TSRTC: పెళ్లిళ్ల సీజన్‌ దృష్ట్యా టీఎస్ఆర్టీస్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2023-02-09T22:35:23+05:30 IST

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని అందించనున్నట్టు ప్రకటించింది.

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌ దృష్ట్యా టీఎస్ఆర్టీస్ కీలక నిర్ణయం!

హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని అందించనున్నట్టు ప్రకటించింది. అన్ని రకాల బస్‌ సర్వీసులపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని తెలిపింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది.

తాజాగా పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు తెలిపారు. ప్రైవేట్‌ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని వారు పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్‌ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-02-09T22:35:27+05:30 IST