ముందస్తు అలర్ట్‌..

ABN , First Publish Date - 2023-01-06T00:42:14+05:30 IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది.. ఈ టెక్నాలజీని ప్రజలు వారికి అవసరమైన విధంగా ఉపయోగించుకుంటున్నారు.. కొందరు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వినియోగించుకుంటున్నారు. పోలీసుల తనిఖీల నుంచి బారిన పడకుండా ఉండటానికి వాహనదారులు కొత్తదారులు ఎంచుకుంటున్నారు.

ముందస్తు అలర్ట్‌..

పోలీసు తనిఖీలకు వాట్సప్‌ గ్రూపులతో చెక్‌

ఫలనా చోట చెకింగ్‌లు జరుగుతున్నాయంటూ సందేశాలు

వాహనదారులు చలాన్ల బెడద నుంచి తప్పించుకొవడానికే..!

వరంగల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది.. ఈ టెక్నాలజీని ప్రజలు వారికి అవసరమైన విధంగా ఉపయోగించుకుంటున్నారు.. కొందరు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వినియోగించుకుంటున్నారు. పోలీసుల తనిఖీల నుంచి బారిన పడకుండా ఉండటానికి వాహనదారులు కొత్తదారులు ఎంచుకుంటున్నారు. రోడ్డు మీదకు వాహనాన్ని తీసిందే తడువుగా.. హెల్మెట్‌ లేకపోయినా ఫొటో, నంబర్‌ ప్లేట్‌ లేకుంటే సీజ్‌, త్రిపుల్‌ రైడింగ్‌, రాంగ్‌రూట్‌, ఇలా ఏ ఒక్క అవకాశం దొరికినా ఫొటోగ్రాఫర్లుగా మారిన పోలీసుల నుంచి ఫైన్‌లు కట్టాలంటూ మెసేజ్‌లు తప్పని పరిస్థితి వరంగల్‌ నగరంలో ఇప్పుడు చోటు చేసుకుంటోంది.

ప్రతీ వాహనదారుడు ఏదో ఓ రూపంలో చలాన్ల బారిన పడక తప్పని స్థితి నగరంలో నెలకొని ఉండటంతో, దానిబారి నుంచి తప్పించుకునేందుకు ఓ వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతీ కాలనీలో ఒక గ్రూపు చొప్పున ఇప్పటికే దాదాపు 12 వాట్సప్‌ కమ్యూనిటీ గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం చూస్తేంటే పోలీసుల చలాన్ల పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక్కో వాట్సప్‌ కమ్యూనిటీ గ్రూపులో సుమారు 1,025 మంది వరకు వాహనదారులున్నారు. ఈ గ్రూపులో ఉన్నవాళ్లు తాను ప్రయాణిస్తున్న దారిలో ఎక్కడైనా పోలీసులు కెమెరాలతో ఉన్నా, తనిఖీలు చేస్తున్నా తక్షణమే ఈ గ్రూపులో ఫలనా ప్రాంతంలో చెక్‌ చేస్తున్నారంటూ వీడియోలను, ఫొటోలను పోస్టుచేస్తూ.. వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. పోలీసులు ప్రధాన రహదారిపైనా ఉంటే దానికి అనుసంధానంగా ఉండే కాలనీల నుంచి వెళ్లవచ్చంటూ సలహాలను, సందేశాలను పంపిస్తున్నారు. ఒక్క గ్రూపుగా ఏర్పడి, వారం రోజుల్లోనే దాదాపు 12 కమ్యూనిటీ గ్రూపులను ఏర్పాటు చేసేస్థాయికి చేరుకున్నారు.

వరంగల్‌ నగరం విస్తరించిన నేపథ్యంలో ప్రధాన రహదారులపైనే కాకుండా అంతర్గత రహదారులపై కూడా పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరవైయ్యాయి. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తరుచు వాహనాల తనిఖీలు చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికే వాహనదారులు ఇలా అడ్డదారులను ఎంచుకోవడం విస్మయం కలిగిస్తోంది.

కెమెరాలతో ఖాకీలు..

వరంగల్‌ నగరం మహానగరంగా మారిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగాయి. దానికి తోడు రహదారులపై తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రాణాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగింది. దీన్ని అరికట్టేందుకు పోలీసులు రోజూ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పని చేస్తున్నారు. కొందరు బాధ్యతతో ప్రయాణిస్తుండగా, చాలా వరకు ట్రాఫిక్‌ రూల్స్‌ విరుద్ధంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసుల సంఖ్య పరిమితం కావడంతో వారికి అనుబంధంగా లాఅండ్‌ఆర్డర్‌, ఆర్ముడ్‌ రిజర్వు బలగాలతో చలాన్ల వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆర్ముడ్‌ రిజర్వు విభాగంలోని ఆర్‌ఎస్సైలను, ఆర్‌ఐలతో పాటు గా కానిస్టేబుళ్లను ట్రాఫిక్‌ విధులకు కాకుండా కేవలం చలాన్ల వేయడానికి అఽధికారులు విధులను అప్పగించారు.

రోజుకో వంద చలాన్లు..

వరంగల్‌ నగరంలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పరిధిలో ఉండి, కెమెరాలతో వంద చొప్పున ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించే వారి వాహనాల ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన విధించినట్టు తెలిసింది. బీట్‌లో పనిచేసే ప్రతీ ఖాకీ కెమెరాతో ఫొటోలు క్లిక్‌ మనిపించడమే పనిగా పెట్టుకున్నారు. ట్రాఫిక్‌ పాయింట్‌ దగ్గర ట్రాఫిక్‌ క్లియరెన్సు చేయడం పక్కన పెట్టి తమ టార్గెట్‌ను వేగంగా పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. రాంగ్‌రూట్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, నెంబరు లేకుండా ఉన్న వాహనాలను సీజ్‌ చేయడం లాంటి పనులకే మొదటి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

Updated Date - 2023-01-06T00:42:15+05:30 IST