అటకెక్కిన బీసీ రుణాలు

ABN , First Publish Date - 2023-05-25T00:12:58+05:30 IST

బీసీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ఒకప్పుడు ఈ పథకం ఎంతో సమృద్ధిగా నడిచి మంచి ఫలితాలు ఇచ్చేది. ఏడేళ్ల నుంచి సర్కారు పట్టించుకోవడం లేదు. రుణాల కోసం అప్లికేషన్లు పెట్టుకుని ఏళ్లు గడిచినా అతీగతి లేదు. గతంలో ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదల చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి.

అటకెక్కిన బీసీ రుణాలు

ఐదేళ్లుగా అందని లోన్లు

స్వయం ఉపాధికి దూరమవుతున్న యువత

పట్టించుకోని ప్రభుత్వం

తొర్రూరు, మే 24 : బీసీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ఒకప్పుడు ఈ పథకం ఎంతో సమృద్ధిగా నడిచి మంచి ఫలితాలు ఇచ్చేది. ఏడేళ్ల నుంచి సర్కారు పట్టించుకోవడం లేదు. రుణాల కోసం అప్లికేషన్లు పెట్టుకుని ఏళ్లు గడిచినా అతీగతి లేదు. గతంలో ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదల చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాలో 16 మండలాలు, 4 మునిసిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 14,165 మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, అవి కాగితాల్లోనే మిగిలి పోయాయి. దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకర్లు, ఎంపీడీవోలు, కార్పొరేషన్‌ అధికారులు సంయుక్తంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టి రుణాల పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, గత 5 సంవత్సరాలుగా పట్టించుకునే నాథుడే లేడు.

యువత వలసలు

స్వయం ఉపాధి పొందాలనుకున్న బీసీ యువతకు అప్పులు, వలసలే దిక్కుగా మారాయి. అత్యధిక ప్రైవేటు వడ్డీలు కడుతూ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ, నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఉపాధి దొరకక స్వయం ఉపాధికి రుణాలు అందక ఎంతో మంది యువత హైదరాబాద్‌, సూరత్‌, ముంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళుతున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం 2018లో బీసీ రుణాల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అది కూడా ఎన్నికలు ఉన్నాయనే కారణంగానే బీసీల ఓట్లను దండుకునేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకు జిల్లాలో 13,765 బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలక్షన్‌ ముందు కొంత మందికి రుణాలు మంజూరు చేసినా మంజూరైన రుణంలో సగం నిధులే అందించారు. రూ.లక్ష యూనిట్‌ మంజూరైతే రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన వారికి రుణాలు ఇవ్వ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ రుణాల కోసం దర ఖాస్తులు చేసుకున్న ఎంతో మంది కార్యాలయం చుట్టూ తిరు గుతున్నా పట్టించుకునే వారు లేరు. దీనిపై జిల్లా అధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి నిధులు రాగానే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.

ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నాం : గడల శేఖర్‌, తొర్రూరు

2018 ఎన్నికల ముందు బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు దరఖాస్తు చేసుకుంటే అధికారులు కొన్ని దరఖాస్తులను తిరస్కరించారు. 2019లో లక్ష రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. భార్య శరణ్య పేరుతో లక్ష రూపాయలకు కిరాణా షాపు కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి అధికారులు రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బీసీలకు రుణాలు అందించాలి.

ఎన్నికల ముందే హడావిడి : కస్తూరి పులేందర్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం బీసీల పట్ల చిన్నచూపు చూస్తుంది. ఎన్నికల ముందు రుణాలు ఇస్తామని హడావిడి చేస్తూ యువతను మభ్య పెడుతున్నారు. ఎంతో మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారు లేరు. ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం కల్పించాలి. ప్రభుత్వం అందించే రుణాలైనా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. గతంలో ఎన్నికల ముందు లక్ష రూపాయల యూనిట్‌కు రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. అలా కాకుండా పూర్తి స్థాయిలో రుణాలు అందించాలి.

బీసీలపై చిన్నచూపు తగదు : దీకొండ శ్రీనివాస్‌, తొర్రూరు

జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలపై కేసీఆర్‌ ప్ర భుత్వం చిన్న చూపుతో వ్యవహరించడం సరికాదు. బీసీ ల ఓట్లతో గెలిచి వారిని మోసం చేస్తుంది, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై చూపుతున్న ప్రేమ బీసీలపై లేదు. ఐదేళ్ల క్రితం టెంట్‌హౌజ్‌ పె ట్టుకునేందుకు బీసీ రుణాలకు దరఖాస్తుచేసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్‌ రుణాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేశారు. కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖా స్తులను పరిశీలించి అర్హులైన వారందరికి రుణాలు అందించాలి. గత ఎన్నికల ముందు బీసీలకు రుణాలు ఇస్తామంటూ అధికారులు హడావిడి చేసి తీరా ఎన్నికలు ముగిశాక పత్తాలేకుండా పోయారు. 2018లో అప్లికేషన్‌ ఇస్తే నేటి వరకు రుణాలు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బీసీలకు రుణాలు అందించి ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

Updated Date - 2023-05-25T00:12:58+05:30 IST