తుదిదశకు ‘బీసీ బంధు’

ABN , First Publish Date - 2023-07-30T00:33:21+05:30 IST

కులవృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బంధు పథకం ముందుకు కదులుతోంది. జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.

తుదిదశకు ‘బీసీ బంధు’

అర్హుల ఎంపికపై కసరత్తు పూర్తి

మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల

మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 520 మందికి లబ్ధి

వారం రోజుల్లోగా పంపిణీకి సన్నాహాలు

జనగామ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కులవృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బంధు పథకం ముందుకు కదులుతోంది. జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయగా మంత్రి అమోదం పొందిన తర్వాత పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు ప్రాథమికంగా పరిశీలన చేయగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), డీఆర్‌డీవో, బీసీ సంక్షేమ అధికారితో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమోదం పొందిన తర్వాత జాబితాను విడుదల చేస్తారు. ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.

జిల్లాలో మొదటి విడతలో 520 మందికి లబ్ధి

జిల్లావ్యాప్తంగా మొదటి విడత బీసీ బంధు కింద కేవలం 520 మందికి మాత్రమే లబ్ధి కలగనుంది. మొదటి విడత బీసీ బంధులో భాగంగా ప్రభుత్వం నియోజకవర్గానికి 300 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 12 మండలాలకు గానూ 520 మందికి లబ్ధి జరగనుంది. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ మూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ని మండలాలు పక్క జిల్లాల్లో ఉన్న కారణంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. జనగామ నియోజకవర్గ పరిధిలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలు సిద్ధిపేట జిల్లాలో ఉండగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలోని ధర్మసాగర్‌, వేలేరు మండలాలు హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. దీంతో పాటు పాలకుర్తి పరిధిలోని తొర్రూరు, పెద్దవంగర మండలాలు మహబూబాబాద్‌ జిల్లాలో ఉండగా రాయపర్తి మండలం వరంగల్‌ జిల్లాలో ఉంది. ఈ క్రమంలో జనగామ జిల్లాకు వచ్చే సరికి మొత్తం 900లో 520 మందికి ఈ సాయం అందనుంది.

8798 దరఖాస్తులు..

జిల్లావ్యాప్తంగా బీసీబంధు కింద 8798 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా పరిశీలన జరిపి ఎంపీడీవోలు ప్రాథమికంగా అర్హులుగా తేల్చారు. ఎంపీడీవోల ద్వారా వచ్చిన దరఖాస్తులను జిల్లా స్థాయి ఎంపిక కమిటీ మరోసారి పరిశీలన చేసి 6439 మందిని అర్హులుగా గుర్తించింది. బీసీబంధు కింద ప్రభుత్వం ప్రకటించిన కులవృత్తుల జాబితాలో లేని కులాల వారు చేసుకున్న దరఖాస్తులు, సరైన ఽద్రువపత్రాలు సమర్పించని 2359 మందిని అనర్హులుగా తేల్చారు.

వచ్చే నెలలో రెండో విడత

నిధుల సమీకరణకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడత బీసీబంధు పంపిణీ పూర్తయ్యాక వచ్చే నెల 10వ తేదీ తర్వాత రెండో విడతలో మరింత మందికి సాయం అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల నుంచే రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అలా అర్హులందరికీ అందే వరకు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రెండేళ్ల పాటు పర్యవేక్షణ..

బీసీబంధు కింద రూ. ఒక లక్ష ఆర్థికసాయాన్ని పొందిన వారిపై రెండేళ్ల పాటు పర్యవేక్షణ ఉంటుంది. కులవృత్తులను ప్రోత్సహించేందుకే ఈ సాయం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆర్థికసాయం పొందిన వ్యక్తి కచ్చితంగా రెండేళ్ల పాటు వృత్తి పని చేస్తున్నారా లేదా అన్నదానిపై పర్యవేక్ష ణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మండల స్థాయి ప్రత్యేకా ధికారులకు ఈ బాధ్యతలను అప్పగిం చింది. ఆర్థికసాయాన్ని ప్రభుత్వం లబ్ధిదారుడికి చెక్కు రూపంలో ఇవ్వనుంది. ఈ ఆర్థిక సాయం పొందగానే నెల రోజుల్లోగా వృత్తికి సంబంధించి మెటీరియల్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధిం చిన బిల్లులను సైతం నెల రోజుల్లోగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. సాయం పొందిన డబ్బులు పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోగా ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.

బీసీబంధు నిరంతర ప్రక్రియ

- రవీందర్‌, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి

కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీబంధుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం 8798 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 6439 మంది అర్హులుగా తేలారు. ప్రభుత్వం మొదటి విడతలో నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ఆర్థికసాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇతర జిల్లాల్లోకి వెళ్లిన మండలాలను మినహాయిస్తే జనగామ జిల్లాలో మొదటి విడతలో 520 మందికి లబ్ధి జరగనుంది. బీసీబంధు పథకాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత పంపిణీ పూర్తి కాగానే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక చేస్తాం.

Updated Date - 2023-07-30T00:33:21+05:30 IST