మృతదేహాలు అటూ ఇటూ!

ABN , First Publish Date - 2023-03-26T02:31:47+05:30 IST

తమవాడు చనిపోయాడన్న బాధలో రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు..

మృతదేహాలు అటూ ఇటూ!

ఇంటికి వెళ్లాక చూసుకున్న కుటుంబసభ్యులు

ఎంజీఎం మార్చురీ సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యం

హనుమకొండ అర్బన్‌/స్టేషన్‌ ఘన్‌పూర్‌/ భీమ దేవరపల్లి, మార్చి 25: తమవాడు చనిపోయాడన్న బాధలో రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు.. మార్చురీ నుంచి ఇంటికి తెచ్చిన మృతదేహాన్ని చూసుకొని అవాక్కయ్యారు! ఇంకో చోట మరో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులదీ ఇదే స్థితి! కారణం.. మృతదేహాలు అటూ ఇటూ అవ్వడమే! వరంగల్‌ ఎంజీఎం సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా మృతదేహాలు తారుమారయ్యాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం థానేదార్‌పల్లికి చెందిన రాగుల రమేశ్‌ పురుగుల మందు తాగి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హనుమకొండ జిల్లా వంగరకు చెందిన ఆశాడపు పరమేశ్వర్‌ శుక్రవారం ఎల్కతుర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీరి మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ముందుగా పరమేశ్వర్‌ కుటుంబసభ్యులు రాగా.. వారికి ఎంజీఎం పోస్టుమార్టం సిబ్బంది, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పొరపాటున రమేశ్‌ మృతదేహాన్ని అప్పగించారు. ఇంటికి వెళ్లి చూస్తే మృతదేహం మారిందని తెలుసుకొని ఎంజీఎం మార్చరీకి తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అయితే అప్పటికే సిబ్బంది, పోలీసులు పరమేశ్వర్‌ మృతదేహాన్ని రమేశ్‌ కుటుంబీకులకు అప్పగించేయడంతో వారు అంబులెన్స్‌లో తీసుకొని బయలుదేరారు. పొరపాటును తెలుసుకున్న ఎంజీఎం ఆధికారులు వెంటనే అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఫోన్‌చేసి ఆ మృతదేహాన్ని వెనక్కి తెప్పించారు. అనంతరం ఎవరి మృతదేహాన్ని వాళ్లకు అప్పగించి కుటుంబసభ్యులను శాంతింపచేశారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫోరెన్సిక్‌ మెడిసిన్‌) క్రాంతి చైతన్యకు మెమో ఇచ్చినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2023-03-26T02:31:47+05:30 IST