నెరవేరిన కల

ABN , First Publish Date - 2023-09-23T22:49:30+05:30 IST

మల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. మండలంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నెరవేరిన కల
మల్లంపల్లి వ్యూ

మండలంగా మల్లంపల్లి

ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

అభ్యంతరాలకు 15 రోజుల గడువు విధింపు

మండల ఏర్పాటు ఇక లాంఛనమే...

హర్షం వ్యక్తంచేసిన మంత్రి, రెడ్‌కో చైర్మన్‌

ములుగు, సెప్టెంబరు 23: మల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. మండలంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ములుగు మండలం లోని మల్లంపల్లి, రాంచంద్రాపురం, హన్మకొండ జిల్లా కాట్రపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 14 గ్రామపం చాయతీలతో కలిపి ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 15రోజుల గడువు విధిస్తూ ఉత్తర్వులో పేర్కొంది. దీంతో మల్లం పల్లి మండల ఏర్పాటు ఇక లాంఛనమే అయింది. దీంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మల్లంపల్లి ఏర్పాటు ఆకాంక్ష ఇప్పటిది కాదు. మొద టి విడతలో జిల్లాల పునర్విభజన జరిగినప్పటి నుంచీ స్థానికులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ములుగులో 2018లో జరిగిన ఎన్నికల సభలో సీఎం కేసీఆర్‌ ములుగు జిల్లాతోపాటు మల్లంపల్లి మండల ప్రస్తావ న చేశారు. ఆమరుసటి ఏడాది 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లాగా ఆవిర్భవించింది. కానీ మల్లంపల్లి మండలం మాత్రం ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం ఉధృ తమైంది. ఇదే గ్రామానికి చెందిన దివంగత జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ శతవిధాలా ప్రయత్నించారు. మండలాన్ని సాధించుకోకుండానే హఠాన్మరణం చెం దారు. ఈ క్రమంలో జగదీశ్‌పై సానుభూతితోనైనా మండలం వస్తుందని సర్వత్రా భావించారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల జేఏసీని ఏర్పాటుచేసి మలి దశ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎట్టకేలకు దిగివచ్చిన సర్కారు మండల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ కసరత్తు మొదలుపెట్టింది.

14 పంచాయతీలతో..

మల్లంపల్లి మండలంగా ఏర్పాటైతే ములుగు జిల్లాలో మండలాల సంఖ్య పదికి చేరుతుంది. ములుగు మండల పరిధిలోని మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని మల్లంపల్లి, రామచంద్రాపురం, శ్రీనగర్‌, భూపాల్‌నగర్‌, శివతండా, మహ్మద్‌గౌస్‌పల్లి, దేవనగర్‌, ముద్దునూరు తండా, గుర్తూరు తండా, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి రెవెన్యూ పరిధిలోని కాట్రపల్లి, నూర్జహాన్‌పల్లి, సాదనపల్లి, రాజుపల్లి గ్రామపంచాయతీలు మల్లంపల్లిలో అంతర్భాగంగా ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా మొత్తం 20,986 మంది జనాభా ఉంది.

సర్వత్రా హర్షాతిరేకాలు

మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌ జారీ కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌, రెడ్‌కో చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తమ హర్షం వ్యక్తం చేశారు.మల్లంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత ్త మండలాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. మొన్న జిల్లా.. నిన్న మునిసిపాలిటీ, నేడు మండలం.. ములుగు ప్రాంతంపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇవే సాక్ష్యాలు అని సతీష్‌రెడ్డి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్లంపల్లి ప్రజలు కృతజ్ఞత చూపాలని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మిన్నంటిన సంబరాలు..

నోటిఫికేషన్‌ జారీతో మల్లంపల్లిలో సంబరాలు మిన్నంటాయి. శనివారం రాత్రి బాణసంచా కాల్చి, మిఠాయి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, సర్పంచ్‌ చంద కుమార్‌, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌, జేఏసీ నాయకు లు పాల్గొన్నారు. మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌, సహకరించిన మంత్రులకు జడ్పీ చైర్‌పర్సన్‌ నాగజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.

పోరాట ఫలితమే : ఎమ్మెల్యే సీతక్క

ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగానే మల్లంపల్లి మండ లంగా ఏర్పాటైంది. చిరకాల స్వప్నం నెరవేరుతున్నందుకు మల్లంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు. జనం ఆకాంక్షను నెరవేర్చేందుకు మండల సాధన కోసం నావంతుగా అసెంబ్లీ వేదికగా ఉద్యమించాను. సీఎం, మంత్రులు, అధికారులకు అనేక పర్యాయాలు వినతిపత్రాలు ఇచ్చాను. ‘పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్లు తప్ప..’ అని మరోసారి నిరూపణైంది.

Updated Date - 2023-09-23T22:49:30+05:30 IST