Share News

జీపీ ఎన్నికలకు కసరత్తు

ABN , First Publish Date - 2023-12-10T23:12:34+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక.. లోకల్‌ ఫైట్‌ మొదలు కానుంది. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాలకవర్గ పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుంది.

జీపీ ఎన్నికలకు కసరత్తు

ఫిబ్రవరి 1తో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం

ఈనెల 30లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు

జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు

మొత్తం ఆరు లక్షలకు పైగా ఓటర్లు

సమాచారాన్ని సేకరిస్తున్న అధికారులు

తొర్రూరు, డిసెంబరు10 : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక.. లోకల్‌ ఫైట్‌ మొదలు కానుంది. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాలకవర్గ పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుంది. నూతనంగా ఎన్నికైన రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు పచ్చజెండా ఊపడమే తరువాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామ పంచా యతీల్లో కొత్తపాలకవర్గ కొలువుదీరుతుంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రస్తుతం అమలులో ఉన్న సర్పంచ్‌, వార్డులు, రిజర్వేషన్లు, ప్రొసీడింగ్‌లు, పోలింగ్‌ అధికారుల నియామకం కోసం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

జిల్లాలో 18 మండలాలు..

మహబూబాబాద్‌ జిల్లాలో పూర్వం 16 మండలాలు ఉండగా ఇటీవల ఇనుగుర్తి, సీరోలు నూతన మండలాలుగా ఏర్పడ్డాయి. మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వివిధ సాంకేతిక కారణాలతో రెండు పంచాయతీలకు రిజర్వేషన్ల కోసం కొందరు స్థానికులు కోర్టును ఆశ్రయించారు. వాటిలో కురవి మండలం మోదుగుల గూడెం, నెల్లికుదురు మండలం నైనాల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలోని బయ్యారం మండలంలో 29 గ్రామపంచాయతీలు, గార్ల 20, కొత్తగూడ 24, గంగారం 12, తొర్రూరు 29, నర్సింహులపేట 22, డోర్నకల్‌ 30, దంతాలపల్లి 17, పెద్దవంగర 20, కురవి 48, చిన్నగూడూరు 10, మహబూబాబాద్‌ 41, కేసముద్రం 40, మరిపెడ 44, గూడూరు 39, నెల్లికుదురు మండలాల్లో 36 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

రిజర్వేషన్లపై ఆసక్తి

2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరా లను కార్యదర్శుల ద్వారా రాష్ట్రఎన్నికల సంఘం తీసుకున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం తీసుకువచ్చిన 2018 గ్రామపంచాయతీ చట్టంప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా లేక నూతన ప్రభుత్వం కొత్తచట్టం తీసుకువస్తుందా అన్నది తేలాల్సి ఉంది. 2018 పీఆర్‌ చట్టం ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్‌ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 461 గ్రామ పంచాతీలకు గాను ఎస్టీ రిజర్వేషన్‌ 275 ఉండగా వాటిలో 137 మహిళలు, 138 జనరల్‌, ఎస్సీ 42 ఉండగా 21 మహిళలు, 21 జనరల్‌, బీసీ 22 ఉండగా 11 మహిళలు, 11 బీసీ జనరల్‌, జనరల్‌ స్థానాలు 122 ఉండగా వాటిలో 61 మహిళలు, 61 జనరల్‌కు ఉన్నా యి. ప్రస్తుత నూతన ప్రభుత్వం కొత్తచట్టాన్ని తీసుకువస్తే పంచాయతీల రిజర్వేషన్‌ల తో పాటు వార్డుల రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. జిల్లాలో సుమారు 6 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు.

సిబ్బంది విధులు..

ఎన్నికల నిర్వహణ మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణకు రెండు విడతల కోసం మొదట సిబ్బందిని నియమించాలి. మొదటి దశలో పాల్గొన్న సిబ్బంది 3వ విడత పాల్గొంటారు. ముసాయిదా రూపకల్పనలో భాగంగా ప్రొసిడింగ్‌ అధికారులు పోలింగ్‌ అధికారులను నియమించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు గెజిటెడ్‌ అధికారులను ప్రొసీడింగ్‌ అధికారులుగా నియమించాలి. వారు పూర్తిస్థాయిలో లేకపోతే స్కూల్‌ అసిస్టెంట్‌లను నియమించాల్సి ఉంటుంది. ప్రతీ 200 మంది ఓటర్లకు ఒక ప్రొసీడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారిని నియమించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో 20 శాతం సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచుకోవాలి. ఇటీవల నిర్వహించిన శాశనసభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన వారిని కూడా ఈ ఎన్నికల్లో నియమించుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లు, ఎయిడెడ్‌ పాఠశాలల ఉద్యోగులను పోలింగ్‌ సిబ్బం దిగా నియమించుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ సూచించింది. గ్రామ పంచా యతీల్లో ఒక్కో వార్డుకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వార్డులో 650 మంది ఓటర్లు ఉంటారు. అదనంగా ఉంటే మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2023-12-10T23:12:35+05:30 IST