డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఎందుకివ్వరు!?

ABN , First Publish Date - 2023-01-31T23:56:40+05:30 IST

రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ప్రశ్నిం చారు. హనుమకొండ బాలసముద్రం అంబేద్కర్‌కాలనీలో గల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పేదప్రజలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నిరసన చేపట్టేందుకు సిద్ధం కాగా, సుబేదారి పోలీసులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అంబేద్కర్‌కాలనీలోని గుడిసెల్లో ఉన్న ఆకునూరి మురళి, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్‌లను అరెస్టు చేశారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఎందుకివ్వరు!?
సుబేదారి పోలీ్‌సస్టేషన్‌లో మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, పృథ్వీరాజ్‌

బాలసముద్రం, న్యూశాయంపేటలో వందలాది ఇళ్లు వృథా

ఎమ్మెల్యే వినయభాస్కర్‌ తీరు దుర్మార్గంగా ఉంది

మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి విమర్శ

అరెస్టు చేసి పూచీకత్తుపై వదిలేసిన సుబేదారి పోలీసులు

నయీంనగర్‌ (హనుమకొండ), జనవరి 31: రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ప్రశ్నిం చారు. హనుమకొండ బాలసముద్రం అంబేద్కర్‌కాలనీలో గల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పేదప్రజలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నిరసన చేపట్టేందుకు సిద్ధం కాగా, సుబేదారి పోలీసులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అంబేద్కర్‌కాలనీలోని గుడిసెల్లో ఉన్న ఆకునూరి మురళి, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్‌లను అరెస్టు చేశారు. అనంతరం సుబేదారి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సొంత పూచీకత్తుపైన విడుదలైన ఆకునూరి మురళి సుబేదారి పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.

తనను పోలీసులు బందిపోటులా, రివార్డు ఉన్న నక్సలైట్‌లా తెల్లవారుజామున 3.30గంటలకు అరెస్టు చేసి సుబేదారి పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చారని మురళి తెలిపారు. బాలసముద్రంలో అంబేద్కర్‌కాలనీ, న్యూశాయంపేటలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఐదేళ్లు పూర్తికావొస్తున్నా లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్‌కాలనీలో ప్రస్తుతం దాదాపు 300 కుటుంబాలు మురికికూపంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది మురికికూపంలో ఉండడానికా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌పై మొద ట ఫిర్యాదు ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ అందరి ముందు చాలా బాగా మాట్లాడతాడు కానీ.. అతడి లోపల చాలా దుర్మార్గత్వం ఉందని ముర ళి విమర్శించారు. ప్రభుత్వ ధనంతో 540 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టి, ఒక్కొక్క ఫ్లాట్‌ రూ.3 నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారని పేదప్రజలు తనకు చెప్పారని ఆయన తెలిపారు.

కలెక్టర్లకు బుర్ర లేదని, ఎమ్మెల్యేలు చెప్పినట్టు వింటున్నారని మురళి ధ్వజమెత్తారు. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు కాదని.. ఎమ్మెల్యేలు కేవలం పాలసీ మేకర్‌లు అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు భయంకరమైన అవినీతి చేస్తున్నారని, అసలైన లబ్ధిదారులకు ఫ్లాట్లను ఇవ్వకుండా వాటిని అమ్ముకోవడం, తమ వర్గానికి చెందిన వారికి ఇవ్వడం లాంటి పనులు చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షలు ఇళ్లు కావాలని, ఆ ఇళ్లను 8 యేళ్లలో పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కానీ 2,50,000 ఇళ్లు మంజూరైనవని, వాటిలో 1,40,000 ఇళ్లు మాత్రమే కట్టారని వాటిలో 40,000 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు అందించారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి మళ్లించి వాటిని పరిష్కారదిశగా ప్రయత్నాలు చేస్తానని మురళి తెలిపారు. కాగా, ఆకునూరి మురళిపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ మహ్మద్‌ అబ్దూల్‌ షూకూర్‌ తెలిపారు.

Updated Date - 2023-01-31T23:56:41+05:30 IST