Share News

ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం

ABN , First Publish Date - 2023-12-10T23:07:37+05:30 IST

ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల సమగ్ర సమాచారం ఇక నుంచి ఒకే చోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకోసం యూడై్‌సప్లస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌)ను రూపొందించారు. ఇది విద్యావ్యవస్థ పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఓ వెబ్‌సైట్‌. దీన్ని 2024-25 విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం

వెబ్‌సైట్‌ రూపొందించిన పాఠశాల విద్యాశాఖ

‘యూడైస్‌ ప్లస్‌’లో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల సమస్త సమాచారం

ఈ నెలాఖరులోగా నిక్షిప్తం చేయాలని ఆదేశాలు

2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు

జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు 79,677 మంది విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యం

జనగామ కల్చరల్‌, డిసెంబరు 10: ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల సమగ్ర సమాచారం ఇక నుంచి ఒకే చోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకోసం యూడై్‌సప్లస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌)ను రూపొందించారు. ఇది విద్యావ్యవస్థ పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఓ వెబ్‌సైట్‌. దీన్ని 2024-25 విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో నమోదయ్యే వివరాలు అత్యంత ప్రామాణికం. ఇక నుంచి పాఠశాల నిర్వహణకు ఇదే మూలం కానుంది. పారదర్శకంగా ప్రభుత్వ బడుల నిర్వహణకు ఈ వెబ్‌సైట్‌ ఎంతో దోహదం చేయనుంది. ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో జరిగే మార్పులు, చేర్పుల పై పాఠశాలల నిర్వాహకులకు విద్యాశాఖ మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ నమోదు ప్రక్రియ ప్రతీ మండల విద్యా వనరుల కేంద్రంలో జరుగుతోంది.

యూడైస్‌ నుంచి యూ డైస్‌ ప్లస్‌గా ..

2021-22 వరకు యూడైస్‌గా కొనసాగిన ఈ వెబ్‌సైట్‌ను గత విద్యా సంవత్సరం నుంచి యూడైస్‌ ప్లస్‌గా మార్చారు. యూడైస్‌లో ఏడాదికోసారి సమాచారం అప్‌డేట్‌ చేయగా యూడైస్‌ ప్లస్‌లో మాత్రం మూడు గంటల కోమారు అప్‌డేట్‌ చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను మూడు మాడ్యూల్స్‌గా విభజించారు. 1. పాఠశాల భౌతిక వసతులు, 2. ఉపాధ్యాయులు, 3. విద్యార్థులు. ఈ విధంగా మూడు మాడ్యూల్స్‌గా విభజించి సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈవోలు, హెచ్‌ఎంల నేతృత్వంలో నిర్వహణ కొనసాగుతుంది. పాఠశాలకు క్రీడా స్థలం ఉందా? గదులు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఏమేం అవసరం? ఫర్నిచర్‌, ల్యాబ్‌ ఇతరత్రా సదుపాయాలు ఉన్నాయా? మరుగుదొడ్లు, తాగునీరు, మౌలిక వసతుల సమాచారం, అమలవుతున్న కార్యక్రమాలేమిటి తదితర అంశాల పై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. ఈ విధానం ద్వారా అన్ని పాఠశాలల వివరాలు ఒకే చోట కనిపిస్తాయి. పాఠశాలలు మూసివేసినా, ప్రారంభించినా వెంటనే నమోదు చేయాల్సి ఉంటుంది.

కొత్తగా ’పెన్‌’

విద్యార్థులకు యూడైస్‌ ప్లస్‌లో కొత్తగా పెన్‌ (పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు) కేటాయించారు. అన్ని రకాల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశం పొందింది మొదలు ఉన్నత విద్యను పూర్తి చేసే వరకు ఈ నంబరు విద్యార్థికి కీలకం కానుంది. ఈ పెన్‌ నంబరు ఉన్నవారికే అల్పాహారం, రాగిజావ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్స్‌, పుస్తకాలు అందిస్తారు. అన్ని పాఠశాలల వివరాలు ఒకేచోట లభించే అవకాశం ఉండడంతో అధికారులకు పని సులువుకా వడమే కాకుండా అవకతవలకు ఆస్కారం ఉండదు. అంతేగాకుండా విద్యార్థి మార్కుల మెమోపై పెన్‌ నంబరును ఈ విద్యా సంవత్సరం నుంచి ముద్రించనున్నారు. ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతి పేరు నమోదు చేయాల్సి ఉం టుంది. డిసెంబరు నెలాఖరు లోగా అన్ని వివరాలు పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పూర్తయిన శిక్షణ

వెబ్‌సైట్‌లో చేరిన నూతన అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా శిక్షణ ప్రారంభించారు. యూడైస్‌ ప్లస్‌పై జిల్లాలో ఇప్పటికే ఎంఈవోలు, హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 12 లోగా విద్యార్థుల పూర్తి సమాచారాన్ని యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలి. 14 వరకు అప్‌డేట్‌ చేసిన సమాచారాన్ని క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. ఈ నెల 16లోగా క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు సమాచారాన్ని పరిశీలించి 17 వరకు ఎంఈవోలకు అందజేయాలి. 18న ఎంఈవోలు 25 శాతం పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. 21 వరకు డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాఠశాలల సమాచారాన్ని క్రోడీకరిస్తారు. ఈ నెల 23 లోగా జిల్లా స్థాయిలో కంప్యూటరైజ్డ్‌ డేటాను పరిశీలిస్తారు. వెబ్‌సైట్‌లో పొందుపరిచే సమాచారం ఆధారంగా ’మన ఊరు - మన బడి’ , పీఎం -శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేస్తారు. విద్యాలయాలు సమర్థంగా నిర్వహించేందుకు ఈ వెబ్‌సైట్‌ ఎంతో ఉపకరించనుంది.

మూడంచెల విధానంలో పరిశీలన..

యూడైస్‌లో నమోదైన వివరాలను మూడంచెల విధానంలో పరిశీలిస్తారు. పాఠశాలల్లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా ? లేవా ? అనే విషయాలను స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పరిశీలించి ఎంఈవోలకు నివేదిస్తారు. అందులో 25ు పాఠశాలలను ఎంఈవోలు పరిశీలించి డీఈవోలకు నివేదిస్తారు. డీఈవోలు 10 శాతం పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు.

జిల్లాలో 79,677 మంది విద్యార్థులు

జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులను యూడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలతో కలిపి 632 పాఠశాలలు, 34 జూనియర్‌ కళాశాలలతో మొత్తం 666 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 79,677 మంది విద్యార్థులు యూడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

పకడ్బందీగా వివరాల నమోదు : కె.రాము, డీఈవో

యూడైస్‌ ప్లస్‌లో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు పకడ్బందీగా నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. వివరాల నమోదుపై ప్రఽధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. ఈ విధానం ద్వారా ఒకే దగ్గర అన్ని పాఠశాలల వివరాలు లభ్యమవుతాయి. తద్వారా సులభంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెల 12 లోగా సమాచారాన్ని పూర్తి చేయాలి.

Updated Date - 2023-12-10T23:07:39+05:30 IST