మరో మండలం
ABN , First Publish Date - 2023-06-28T23:11:54+05:30 IST
ప్రజాకాంక్ష నెరవేరింది. భూపాలపల్లి జిల్లాలో మరో మండలం ఆవిర్భవించింది. కొత్తగా గోరికొత్తపల్లి మండలంగా ఏర్పడింది.
కొత్తగా ‘గోరికొత్తపల్లి’ ఆవిర్భావం
ఏడు రెవెన్యూ గ్రామాలు.. 15 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు
రేగొండ పరిధిలో 11రెవెన్యూ గ్రామాలు.. 22 గ్రామపంచాయతీలు
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
తాజాగా గెజిట్ జారీ
భూపాలపల్లి జిల్లాలో 12కు పెరిగిన మండలాల సంఖ్య
భూపాలపల్లి (ఆంధ్రజ్యోతి)/ రేగొండ, జూన్ 28: ప్రజాకాంక్ష నెరవేరింది. భూపాలపల్లి జిల్లాలో మరో మండలం ఆవిర్భవించింది. కొత్తగా గోరికొత్తపల్లి మండలంగా ఏర్పడింది. ఇప్పటికే దీని నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. రేగొండ మండలాన్ని రెండుగా విభజించి గోరికొత్తపల్లి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది.
రేగొండ మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉండటంతో పరిపాలన సమస్యలు ఎదురవుతు న్నాయి. ఈ నేపథ్యంలో గోరికొత్తపల్లి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఎనిమిది రెవెన్యూ గ్రామాలతో కొత్త మండలంగా కొత్తపల్లిగోరిని ఏర్పాటు చేస్తున్నట్టు జనవరి 7న జీవో నంబరు 233ను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉం టే 15 రోజుల్లోగా కలెక్టర్ కార్యాలయంలో తెలపాలని పేర్కొంది. ఈ క్రమంలో దమ్మన్నపేట రెవెన్యూ గ్రామం పరిధిలో వచ్చే దమ్మన్నపేట, రూపిరెడ్డిపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని రేగొండలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. దీంతో పాటు చారిత్రాక నేపథ్యం ఉన్న పాండవు లగుట్టలు ఉన్న తిరుమలగిరి గ్రామాన్ని కూడా రేగొండలోనే కొనసాగించాలని గ్రామస్థులు మొద టి నుంచి కోరుతున్నారు. దీంతో ఆయా గ్రామా ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అధికార యం త్రాంగం ప్రభుత్వానికి పంపించింది. ఆరు నెలలుగా పైగా కొత్త మండలం ఏర్పాటుపై ఎలాంటి ఉత్తర్వ్యులు వెలవడకపోవటంతో ఇప్పట్లో ఇది కష్టసాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైం ది. మల్లంపల్లి లాగానే గోరికొత్తపల్లి మండలం కూడా అటకె క్కిందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే గోరికొత్తపల్లిని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేయటంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
స్వరూపం ఇదీ...
రేగొండ మండలంలో మొత్తం 18 రెవెన్యూ గ్రామాలు, 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి లోని ఏడు గోరికొత్తపల్లి, చెన్నాపూర్, చిన్నకోడెపాక, జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, జంషేడ్‌బేగ్‌పేట, కోనరావుపేట రెవెన్యూ గ్రామాలతో గోరికొత్తపల్లి కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. ఈ ఏడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గోరికొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్, చెన్నాపూర్, చెంచుపల్లి, దామరంచప ల్లి, చిన్నకోడెపాక, రాజక్కపల్లి, ఇజ్జయ్యపల్లి, జగ్గయ్య పేట, రామగుండాలపల్లి, సుల్తాన్‌పూర్, వెంకటేశ్వ ర్లపల్లి, కోనారావుపేట గ్రామాలు కొత్త మండలంలో ఉండనున్నాయి. అలాగే ఆరు ఎంపీటీసీ స్థానాలు కూడా గోరికొత్తపల్లి మండలం పరిధిలోనే కొనసాగ నున్నాయి. కొత్త మండలంలో 19,635 మంది జనాభా ఉంది. వీరిలో 9,783 మంది పురుషులు, 9,852 మంది మహిళలు ఉన్నారు. ఇక రేగొండ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామ పంచా యతీలు ఉండనున్నాయి. 12 ఎంపీటీసీ స్థానాలు కూడా రేగొండ పరిధిలో ఉంటాయి. అయితే.. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు మండల పరిషత్తు ఉమ్మడిగానే కొనసాగనుంది.
గెజిట్‌లో మార్పులు...
జనవరి 7న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గోరికొత్తపల్లి గ్రామాన్ని ‘కొత్తపల్లిగోరి’ గ్రామంగా పేర్కొంటూ ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించింది. అయితే బుధవారం విడుదల చేసిన గెజిట్‌లో గోరికొత్తపల్లిగానే పేర్కొంది. మొదటి నుంచి ఈ గ్రామం పేరు గోరికొత్తపల్లిగానే రికార్డుల్లో ఉంది. నోటిఫికేషన్‌లో కొత్తపల్లిగోరిగా పేరు మార్చటంపై కూడా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీం తో గెజిట్‌లో పాత పేరునే పునరుదఽ్ధరించారు. అలా గే మొదటి నోటిఫికేషన్‌లో దమ్మన్నపేట రెవెన్యూ గ్రామాన్ని గోరికొత్తపల్లి మండలంలో ప్రతిపాదించగా స్థానికుల నుంచి వ్యతిరేకత రావటంతో తిరిగి దమ్మన్నపేట రెవెన్యూ గ్రామాన్ని రేగొండలోనే కొనసాగిస్తూ గెజిట్ విడుదల చేశారు.
జిల్లాలో 12కు చేరిన మండలాలు
భూపాలపల్లి జిల్లాను 20 మండలాలతో 2016 అక్టోబరు 11న ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే చిట్యాల మండలం నుంచి టేకుమట్ల, మహ దేవపూర్ మండలం నుంచి పలిమెల, ఏటూరు నాగారం నుంచి కన్నాయిగూడెం మండలాలను ఏర్పాటు చేశారు. పాత 17 మండలాలతోపాటు కొత్తగా ఏర్పడిన మూడు మండలాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటైంది. అయితే 2019 ఫిబ్రవరి 19న ములుగు తొమ్మిది మండలాలతో ప్రత్యేక జిల్లాగా ఏర్పడటంతో భూపాలపల్లి జిల్లాకు 11 మండలాలే మిగిలాయి. తాజాగా గోరికొత్తపల్లి మండలం ఏర్పాటుతో ఆ సంఖ్య 12 మండలాలకు చేరింది. ప్రస్తుతం జిల్లాలో టేకుమట్ల, పలిమెలతో పాటు తాజాగా గోరికొత్తపల్లి కూడా కొత్త మండలంగా ఏర్పడింది.