Share News

ఖాకీల్లో కలవరం

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:34 PM

శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాలని ఆదేశించడంతో గ్రేటర్‌ పరిధిలో మూడు కమిషనరేట్ల బాస్‌లు రాజీలేకుండా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బందిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వేగంగా స్పందిస్తున్నారు. నిబంధనలు కట్టుతప్పకుండా కఠినంగా వ్యవహరిస్తుండడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది.

ఖాకీల్లో కలవరం

- కొత్త బాస్‌ల రాకతో అ‘టెన్షన్‌’

- క్రమశిక్షణ, విధి నిర్వహణకు ప్రాధాన్యం

- నిందితులకు వత్తాసు పలికితే కొరడా

- బాధితులకు అండగా ఉండాలంటూ ఆదేశాలు

- ఇప్పటికే ముగ్గురు సీఐలు, ఒక ఎస్‌ఐ సస్పెన్షన్‌

- మరికొందరిపై అంతర్గత విచారణ మొదలు

- తాజా చర్యలతో జాగ్రత్త పడుతున్న అధికారులు

- కొత్త ప్రభుత్వంలో శాంతిభద్రతలకు పెద్దపీట

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాలని ఆదేశించడంతో గ్రేటర్‌ పరిధిలో మూడు కమిషనరేట్ల బాస్‌లు రాజీలేకుండా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బందిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వేగంగా స్పందిస్తున్నారు. నిబంధనలు కట్టుతప్పకుండా కఠినంగా వ్యవహరిస్తుండడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. వాహనాల్లో ముందు సీట్లలో కూర్చుంటూ స్టేషన్‌కు వచ్చేవారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నారు.

ముగ్గురు ముగ్గురే..

ఈనెల 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజులకే పోలీసు కమిషనర్ల బదిలీలు జరిగాయి. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్‌ మహంతి, సుధీర్‌బాబును హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లుగా నియమించారు. వచ్చీరావడంతోనే ఉన్నతాధికారుల క్రమశిక్షణ, విధినిర్వహణపై దృష్టి సారించారు. అలసత్వం వహిస్తున్న వారిని గట్టిగా మందలించడంతోపాటు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీఐలు, ఒక ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు.

ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు

విధుల్లో నిజాయితీగా మెలగాల్సిన అఽధికారులు గాడితప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన ఆ అధికారులే చట్టాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, ఆర్‌జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లను రెండురోజుల క్రితం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి సస్పెండ్‌ చేశారు. భార్యాభర్తల మధ్య ఉన్న వివాదంలో కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ తలదూర్చి బ్యాంకు మేనేజరైన భర్తను విచారణ పేరుతో పిలిచి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అంతర్గత విచారణ జరిపించిన కమిషనర్‌ ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఓ మహిళ కేసులో అతిగా ప్రవర్త్తించారంటూ బాధితురాలి కుమార్తె డీజీపీకి ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. వీరే కాకుండా మరికొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణకు సీపీలు ఆదేశించినట్లు తెలిసింది.

అంతక్రితం ఎస్సై

ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటుకు రెండురోజుల ముందు మియాపూర్‌ ఎస్‌ఐ గిరీష్‌కుమార్‌ సస్పెండ్‌ అయ్యారు. ఓ కేసులో పీఎస్‌కు వచ్చిన మహిళ పట్ల సన్నిహితంగా మెలిగినట్లు సదరు ఎస్పైపై ఆరోపణ. అంతేకాకుండా ఇతర ఆరోపణలు కూడా ఉండగా అవన్నీ నిజమేనని విచారణలో తేలడంతో సీపీ అవినాశ్‌ మహంతి అతడిపై సస్పెన్షన్‌ వేటుతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

సినిమా స్టైల్లో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌

పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో నిందితుడు తప్పించుకోగా అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ మెడకు ఆ కేసు చుట్టుకుంది. నిందితులను గుర్తించి వారిని శిక్షించాల్సిన రక్షకులే వారిని కాపాడే ప్రయత్నాలు చేయడం సినిమాల్లో చూస్తుంటాం. అలా సినీఫక్కీలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించి అతని స్థానంలో మరొకరిని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ను హైదరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు.

గత నెలలోనూ....

హైదరాబాద్‌కు వచ్చి గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమవుతోన్న ప్రవళిక చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసు విషయంలో చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు రావడంతో అప్పటి హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య సస్పెండ్‌ చేశారు. సీఐ నరేష్‌ సకాలంలో స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగడం, ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలు, విమర్శలకు కారణమైందని అప్పట్లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

ఎన్నికల సమయంలో ముగ్గురు

అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ముషీరాబాద్‌లో ఓ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేస్తున్నాడన్న కేసులో సరైన తీరులో ప్రాథమిక దర్యాప్తు జరపలేదన్న ఆరోపణలపై సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌లపై సస్పెన్షన్‌ వేటు పడింది.

పెరిగిన జాగ్రత్తలు

పోలీస్‌ కమిషనర్ల దూకుడు చర్యలతో ఏసీపీ మొదలుకొని ఎస్సై స్థాయి వరకు అధికారుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. గతంలోనూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ వ్యవహారం ఇప్పటిలా ఉండేది కాదు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో వేగంగా చర్యలు ఉండడంతో సస్పెన్షన్ల హడావుడి పెరిగింది. దీంతో ఎక్కడ తప్పు జరుగుతోందో.. ఎక్కడ ఇరుక్కుంటామోనన్న భయం కిందిస్థాయి అధికారుల్లో పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు క్రమశిక్షణతో మెలుగుతూ వాహనాల్లో ముందు సీట్లలో కూర్చుంటున్నారు. పోలీస్‌స్టేషన్లలోనూ అందుబాటులో ఉంటూ ఎక్కడా తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫిర్యాదుదారులు, బాధితుల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదుకు తావు లేకుండా చూసుకుంటున్నారు. సివిల్‌, భూ తగాదాల్లో తలదూర్చకుండా కేవలం శాంతిభద్రతల మీదనే ఫోకస్‌ పెడుతున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 03:34 PM