బాల్య వివాహాలను కట్టడి చేద్దాం..
ABN , First Publish Date - 2023-03-19T00:14:25+05:30 IST
బాల్యవివాహాలను కట్టడి చేసి బాలల హక్కులను కాపాడుదామని పోలీసు కమిషనర్ ఎ.వి. రంగనాథ్ పిలుపునిచ్చారు.

పోలీసు కమిషనర్ ఎ.వి.రంగనాథ్
చైల్డ్‌వెల్ఫేర్ అధికారులతో సమావేశం
హనుమకొండ క్రైం, మార్చి 18: బాల్యవివాహాలను కట్టడి చేసి బాలల హక్కులను కాపాడుదామని పోలీసు కమిషనర్ ఎ.వి. రంగనాథ్ పిలుపునిచ్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సీడబ్ల్యూసీ, సీడీపీవో, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎండీవో, పోలీసు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు. బాల్యవివాహాలు, బ్రూణహత్యలు జరిగే ప్రాంతాలను ముందుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. బాల హక్కుల సాధన కోసం అన్ని విభాగాల అధికారులు శ్రమించాలని సూచించారు. బాల్యవివాహాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు అధికారులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్టు సమాచారం అందితే పోలీసుల సహాయంతో నిలిపివేయాలని సూచించారు. బ్రూణహత్యల నియంత్రణకు స్కానింగ్ సెంటర్‌లపై నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సెక్సువల్ ట్రాఫికింగ్‌పై నిఘా పెట్టి వ్యభిచార గృహాలపై దాడులు చేయాలని అన్నారు. నిర్వాహకులపై నిఘా పెట్టి కఠినమైన కేసులు నమోదు చేయాలన్నారు. క్రైం డీసీపీ మురళీధర్, అదనపు డీసీపీ పుష్పారెడ్డి, యాంటీ హ్యుమన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల సీడీపీవోలు, చైల్డ్‌వెల్ఫేర్ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.