వేడుక అ‘ధర’హో..!
ABN , First Publish Date - 2023-03-05T00:04:06+05:30 IST
పెళ్లంటే.. పందిళ్లు.. సందెళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. ఇది పాతకాలపు నాటి మాట. కానీ ఇప్పుడు కాలం మారింది.. పెళ్లంటే కేవలం పందిళ్లు మాత్రమే కాదు.., ఫంక్షన్ హాల్‌లో అదిరిపోయే డెకరేషన్లు.. కళ్లు చెదిరే విద్యుద్దీప కాంతులు.. గుమ్మం నుంచి గుభాళించే పూలపరిమళాలు.. మొత్తంగా వేడుకల ఏర్పాట్లు మాత్రం ఆహుతులను అ‘ధర’గొట్టేస్తున్నాయి.. ఒకరికి మించి మరొకరు.. తగ్గేదేలే.. అన్నట్టుగా పోటీతత్వంతో సినిమా సెట్టింగులను సైతం తలదన్నేలా పెళ్లివేడుకలను నిర్వహిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. శుభలేఖల నుంచి మొదలుకుంటే బరాత్‌లో ఉర్రూతలూగించే డీజే మోతలదాకా పెళ్లివేడుకలు స్టేటస్ సింబల్‌కు కేరాఫ్‌గా మారిపోతున్నాయి.
ఖరీదైపోతున్న పెళ్లితంతు
స్టేటస్ సింబల్‌కు కేరాఫ్‌గా మారిన మండపాలు
సెట్టింగులు, ఆల్బమ్‌లకు లక్షల్లో ఖర్చు
ఆసక్తి కనబరుస్తున్న యువతరం
లింగాలఘణపురం, మార్చి4: ఒకప్పుడు పెళ్లివేడుక లను ఇంటిముంగిట నిర్వహించుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు బూతద్దం పెట్టి వెతికినా కనిపిం చడం లేదు. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు పెళ్లి వేడుకలను ఫంక్షన్ హాల్‌లోనే నిర్వహిస్తున్నారు. ఒక్కో ఫంక్షన్ హాల్ కిరాయి రూ.50వేల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటోంది. పట్టణప్రాంతాల్లోనైతే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏసీ ఫంక్షన్ హాల్, నాన్ ఏసీ, పార్కింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కుర్చీలు, అద్దాలమేడలాంటి భవంతుల్లో వాళ్ల వాళ్ల ఆర్థిక సామర్థ్యాలను బట్టి పెళ్లిళ్లను జరుపుకుంటున్నారు.
కళ్లు చెదిరే డెకరేషన్లు..
వేడుక ఏదైనా ఇప్పుడు డెకరేషన్ లేకుండా కనిపిం చదు.. రంగుల ప్రపంచం.. సర్వాంగ సుందరమైన వేదిక కళ్లు చెదిరేలా కనిపిస్తున్నాయి. పెళ్లి మండపాలు పూలపరిమళాలతో హొయలు ఒలకబోస్తున్నాయి. ఫంక్షన్ హాల్‌లో అడుగుపెట్టే మొదటి గేటు నుంచే అదిరిపోయే డెకరేషన్లు అధరహో అనిపిస్తున్నాయి. ప్రధానంగా విశాలమైన పెళ్లిమండపం, రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక, వధువు, వరుడికి వేర్వేరుగా గదుల నిర్మాణానికి డెకరేషన్లు నయనానం దకరంగా దర్శనమిస్తున్నాయి. పెళ్లిమండపాలు కనిష్టం గా రూ. 40వేల నుంచి రూ. 3 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నాయి. స్వాగత తోరణం నుంచి పెళ్లిమండపం దాకా అందమైన వస్త్రాలతో డిజైన్‌లుగా మార్చి పూల మాలలతో రాజకోటలోకి ఆహ్వానించినట్లుగా ఆకర్షణీ యమైన అందాలను తయారుచేస్తున్నారు.
హల్దీ వేడుకలోనూ తగ్గేదేలే..
పెళ్లికి ముందు ఇళ్లల్లో నిర్వహించే మంగళస్నానాలు హల్దీ కార్యక్రమాలు గతంతో పోల్చితే వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి మండపాలను అలకంరించిన మాదిరిగానే హల్దీ వేదికలను కూడా సుందరమయం గా పూలవేడుకలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ వేదికకు సైతం కనిష్టంగా రూ. 10వేల నుంచి రూ. 1లక్ష దాకా ఖర్చు చేస్తున్నారు. పైగా ఈ వేడుకలో పాల్గొనే బంధు మిత్రులకు డ్రెస్‌కోడ్ కూడా అందిస్తున్నారు.
