ఖమ్మంలో వంటనూనె ప్రాసెసింగ్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2023-01-06T04:08:43+05:30 IST

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

ఖమ్మంలో వంటనూనె ప్రాసెసింగ్‌ ప్లాంట్‌

ఖమ్మంలో వంటనూనె ప్రాసెసింగ్‌ ప్లాంట్‌

250 కోట్ల పెట్టుబడికి గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సిద్ధం

మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల సమావేశం

కేంద్ర అవార్డుల్లో అత్యధికం రాష్ట్రానికే

పట్టణ ప్రగతి దినోత్సవంగా ఫిబ్రవరి 24: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ. 250 కోట్లతో ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ స్థాయి వంట నూనె ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ బలరాం సింగ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో గురువారం సమావేశమైంది. గంటకు 30 టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను తొలుత ఏర్పాటు చేస్తామని, తర్వాత 60 టీపీహెచ్‌లకి పెంచుకుంటామని ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు తెలియజేశారు. ఈ ప్లాంట్‌ వల్ల ఖమ్మం పరిసర ప్రాంతాల్లో సాగవుతున్న పామ్‌ ఆయిల్‌ పంట ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. 2025-26లో ప్లాంట్‌ కార్యకలాపాలను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ఫ్యాక్టరీతోపాటు పామ్‌ఆయిల్‌ రైతుల కోసం పది గోద్రేజ్‌ సమాధాన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తమ పరిశ్రమ ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని వివరించారు. గోద్రేజ్‌ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను స్వాగతించిన మంత్రి కేటీఆర్‌.. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను కోరారు. తమ ప్రభుత్వం వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తోందన్నారు.

Updated Date - 2023-01-06T04:08:44+05:30 IST