Khammam: భార్య చనిపోవడంతో ఆమె చెల్లినే రెండో పెళ్లి చేసుకున్న మానస తండ్రి.. అంతేకాదు..
ABN , First Publish Date - 2023-06-06T12:12:58+05:30 IST
తానుంటున్న హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మెడికో సముద్రాల మానస (23) ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఖమ్మం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె బలవన్మరణానికి మనోవేదనే కారణమా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా అని ఆరా తీస్తున్నారు.
మనోవేదనే కారణమా..?
మిస్టరీగా మారిన మెడికో మానస ఆత్మహత్య
బాల్యంలోనే తల్లిదండ్రుల మృతి.. పినతల్లి సంరక్షణలో జీవనం
ఆర్థిక, కుటుంబ సమస్యలు లేవంటున్న బంధువులు
స్వయంగా పెట్రోల్ తెచ్చుకొని గదిలోనే ఆత్మహత్య
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
ఖమ్మం క్రైం/నయీంనగర్(హనుమకొండ): తానుంటున్న హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మెడికో సముద్రాల మానస (23) ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఖమ్మం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె బలవన్మరణానికి మనోవేదనే కారణమా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా అని ఆరా తీస్తున్నారు. హనుమకొండ కిషన్‌పుర ప్రాంతానికి చెందిన సముద్రాల మానస(23) ఖమ్మం నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో దంతవైద్య విద్య నాలుగో ఏడాది చదువుతూ స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తానుంటున్న హాస్టల్ గదిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించగా.. వారు స్వగ్రామానికి తీసుకెళ్లి అంతయక్రియలు పూర్తిచేశారు.
జరిగిందేంటంటే..
మానస తల్లిదండ్రులు వరంగల్ గిర్మాజిపేటలో నివసించేవారు. మానస తల్లి సముద్రాల ప్రశాంతి గృహిణి, తండ్రి సముద్రాల అజయ్‌కుమార్ రేషన్‌డీలర్‌గా పనిచేసేవాడు. మానసకు ఎనిమిది నెలల వయస్సున్నప్పుడు తల్లి ప్రశాంతి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నెలల వయస్సున్న మానస కోసం ప్రశాంతి సొంత చెల్లెలైన ప్రణితను అజయ్‌కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ప్రణిత ఎల్కతుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈమెకు ఒక కూతురు ఉంది. అజయ్‌కుమార్ 2008లో అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లల చదువు కోసం ప్రణిత హనుమకొండ కిషన్‌పురలో అద్దెకు ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అప్పటి నుంచి మానస.. ప్రణిత (పినతల్లి) సంరక్షణలో ఉంటూ వస్తోంది. మానసను ఖమ్మంలోని వైద్యకళాశాలలో డెంటల్ కోర్సులో చేర్చారు. రెండేళ్ల పాటు కళాశాల సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉన్న మానస.. గత నెల 22న కళాశాలకు సమీపంలోని మరో హాస్టల్‌లో చేరి మూడో అంతస్తులోని గదిలో ఒంటరిగా ఉంటోంది.
ఈ ఏడాది నాలుగో సంవత్సరం పూర్తవుతుండగా.. గతంలో కొన్ని సబ్జెక్టులో ఫెయిలైన మానస.. మరో 20 రోజుల్లో ఆ పరీక్షలు కూడా రాయాల్సి ఉంది. అయితే మళ్లీ ఫెయిలైతే తన పరువు పోతుందేమో అని స్నేహితులకు పలు మార్లు చెప్పి బాధపడిందని తెలిసింది. ఇక రెండు రోజులుగా స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్లి కొద్ది సేపు మాట్లాడి తిరిగి హాస్టల్‌కు వస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన మానస సమీపంలోని ఓ పెట్రోల్‌బంక్‌కు వెళ్లి బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని సంచీలో పెట్టుకుని హాస్టల్‌కు వస్తున్న దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యాయి. తర్వాత హాస్టల్‌లో గదికి చేరుకున్న మానస తానుండే అంతస్థులో చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో గదికి లోపల గడియపెట్టుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. కాలిన వాసన, పొగ వస్తుండడంతో కింది అంతస్థులో ఉన్న పల్లవి అనే విద్యార్థిని పై అంతస్థుకు వెళ్లి చూడగా మానస గది నుంచి పొగ వస్తుండటంతో భయంతో కిందికి పరుగు తీసింది. హాస్టల్ యాజమాన్యంతో పాటు సమీపంలోని షాపుల యజమానులు మానస ఉంటున్న గదివద్దకు వెళ్లి తలుపులు తోసుకుని లోపలకు వెళ్లి తగలబడుతున్న దుప్పట్లు, పరుపుపై నీళ్లుపోసి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే ఆ మంటల్లోనే మానస మృతిచెందిన విషయాన్ని గుర్తించి ఖానాపురంహవేలి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని.. సోమవారం ఉదయం 8గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఘటనపై మానస పినతల్లి ప్రణిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపురంహవేలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. హాస్టల్ మారిన 15 రోజులల్లోనే మానస ఆత్మహత్య చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మానస ఉంటున్న హాస్టల్ గది ముందు ఉన్న కిటికీలో ఓ డైరీ, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతుండగా.. తమకు అలాంటివేమీ లభ్యం కాలేదని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని ఖానాపురం హవేలీ సీఐ టి.శ్రీహరి తెలిపారు. మానస విషయమై తోటి విద్యార్థులు, స్నేహితులు, బంధువులు నుంచి కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు. చిన్నతనంలోనే తల్లి, ఆ తర్వాత తండ్రి చనిపోవడం లేదంటే సబ్జెక్టుల్లో ఫెయిలైతే పరువుపోతుందన్న మనోవేదనలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తున్నా.. తాము మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
అశృనయనాల మధ్య అంత్యక్రియలు
నయీంనగర్ : మానస అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హనుమకొండలో ముగిశాయి. వరంగల్ ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హనుమకొండలోని పోచమ్మకుంట శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, బంధువుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మానసకు ప్రణిత అంతిమ సం స్కారం నిర్వహించి తలకొరివి పెట్టింది. కాగా, తమకు ఎటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు లేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు విచారణ చేపట్టి తెలుసుకోవాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.