లక్ష్యం 20 వేల ఓట్లు!

ABN , First Publish Date - 2023-06-26T15:50:39+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆందోళన పెరుగుతోంది.

లక్ష్యం 20 వేల ఓట్లు!

  • అదనంగా సాధించేలా బీఆర్‌ఎస్‌ ఎత్తుగడ

  • తెరపైకి డబుల్‌ బెడ్‌రూం, దళితబంధు, గృహలక్ష్మి

  • ఒక్కో ఎమ్మెల్యేకు ప్రత్యేక కోటా కేటాయింపు

  • జూలై నుంచి అమలు చేసేందుకు వ్యూహం

  • అంతర్గత కుమ్ములాటలపైనా సమావేశాలు

  • గ్రేటర్‌లో పట్టు సడలుతుండడంతో కొత్త డ్రామా

బంజారాహిల్స్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుత పరిస్థితులు, సర్వేలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు పెద్ద మొత్తంలో సీట్లు చేజారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ, తెలంగాణవాదుల ఓటు బ్యాంకుతోపాటు ఒక్కో నియోజకవర్గంలో 15వేల నుంచి 20వేల ఓట్లు అధికంగా రాబట్టుకునేలా కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. గతంలో గ్రేటర్‌ పరిధిలో అధిక సంఖ్యలో గెలిచిన సీట్లను చేజార్చుకోకుండా ఉండేందుకు అధిష్ఠానం కొత్త ఎత్తుగడలు వేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే గృహలక్ష్మి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితబంధు, బీసీ బంధు.. తదితర పథకాల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అలాగే నానాటికీ పెరుగుతున్న అంతర్గత విభేదాలను పరిష్కరించే పనిలోనూ పడ్డారు. పలుమార్లు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులతో సమావేశాలు ఏర్పాటు చేసి అధిష్ఠానందే తుది నిర్ణయం అవుతుందని వెల్లడించారు.

ఒక్కో ఎమ్మెల్యేకు 3 వేల డబుల్‌ ఇళ్లు

నగర శివారు ప్రాంతాలైన కొల్లూరు, ఘట్‌కేసర్‌లలో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. కొల్లూరులో సుమారు 16 వేల ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఘట్‌కేసర్‌లో కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా శివారు ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను గ్రేటర్‌ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సమంగా కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంపై గ్రేటర్‌ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. నియోజవర్గ జనాభానుబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 3 వేల నుంచి 3,500 వరకు ఇళ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ ఎమ్మెల్యే అభీష్ఠం మేరకే జరిగేలా చూస్తామంటూ మంత్రి కేటీఆర్‌ అంతర్గత సమావేశంలో చెప్పినట్లు సమాచారం. తద్వారా కనీసం 10 వేల ఓట్లు పెంచుకునేలా ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారని తెలిసింది. ఈ కేటాయింపు సక్రమంగా జరిగితే లబ్ధిదారులు బీఆర్‌ఎస్‌ పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వే బృందాలు పేర్కొంన్నాయి.

నియోజకవర్గానికి 1,100 యూనిట్లు

ఇక దళిత బంధు పథకం రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 1,100 మందికి వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తద్వారా కనీసం మూడు వేల ఓట్లు నియోజవర్గానికి పెరుగుతాయని అంచనా. గృహలక్ష్మి, బీసీ బంధు వంటి పథకాలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సద్వినియోగపర్చుకుంటే కనీసం 15 వేల ఓట్లు అధికంగా రాబట్టవచ్చని పార్టీ లెక్కలు వేస్తోంది. సంక్షేమ పథకాలు అన్నీ ఎమ్మెల్యేల సమ్మతితోనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం.

Updated Date - 2023-06-26T15:50:39+05:30 IST