అర్హులందరికీ పోడు పట్టాలు

ABN , First Publish Date - 2023-01-31T00:19:24+05:30 IST

అర్హులైన వారందరికీ ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు.

అర్హులందరికీ పోడు పట్టాలు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ శశాంక, అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా 12.81 లక్షల మందికి కంటి పరీక్షలు

పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ

వీసీలో మంత్రులు సత్యవతిరాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి

మహబూబాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరికీ ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కంటి వెలుగు, మన ఊరు-మనబడి, పోడు భూములు, పామాయిల్‌, టీచర్ల బదిలీలు, జీవో నెంబర్‌ 58, 59లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ... పోడు భూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వంద శాతం సర్వే, గ్రామసభలు పూర్తి చేశామని చెప్పారు. ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, దీనికి అవసరమైన చర్యలు అధికారులు పూర్తి చేయాలని సూచించారు. అడవులను సంరక్షిస్తూనే చట్టానికి లోబడి సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాల వారీగా మరోమారు సమీక్షించి అర్హులైన ప్రతీ ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పారు.

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... పోడు భూముల పట్టాల కోసం చర్చలు జరిపి సబ్‌కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. పట్టాల పంపిణీ అనంతరం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ అర్హులందరికీ పోడు పట్టాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోడు భూముల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. కంటి వెలుగు శిబిరాల ద్వారా ఇప్పటి వరకు 12,81,774 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2.94 లక్షల మందికి రీడింగ్‌ కళ్ల అద్దాలను పంపిణీ చేశామన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1న మన ఊరు-మన బడి కింద పూర్తి చేసిన పాఠశాలలను పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు.

కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ... టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని చెప్పారు. మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి కేసులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 38 ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత కలెక్టరేట్‌ ద్వారా విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మానుకోట నుంచి అదనపు కలెక్టర్‌లు అభిలాష అభినవ్‌, ఎం.డేవిడ్‌, ట్రైనీ కలెక్టర్‌ పింకేశ్వర్‌, డీఎఫ్‌వో రవికిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T00:19:28+05:30 IST