కార్యక్రమాలకు కప్పమా?

ABN , First Publish Date - 2023-03-20T00:23:32+05:30 IST

హనుమకొండలోని చారిత్రకంగా సుప్రసిద్ధమైన కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల గుడి ఆవరణలో ఉగాది ఉత్సవాలతోపాటు ఇతర ఏ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నా.. ఇక నుంచి రూ.25వేలు చెల్లించాలని కేంద్ర పురావస్తుశాఖ ఉత్తర్వులు జారీ చేయడం అమానుషమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఖండించారు.

కార్యక్రమాలకు కప్పమా?
సమావేశంలో మాట్లాడుతున్న వినయ్‌ భాస్కర్‌

ఉగాది వేడుకలకు రూ.25వేలు కట్టాలని కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాలు

మండిపడ్డ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

వెంటనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌

హనుమకొండ కల్చరల్‌, మార్చి 19: హనుమకొండలోని చారిత్రకంగా సుప్రసిద్ధమైన కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల గుడి ఆవరణలో ఉగాది ఉత్సవాలతోపాటు ఇతర ఏ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నా.. ఇక నుంచి రూ.25వేలు చెల్లించాలని కేంద్ర పురావస్తుశాఖ ఉత్తర్వులు జారీ చేయడం అమానుషమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఖండించారు. ఆదివారం గుడి ఆవరణలోని పునర్నిర్మాణంలో ఉన్న కల్యాణ మండం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేయిస్తంభాల ఆలయంలో కార్యక్రమాలు చేయాలంటే నిర్వాహకులు ఇక నుంచి భక్తుల వద్ద బిక్షమెత్తి రుసుము కట్టాలా అని ప్రశ్నించారు. 50 యేళ్లుగా వేయిస్తంబాలగుడి ఆవరణలో ఉగాది వేడుకలు జరుగుతున్నాయని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు రుసుము కట్టాల్సిందేననడం దారుణం అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని వినయ్‌భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

వేయిస్తంభాల గుడి పట్ల కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నా కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. కేంద్ర పురావస్తు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత కల్యాణ మండపం పనులు త్వరగా పూర్తవుతాయని ఆశించామని, అది అడియాశే అయిందని విచారం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల 17 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవడానికి వీలులేకుండా వేయిస్తంభాల గుడి పర్యవేక్షణ అంతా కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోనే ఉంటుందన్నారు. ఆలయంతో పాటు చుట్టు పక్కల ఎలాంటి పనులకు అనుమతి ఉండదన్నారు. కల్యాణమండపం పనులు పూర్తి కావడానికి మరో రూ.6కోట్లు అవసరమవుతాయని రెండేళ్ల కిందట కేంద్ర పురావస్తు శాఖ అంచనా వేసిందని, ఈ నిధులను ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. దీంతో మండపం పైకప్పు పనులు ఆగిపోయాయన్నారు. గత డిసెంబర్‌ నెలాఖరు నాటికి మండపం పనులు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి.. ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయించలేక పోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చొరవ వల్లనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపద దోచిపెడుతున్న కేంద్రం ప్రజల పక్షాన గొంతెత్తినవారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కల్యాణ మండపం పనులను సత్వరం పూర్తి చేయలేని కేంద్ర పురావస్తుశాఖ ఇప్పుడు కొత్త మెలిక పెట్టిందని విమర్శించారు.

సమావేశంలో ఆలయ ఈవో కె.వెంకటయ్య కుడా అధికారులు అజిత్‌రెడ్డి, బీంరావు, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, బీఆర్‌ఎస్‌ నాయకులు పులి రజనీకాంత్‌, మేకల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వినయ్‌భాస్కర్‌ కల్యాణ మండపం పనులను పరిశీలించారు. ఎంత మేరకు జరిగింది అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో రుద్రేశ్వరుడికి పూజలు చేశారు.

Updated Date - 2023-03-20T00:23:32+05:30 IST