అనధికారిక కొనుగోళ్లలో ‘దారి’ దోపిడీ

ABN , First Publish Date - 2023-06-01T00:27:55+05:30 IST

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లకు సెలవు రోజుల్లో వెలుపల అనధికారిక కొనుగోళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘రాస్తామాల్‌’ పేరిట జరిగే ఈ కొనుగోళ్లలో రైతులు ‘దారి’ దోపిడీకి గురవుతున్నారు. బయట జరిగే ఖరీదుల్లో ధర తక్కువ రావడమే కాకుండా రైతులకు హమాలీ చార్జీల పేరిట వ్యాపారులు కోత విధిస్తున్నారు.

అనధికారిక కొనుగోళ్లలో ‘దారి’ దోపిడీ

కూలీలు లేకున్నా చార్జీలు తీసుకుంటున్న వ్యాపారులు

ఒక శాతం నగదు కోత

భారీగా నష్టపోతున్న రైతులు, కార్మికులు

కేసముద్రం, మే 31 : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లకు సెలవు రోజుల్లో వెలుపల అనధికారిక కొనుగోళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘రాస్తామాల్‌’ పేరిట జరిగే ఈ కొనుగోళ్లలో రైతులు ‘దారి’ దోపిడీకి గురవుతున్నారు. బయట జరిగే ఖరీదుల్లో ధర తక్కువ రావడమే కాకుండా రైతులకు హమాలీ చార్జీల పేరిట వ్యాపారులు కోత విధిస్తున్నారు. జిల్లాలో మహ బూబాబాద్‌, కేసముద్రం, తొర్రూరు వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నాయి. ఇందులో మహబూబాబాద్‌, కేసముద్రం మార్కెట్లలో నిత్యం లక్షల్లో ఖరీదులు కొనసాగుతుంటాయి. ఆయా మార్కెట్ల పరిధిలో ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) ద్వారా కొనుగోలు చేసిన సరుకులను రాశిగా పోసి ఈ-వేలంలో దక్కించుకున్న వ్యాపారికి చెందిన కూలీలు బస్తాల్లోకి ఎత్తి, కుట్టు వేసి గోదాంల్లోకి తరలిస్తారు. ఇలా మార్కెట్లో కార్మికులు చేసిన పనికి హమాలీ, కూలీ చార్జీలను మిన హాయించి తక్‌పట్టీలను జారీ చేస్తారు. ఈ తక్‌పట్టీల్లో నమోదైన వివరాల ఆధారంగా వ్యాపారుల నుంచి ఒక శాతం మార్కెట్‌ ఫీజు వసూలు చేసుకుంటారు. ఆయా మార్కెట్లకు ఏటా మార్కెట్‌ ఫీజు రూ.3కోట్ల వరకు వస్తోంది. అయితే మార్కెట్లకు సెలవు ఉన్న రోజుల్లో మార్కెట్‌ బయట కాంటాలు పెట్టి రైతుల నుంచి నేరుగా ఖరీదులు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి ఎండల దృష్ట్యా మార్కెట్లకు రోజు తప్పించి రోజు నడుపుతూ సెలవులు అధికంగా ఉన్నాయి. ఈ సెలవుల విషయం తెలియని అమాయక రైతులు మార్కెట్‌కు సరుకులు తీసుకువస్తున్నారు. తీరా మార్కెట్‌కు సెలవు ఉందని తెలుసుకొని, మార్కెట్‌ బయట ఉన్న వ్యాపారుల వద్దకు వెళుతున్నారు. కేసముద్రం, మానుకోట మార్కెట్లలో మిర్చి కొనుగోళ్లు బంద్‌ ఉండడంతో వ్యాపారులు నేరుగా రైతుల నుంచి అనధికారిక కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఇలా వచ్చిన రైతులను తక్కువ ధర రూపంలో, కూలీ చార్జీలు, నగదు కోతలు విధిస్తూ దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

రైతుల నుంచి చార్జీల పేరుతో కోత

రైతుల నుంచి కూలీల పేరుతో కోత విధించిన డబ్బులను వ్యాపారులు కార్మికులకు చెల్లించడం లేదు. దీంతో అటు రైతు లు, ఇటు కార్మికులు వ్యాపారుల చేతిలో నష్టపోతున్నారు. సాధారణంగా మార్కెట్లో రాశిగా పోసిన సరుకులను బస్తాల్లోకి కూలీలు ఎత్తుతారు. దడువాయుల ఆధ్వర్యంలో హమాలీలు కాంటా పెట్టి కుట్టు వేసి రవాణా చేస్తారు. ఈ పని చేసినందుకు బస్తాకు హమాలీలకు రూ.6.25, కూలీలకు రూ.6.50, దడువాయిలకు రూ.5లను రైతుల వద్ద నుంచి వసూలు చేసి వ్యాపారులు కార్మికులకు చెల్లిస్తారు. మిర్చి కొనుగోళ్లలో బస్తాకు రూ.20లు కూలీ చార్జీలు వసూలు చేస్తారు.

