ఎలక్షన్ సెంటర్ కలెక్టరేట్
ABN , First Publish Date - 2023-11-06T23:52:43+05:30 IST
శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో నాయకులు ప్రచారంపై దృష్టి సారించారు. ఈ సమయంలో పౌరులతోపాటు నాయకులకు పలు సందేహాలు వస్తుంటాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అతిక్రమణలపై ఫిర్యాదు చేసేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. సాధారణ ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టింది.
జిల్లా పాలనా కార్యాలయం నుంచే పర్యవేక్షణ
కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు
24 గంటలు అందుబాటులో సిబ్బంది
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
హనుమకొండ రూరల్, నవంబరు 6: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో నాయకులు ప్రచారంపై దృష్టి సారించారు. ఈ సమయంలో పౌరులతోపాటు నాయకులకు పలు సందేహాలు వస్తుంటాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అతిక్రమణలపై ఫిర్యాదు చేసేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. సాధారణ ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టింది. ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. లేదో తెలుసుకోవాలన్నా, సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసినా, ఓట్లు దండుకోవడానికి డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నా, ప్రచార సమయంలో గొడవలు తలెత్తే అవకాశం ఉన్నా టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తారు. అక్కడి పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటారు. ఎలాంటి ఫిర్యాదులైనా టోల్ ఫ్రీ నంబరు 1950కు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు.
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అధికారులు టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులోకి తెచ్చి సమస్య లు పరిష్కరిస్తున్నారు. ఎక్కువ శాతం ఓటర్ల జాబితాకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని స్వీకరించిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్నిపార్టీల అభ్యర్థులు ఖరారు చేసి నామినేషన్లు వేసిన తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఓటర్లను ప్రలోభపెట్టే రాజకీయ పార్టీల నాయకులు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం షరా మామూలే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణ, మద్యం, నగదుతో పాటు వివిధ రకాల బహుమతులు, కానుకలు అందించే అవకాశాలు ఉంటాయి. దీంతో ఫిర్యాదులు సైతం పెరుగుతాయి. ప్రచార సమయంలో గొడవలు, దాడులు చోటు చేసుకునే సందర్భాల్లో ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో టోల్ ఫ్రీ నంబరు 1950కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు సమాచారం అందజేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోని మానిటరింగ్ సెల్‌కు చేరుతుంది. అక్కడ నుంచి ఎంసీసీ, ఫ్లయిం గ్ స్క్వాడ్‌లకు చేరుతుంది. వారు 15 నిమిషాల్లో క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఆ నివేదిక 30 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారికి వెళ్లేలా ఏర్పా టు చేశారు. సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని అధికారులు తెలుపుతున్నారు. లైవ్ ఫొటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్‌లోడ్ చేసే సమయంలో జీపీఎస్ ఆన్‌లో ఉంచడం వల్ల జియోగ్రాపిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమెటిగ్గా లొకేషన్ నమోదు అవుతుంది. అక్రమంగా మద్యం, డబ్బులు, బహుమతుల పంపిణీ, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన లైవ్ ఫొటోలు, వీడియోలతో సి- విజిల్ యాప్ ద్వారా పంపవచ్చు. సి-విజిల్ యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సి-విజిల్ యాప్‌కు ఇప్పటి వరకు మొత్తం 51ఫిర్యాదులు రాగా, ఇందులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 36, పరకాలలో 15 ఉన్నాయి.
మీడియా సెంటర్ ఏర్పాటు
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు కలెక్టరేట్‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో లెక్కించడం జరుగుతుంది. వార్తా పత్రికలు, ఈ పేపర్‌లు, టెలివిజన్ చానల్స్, స్థానిక కేబుల్ నెట్‌వర్క్స్, సోషల్ మీడియా, ఎస్‌ఎంఎ్‌సలు ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో మీడియా పాత్ర కీలకం కావడంతో మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు.
24 గంటలు అందుబాటులో..
ఎన్నికల సమయంలో ఫిర్యాదులను స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు షిప్టుల వారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ సమయంలోనైనా ఫిర్యాదు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 1800 425 1816కు 26 ఫిర్యాదులు, అలాగే ఓటరు హెల్ప్‌లైన్ నంబరు 1950కు 326 ఫిర్యాదులు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చిన ప్రతీ ఫిర్యాదును నమోదు చేస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు, ఫోన్ నంబరు, అడ్ర్‌సతో పాటు వారికి వచ్చిన సందేహం, ఫిర్యాదును నమోదు చేసుకుంటారు.