‌ గ్రౌండ్‌లో లబ్ధిదారులకు పథకాల పంపిణీ, అనంతరం సంక్షేమ సభ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు వరంగల్‌ ఓ-సిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫీసర్లతో సమావేశమవుతారు. సాయంత్రం 5.30 గంటలకు మామునూరు ఎయిర్‌పోర్టుకు చేరుకొని హైదరాబాద్‌కు బయ లుదేరుతారు. కాగా, కేటీఆర్‌ సభలను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్‌, నన్నపునేని నరేందర్‌ భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అధికారులు సైతం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్‌ రాకను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కేంద్రాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే జంక్షన్‌లను ముస్తాబు చేశారు.

ఇదీ షెడ్యూల్‌

  • ఉదయం 8.45గంటలకు కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు ఆర్ట్స్‌ కళాశాల చేరుకుంటారు.

  • ఉదయం 9.45 గంటలకు హనుమకొండలో నూతనంగా నిర్మించిన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌స ప్రారంభోత్సవం... ఐటీ టవర్‌కు శంకుస్థాపన.. ‘కుడా’ అభివృద్ధి పనుల ప్రారంభం... లబ్దిదారులకు సంక్షేమ పథకాలు, ఆస్తుల పంపిణీ...

  • ఉదయం 10.10గంటలకు బంధం చెరువు వద్ద మురికినీటి శుద్ధి కేంద్రంతో పాటు బస్తీ దవాఖాన ప్రారంభిస్తారు.

  • ఉదయం 10.30 గంటలకు నిట్‌ వద్ద జంక్షన్‌ను ప్రారంభిస్తారు.

  • ఉదయం 10.45 గంటలకు మడికొండ ఐటీ పార్కులో క్వాడ్రంట్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభిస్తారు.

  • ఉదయం 11.30 గంటలకు బాలసముద్రంలోని ‘కుడా’ గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.

  • మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

  • మధ్యాహ్నం 1.20 గంటలకు అలంకార్‌ జంక్షన్‌ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 1.40 గంటలకు పోతన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌, ల్యాండ్రో మార్ట్‌, స్మార్ట్‌ లైబ్రరీని ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 1.50గంటలకు హనుమకొండ భద్రకాళి ఆర్చ్‌ జంక్షన్‌ వద్ద భద్రకాళి బండ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ప్లానెటో రియం,మున్నూరుకాపు సంఘం భవననిర్మాణానికి శంకుస్థాపనలు.

  • మధ్యాహ్నం 2గంటలకు హనుమకొండలో పోలీస్‌ భరోసా కేంద్రం ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 2.15 గంటలకు పద్మాక్షి రోడ్‌లో రజక భవన్‌ ప్రారంభిస్తారు. ల్యాండ్రోమార్ట్‌కు శంకుస్థాపన చేస్తారు.

  • మధ్యాహ్నం 2.30 గంటలకు హనుమకొండలో చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌ నివాసంలో మధ్యాహ్న భోజనం.

  • మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌ దూపకుంటలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 3.15 గంటలకు ఖిలావరంగల్‌లో వరద నివారణ పనులు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

  • మధ్యాహ్నం 3.30 గంటలకు ఖిలా వరంగల్‌లో బహిరంగ సభ.. లబ్దిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ.

  • సాయంత్రం 4.45 గంటలకు ఓ-సిటీలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శిస్తారు.

  • సాయంత్రం 5 గంటలకు వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారుల సమావేశంలో పాల్గొంటారు.

  • సాయంత్రం 5.30 గంటలకు మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు వెళతారు.

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హనుమకొండ క్రైం, అక్టోబరు 5: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం నగరంలో పర్యటించనున్న సందర్భంగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు. వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు.

  • ములుగు, భూపాలపల్లి నుంచి వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు ఆరెపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు, కరుణాపురం, మడికొండ, కడిపికొండ మీదుగా వెళ్లాలి.

  • భూపాలపల్లి, పరకాల నుంచి నర్సంపేట వైపు వెళ్లాల్సిన వాహనాలు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్‌పీరీలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాలి.

  • నగరానికి వచ్చే భారీ వాహనాలు నగరం బయటనే నిలిపి ఉంచాలి. మంత్రి పర్యటన ముగిసేవరకు ఎలాంటి భారీ వాహనాలను లోపలికి అనుమతించరు.

  • ములుగు, పరకాల నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్‌, సీపీవో జంక్షన్‌, అంబేద్కర్‌ సెంటర్‌, శ్రీదేవి మాల్‌ మీదుగా బస్‌స్టేషన్‌కు వెళ్లాలి.

  • హనుమకొండ బస్‌స్టేషన్‌ నుంచి కరీంనగర్‌, ములుగు, పరకాల, భూపాలపల్లి వైపు వెళ్లాల్సిన వాహనాలు శ్రీదేవి ఏషియన్‌ మాల్‌, అంబేద్కర్‌ సెంటర్‌, సీపీవో జంక్షన్‌, కేయూ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి. హనుమకొండ బస్‌స్టేషన్‌ నుంచి నర్సంపేట, భద్రాద్రి కొత్తగూడెం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లాల్సిన వాహనాలు వయా బాలసముద్రం, అదాలత్‌, హంటర్‌రోడ్డు మీదుగావెళ్లాలి.

  • వరంగల్‌ బస్‌స్టేషన్‌ నుంచి హనుమకొండ వైపు వచ్చే వాహనాలు చింతల్‌ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్‌పంపు సెంటర్‌, ఉర్సుగుట్ట, అదాలత్‌, బాలసముద్రం రోడ్డు గుండా హనుమకొండకు చేరుకోవాలి.

Updated Date - 2023-10-06T01:06:34+05:30 IST