మార్కెట్‌ బయట ఇలా..

మార్కెట్‌కు సెలవులు ఉన్న రోజుల్లో రైతులు నేరుగా వ్యాపారుల వద్దకే వెళ్లి సరుకులు విక్రయిస్తుంటారు. ఈ సమ యంలో తక్కువ ధరలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రైతులు తీసుకువచ్చిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పత్తి తదితర సరుకులను వేబ్రిడ్జి ద్వారా కాంటా పెట్టి కొనుగోలు చేస్తారు. ట్రాక్టర్‌ లిఫ్ట్‌ ద్వారా సరుకును వ్యాపారి వద్ద దిగుమతి చేస్తున్నారు. ధాన్యం, మొక్కజొన్న బస్తాల్లో కాకుండా విడిగా ట్రాక్టర్లలో తీసుకువచ్చిన రైతుల వద్ద ట్రాక్టర్‌కు 30 కిలోల చొప్పున ట్రాక్టర్‌ తరుగుతోపాటు మొత్తం సరుకును బస్తాల్లో లెక్కించి బస్తాకు 1కిలో చొప్పున వ్యాపారులు కోత విధి స్తున్నా రు. హమాలీ, కూలీ, దడువాయి చార్జీలతోపాటు ఒకశాతం ‘నగదు’ ఇచ్చినందుకు మినహాయింపులు చేసి రైతుకు డబ్బులను వ్యాపారులు ఇస్తున్నారు. ఇలా రైతు నుంచి మినహాయించిన చార్జీలను కార్మికులకు చెల్లించడంలేదు. ఇదిలా ఉండగా అసలు కూలీ, హమాలీ, దడువాయి ప్రమేయం లేకుండానే జరిగిన వ్యవహారంలో వారి పేరుతో చార్జీలు వసూలు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బయట జరిగే కొనుగోళ్ల ద్వారా మార్కెట్‌ ఫీజు రావాల్సి ఉండగా ‘రాస్తామాల్‌’ పేరిట కొంతమంది వ్యాపారులే ఫీజు చెల్లిస్తున్నారు. చాలా మంది మార్కెట్‌కు ఎలాంటి లెక్కలు చూపకుండా మార్కెట్‌ ఫీజు ఎగవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా బయట జరిగే కొనుగోళ్లపై మార్కెట్‌ అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తూ రైతులకు కూలీ చార్జీలతోపాటు ఒకశాతం మినహాయింపులు లేకుండా పూర్తి నగదు చెల్లించేలా చూడాలని, మార్కెట్‌ ఫీజు వసూలయ్యేలా దడువాయి చిట్టాను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

కోతలు విధిస్తున్నారు : కందుల అనిల్‌, రైతు, అలంఖానిపేట, నెక్కొండ మండలం

రెండు బస్తాల్లో 59 కిలోల మిర్చి తీసుకువచ్చాను. క్విం టాకు రూ.17వేల చొప్పున ఖరీదు చేసిన వ్యాపారి కూలీ చార్జీల పేరుతో రూ.340 కోత విధించాడు. ఇదేమని ప్రశ్ని స్తే కూలీ చార్జీలు అలాగే ఉంటాయ ని వ్యాపారి చెబుతున్నాడు. కూలీలే లేకుండా చార్జీలు కోత విధించి రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు.

మార్కెట్‌ పర్యవేక్షణ లేదు : గంట దామోదర్‌రెడ్డి, రైతు, కల్వల

మార్కెట్‌ బయట జరిగే కొనుగోళ్లపై మార్కెటింగ్‌ శాఖాధికారుల పర్యవేక్షణ కరువైంది. సెలవు రోజులు ఉన్నాయని తెలియక రైతులు వస్తే తక్కువ ధరలు, అధిక కోతలతో వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. అధికారులు నిరంతరం బయట జరిగే కొనుగోళ్లపై నిఘా పెట్టి రైతుకు భరోసా ఇవ్వాలి.

Updated Date - 2023-06-01T00:27:55+05:30 IST