వై‘విద్య’ం!

ABN , First Publish Date - 2023-01-24T23:18:47+05:30 IST

పాఠశాలల్లో సత్ఫలితాలు ఇస్తున్న వినూత్న బోధన బేసిక్‌ పరిజ్ఞానంపై ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ భూపాలపల్లి జిల్లాలో 363 పాఠశాలలు.. 12,151 మంది విద్యార్థులు

వై‘విద్య’ం!

భూపాలపల్లిటౌన్‌, జనవరి 24: ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో సామర్థ్యం, నైపుణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం భూపాలపల్లి జిల్లాలో సత్ఫలితాలు ఇస్తోంది. వినూత్న బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులను సర్కారు తీర్చిదిద్దుతోంది. కరోనా కాలంలో రెండేళ్లు చదువులో పూర్తిగా వెనుకబాటుకు గురైన నేపథ్యంలో వారికి కొంగొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం- ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా తొలిమెట్టు పేరుతో వివిధ బోధనా పద్ధతులను అవలంబిస్తోంది. ఇది 2022 ఆగస్టు 15న ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం 35శాతం వరకు విద్యలో పురోగతి సాధించినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏమీ రాని స్థాయి నుంచి చదవడం, రాయడం, లెక్కించడం తదితర మౌలిక సౌమర్థ్యాలను విద్యార్థులతు సాధించారని అంటున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇది విద్యా సామర్థ్యాలను పెంచేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదంటున్నారు.

363 పాఠశాలలు..12,151 మంది విద్యార్థులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 363 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 12,151 మంది విద్యా ర్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి విద్యాబోధన చేయడానికి ఎస్‌జీటీలు 730 మంది, పం డిట్లు 20 మంది ఉన్నారు. వీరంతా ఆయా పాఠశాలల్లో తయారు చేసిన ప్రాజెక్టులతో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విద్యాబోధన చేస్తున్నారు. అంతేకా దు.. ఒక్కో మండలానికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమించారు. అలాగే 28 క్లస్టర్లకు కూడా నోడల్‌ అధి కారులను నియమించారు. వీరితో పాటు కలెక్టరుతోపాటు అదనపు కలెక్టర్‌, సెక్టోరియల్‌ అధికారులు, విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు విజయవంతం దిశగా ముందుకు సాగుతోంది.

నెలనెలా సమీక్ష

తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు, అధికారులు ప్రతినెలా విద్యార్థుల్లో వస్తున్న మార్పులను గురించి సమీక్షి స్తున్నారు. ఒక పిరియడ్‌లో చెప్పిన పాఠం ఎంతమంది విద్యార్థులకు అర్థమైందో తెలుసుకోవడం, అనంతరం అర్ధం కాని వారికి మళ్లీ చెప్పడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇలా పూర్తిగా వెనుకబడిన విద్యా ర్థుల సామర్థ్యాలను సైతం పెంచుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు గతం కంటే ఇప్పుడు ఎంత మెరుగుపడ్డారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఉపా ధ్యాయులు నోడల్‌ అధికారులకు రిపోర్టు చేస్తున్నారు. వారు విద్యాశాఖ అధికారి (డీఈవో)కి నివేదిస్తున్నారు. ఆయన ద్వారా కలెక్టర్‌కు నివేదికలు వెళ్తున్నాయి. అంతేకాదు.. ఉపాధ్యాయుల బోధ నను పరిశీలించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నారు. టాంజరిన్‌ యాప్‌ను, విద్యార్థుల ప్రగతిని పరిశీలించడానికి స్టూడెంట్‌ లెర్నింగ్‌ ట్రాకింగ్‌ యాప్‌ను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు గుణకారం, భాగాహారాల్లో కొంత వెనుకబడుతున్నా కూడికలు, తీసివేతలలో ముందుకు వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

గ్రేడ్లుగా విభజించి..

విద్యార్థుల సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు గ్రేడింగ్‌ చేస్తున్నారు. ఏ, బీ, సీలుగా విభజించి వారి నైపుణ్యాలను ఆధారంగా విద్యాబోధన చేస్తున్నారు. గ్రేడ్‌-ఏ లో ఉన్న విద్యార్థులు చెప్పిన వెంటనే అర్థం చేసుకుని అనర్గళంగా చదువుతుండగా గ్రేడ్‌-బీ కాస్త వెనుకబడి ఉన్నారు. గ్రేడ్‌-సీ విద్యార్థులు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వీరిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దశల వారీగా కూర్చోబెట్టి విద్యాబోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమేణా పురోగతి వస్తోందని వారు చెబుతున్నారు.

ఫలితాలు ఇలా..

తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థులు 0 శాతం పరిజ్ఞానం నుంచి 35 శాతం వరకు పురోగతి సాధించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతు న్నారు. తెలుగులో చదవడం 33.3 శాతం, ధారళంగా చదవడం 23.4 శాతం, రాయడం 16.4 శాతం, ఆంగ్లంలో చదవడం 20 శాతం, ధారళంగా చదవడం 16 శాతం, రాయడం 13.8 శాతం గణితంలో 24.2 శాతం తీసివేతలు, 11.2 శాతం గుణకారం, 6.2 శాతం భాగాహారం పురోగతి సాధించినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కాలంలో కంటే ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి మెరుగుపడిందని అంటున్నారు.

వైఫల్యాలు ఇవే..

తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా ఇంకా 30శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. అంతేకాదు.. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు బడికి దూరమవు తున్న సందర్భాలూ ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం పూర్తిగా మారుమూల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుంచి సక్ర మంగా వెళ్లలేకపోతున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 363 పాఠశా లల్లో 30 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆరోజు గైర్హాజరైతే ఆ పాఠశాలకు ఇక సెలవే. ఇలా మారుమూల ప్రాంత విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కనీసం ఈ విద్యా సంవత్సరం విద్యా వలంటీర్లను కూడా నియమించలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందోననే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-01-24T23:18:56+05:30 IST