పల్లకిలో పెళ్లికూతురు..
ఆధునిక ఫ్యాషన్ పోకడలతో ఇన్నాళ్లు మాయమైన పల్లకి కొత్తరూపాలను దిద్దుకుని మళ్లీ వచ్చింది. పాత కాలపు పల్లకి స్థానంలో సరికొత్త రూపురేఖల తో కను విందు చేస్తోంది. పెళ్లి మండపంలోకి వచ్చే పెళ్లికొడుకు లను గుమ్మం నుంచి మండపం లోకి పల్లకిలో తీసుకు రావడం ఆనవా యితీ పునరావృతమైంది. పెళ్లి అనంతరం కూడా నూతన జంటను ఊరేగించేందుకు పల్లకినే వినయోగిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన పెళ్లి పల్లకిని డెకరేషన్ నిర్వాహకులు అందంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి వినియోగానికి అదనంగా చార్జీలు వేస్తున్నారు.
మధుర జ్ఞాపకానికి వీడియో షూట్లు..
పెళ్లి ప్రతీ ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకం. దా న్ని పదిలంగా పదికాలాల పాటు నిలిపి ఉంచేది ఛా యాచిత్రాలే. పెళ్లికి ఒక రోజు ముందునుంచే ఫోటో, వీడియో గ్రాఫర్లు ఆయా తంతుల్లో సందర్భాలను బట్టి వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇందుకోసం రూ. 40వేల నుంచి రూ. 2 లక్షల దాకా వెచ్చిస్తున్నారు. ఇటీ వల కాలంగా స్పాట్ మిక్సింగ్, లైవ్ టెలికాస్ట్, ఎల్‌ఈడీ వాల్ (డిస్ ప్లే), క్రేన్ కెమెరా, డ్రోన్ కెమెరాలను విని యోగి స్తున్నారు. వీటికి అదనం గా చార్జీలు రూ. 25వేల నుంచి 75 వేల వరకు ఖర్చు చేస్తున్నా రు. మొత్తంగా హల్దీ నుంచి రిసెప్షన్ వరకు పెళ్లి బడ్జెట్‌లో రూ. 1 లక్ష నుంచి రూ.4ల క్షల వరకు కేటాయిస్తున్నా రు. దీనికి ప్రీవెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు అదనం.
15 ఏళ్లుగా సెట్టింగ్స్ వేస్తున్నా..
- పులకరం నాగరాజు- జనగామ
నేను 15 ఏళ్లుగా పెళ్లిళ్లు శుభకా ర్యాలకు ఫంక్షన్ హాల్‌లో, ఇళ్ల వద్ద సమావేశాల హాల్ వద్ద సెట్టింగ్స్ చేస్తున్నా. మొదట్లో రూ. 5వేలకే సెట్టింగ్ వేసేవాళ్లం. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. నిర్వాహకుల ట్రెండ్‌కు తగ్గట్లుగా ఇప్పుడు సెట్టింగ్‌లు వేస్తున్నాం. ప్రస్తుతం ఒక్కో సెట్టింగ్ కనిష్టంగా 30వేల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల దాకా పెరిగింది. కొంతమంది నిర్వాహకులు కేవలం సెట్టింగులకు రూ.15 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు.
ఇపుడు సాంకేతికత పెరిగింది..
- కాముని రాము- ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఒకప్పటి పెళ్లి వేడుకలకు ప్రస్తుత వేడుకలకు చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు సాంకేతిక పెరిగింది. క్షణాల్లో ఫోటోలు చూసుకునే అవకాశాలు ఉన్నాయి. లైవ్‌ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి డ్రోన్‌లతోషూట్ చేసి డిజిటల్ వాల్(స్ర్కీన్) మీద ప్రతీ తంతును ప్రత్యక్షప్రసారం ద్వారా చూపించగలిగే స్థాయికి వచ్చింది. సామాన్యుల నుంచి కోటీశ్వరుల దాకా వాళ్ల ఆర్థిక సామర్ధ్యాల కనుగుణంగా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రీవెడ్డింగ్ షోలతో ప్రకృతి హొయల నడుమ సినిమాలను తలదన్నే రీతిలో షూటింగ్ చేస్తున్నాం.